| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| ఆ. |
అర్ధరాత్ర మయిన నభ్యాగత ద్విజ | స్నాతకులకు నెదురుచని కరంబు భక్తిఁ బూజలిచ్చు పరమవ్రతుం డప్పు | డెదురు వచ్చి వారి కిష్టమెసఁగ. |
180 |
| క. |
ధీయుతుఁ డయి మధుపర్కము | సేయఁగ సమకట్టి దానిఁ జేకొనని మహో పాయుల గర్వంబు నభి | ప్రాయంబు నెఱింగి మగధపతి యి ట్లనియెన్. |
181 |
| తే. |
స్నాతకులరేని పూవులుఁ జందనంబుఁ | జనునె బలిమిమైఁగొని తాల్పఁ? జైత్యకాద్రి తటము మీ రిట్లు వ్రచ్చి దోర్దర్ప మెసఁగఁ | జులుక నద్వారమునఁ బ్రోలు సొరఁగనగునె? |
182 |
| వ. | ‘మఱియు నా కావించిన మధుపర్కంబు ప్రతిగ్రహింపనొల్లమి యిది యేమి? మీరలు వేషధారుల కావలయు; మీ వేషంబున బ్రాహ్మణత్వంబును మహాసత్త్వ దీర్ఘబాహు పృథులవక్షోలక్షణంబుల క్షత్త్రియత్వంబును బ్రకాశించుచున్న యవి’ యనిన వానికి నారాయణుం డి ట్లనియె. | 183 |
| క. |
స్నాతకులు పుణ్యకర్మస | నాతను లగుచున్న బ్రాహ్మణ క్షత్త్రియ వి డ్జాతులయందును క్షత్త్రియ | జాతి స్నాతకుల మేము జనవినుత! మతిన్. |
184 |
| వ. | ద్వారంబున మిత్త్రనివాసంబును నద్వారంబున నమిత్త్రనివాసంబును జొచ్చుట యిది బాహువీర్య సంపన్నులయిన క్షత్త్రియులకుం గర్తవ్యంబు; మఱి గంధమాల్యంబులయందు లక్ష్మి యుండుం గావున బలాత్కారంబున గంధ మాల్యంబులు గొంటిమి; నీయందుల మాకు నొండు కార్యంబు గలుగుటం జేసి నీయిచ్చు నర్ఘ్యంబు గొన నొల్ల’ మనిన జరాసంధుం డి ట్లనియె. | 185 |
| ఆ. |
మీరు నాకు నేను మీకు నెన్నండు ము | న్నహిత మాచరించినదియు లేదు; మీకు నేల నే నమిత్త్రుండ నైతి? ని | రాగసుండ సద్గుణాన్వితుండ. |
186 |
| క. |
‘సురమునివరులకు వసుధా | మరులకు భక్తుండ నుత్తమక్షత్త్రకులా చరితుండ’ ననిన ధరణీ | ధరుఁ డమ్మగధేశ్వరునకుఁ దా ని ట్లనియెన్. |
187 |
| క. |
కులరక్షార్థ మఖిల నృప | కులోద్వహునియోగమున నకుంఠితశత్రు ప్రళయవిధాయుల మయి యిం | దులకున్ వచ్చితిమి దుష్టదూషణబుద్ధిన్. |
188 |
| సీ. |
కడఁగి యత్యుత్తమ క్షత్త్రియ చరితంబు | నందు వర్తిల్లుదు నంటి, జనుల కెవ్వరి కెన్నండు నెగ్గొనరింప నే | నంటి, సత్‌క్షత్త్రియు లవని నొరులు నీయట్లు క్రూరులై నృపతులఁ జెఱఁబెట్టి | పశువరించుచుఁ బశుపతి నుమేశు వరదుఁ బూజించిన వారును గలరె? ము | న్నింతకు నగ్గలం బెద్ది యెగ్గు? |
|
| ఆ. |
కారణంబు లేక దారుణుఁ డయి సాధు | హింస సేయు కుజనుఁ డెల్లవారి కప్రియుండ కాక యప్రియలక్షణం | బొండు గలదె తలఁప నుత్తములకు? |
189 |
| వ. | నిర్దయుండై సవర్ణుండు నిర్దోషు లైన సవర్ణుల వధియించునంతకంటె మిక్కిలి పాతకం బొం డెద్ది? నీయట్టి పాపకర్ముల నుపేక్షించిన నఖిల ధర్మ రక్షణ క్షములమైన మమ్ముఁ దత్పాపంబు వొందు నని పాపభయంబున నిన్ను నిగ్రహింప వచ్చితిమి; నాకంటె నధికుండైన క్షత్త్రియుండు లేఁడని గర్వించి యొరుల నవమానించి పలుక వలదు. | 190 |
| క. |
అవినీతులయి మహాత్ముల | కవమానము సేసి మును జయద్రథ దంభో ద్భవ కార్తవీర్యులనువా | రవజితులయి రొరులచే మహాబలులయ్యున్. |
191 |
| తరలము |
అతుల విక్రమ సంపదన్ రణయజ్ఞ దీక్షితులై రిపు ప్రతతి నోర్చిన వీరు, లుగ్రతపంబు సేసినవారు స ద్గతికిఁ బోదురు గాక; యి ట్లపకారదారుణవృత్తి ను ద్ధతిని భైరవపూజ సేసిన దాన సద్గతి గల్గునే? |
192 |
| తరలము |
చెడక నా వచనంబు సేయుము; చెచ్చెరన్ ధరణీశులన్ విడిచి పుచ్చుమ; యేను గృష్ణుఁడ, వీఁడు భీముఁడు, వాఁడు గ వ్వడి; భవత్కృత దారుణం బను వహ్ని యార్పఁగ నున్న య క్కడిఁది వీరులు వీర లిద్దఱు గర్వితుల్ కురుసింహముల్. |
193 |
| క. |
కడుఁ గ్రూరుఁడవయి నృపతుల | విడువనినాఁ డాజిఁ బాండవేయులు నీయు క్కడఁచి భుజశక్తి యేర్పడ | విడిపింతురు గడిమి నిఖిల విషయాధిపులన్. |
194 |
| వ. | అనిన విని జరాసంధుండు సటాసముత్పాటన కుపితకుంజర వైరియుంబోలెఁ గడునలిగి పటు కుటిల భ్రుకుటి ఘటిత నిటలుం డగుచుఁ బురుషోత్తమున కి ట్లనియె. | 195 |
| క. |
అమితపరాక్రమమున నా | క్రమించి పరనృపుల నోర్చి గర్వించుట దో సమె? యిది సత్‌క్షత్త్రియ ధ | ర్మమ; యే నెప్పుడుఁ బరాక్రమవ్రతుఁడ నిలన్. |
196 |
| క. |
దేవార్థముగాఁ దెచ్చిన | యీ వసుధాధిపుల నేల యే విడుతుఁ బ్రతా పావజితరిపుఁడఁ గావున | నీ వెఱుఁగవె తొల్లి ధారుణీధర! నన్నున్? |
197 |