పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము
ధర్మజుఁడు దుర్యోధనుం జూచి యసూయాపరుం డైన, నారదుఁ డతనిం దేర్చుట (సం. 18-1-4)
సీ. ‘ఇతఁ డతిలోభోపహతమానసుఁడు, దీర్ఘ | దర్శిగాఁ, డితని కతమునఁ జేసి
నిఖిల దేశంబుల యఖిల నృపాలురుఁ | ద్రుంగిరి దంతి తురంగ సహిత
ముగ, ననవద్యాంగి విగతకల్మష ధర్మ | చారిణి సాధ్విఁ బాంచాలి నార్య
జనములు గనుఁగొన సభలోన నవమాన | పెట్టిన తులువ; యే నిట్టివాని
 
ఆ. తోడఁ గలసి మెలఁగుదునె? మహితాత్మకు | లార! యెచట నున్నవారు భీమ
ఫల్గునులును గవలుఁ బాంచాలియును నన్ను | నచటి కనుపవలయు’ ననుచు మరలె.
005
వ. మరలినఁ జూచి నారదుండు నవ్వుచు నతని కి ట్లనియె. 006
సీ. ‘ఓ ధర్మనందన! యీ ధరణీవిభుం | డాహవ సంపరిత్యక్త తనుఁడు
దేవతాసంభావుఁడై వెలింగెడుఁ; బుణ్య | కర్ము లెల్లను గడు గారవింతు
రితని; నితండు మహీశుల నుజ్జ్వల | క్షత్రధర్మంబునఁ గాదె త్రుంచె;
నది పాప మే లగు? ననఘ! పాంచాలి యీ | తనిచేతఁ బడుటయుఁ దక్కుఁ గలుగు
 
తే. నెగ్గులును నింక నిచ్చట నేల తలఁప? నిచొటు పుణ్యలోకము మది నీసు రోష
మను మనోవికృతులు దగునయ్య! వాని | విడిచి సమత నొందుము లోకవినుతచరిత!’
007
వ. అని వెండియు. 008
క. ‘జూదమునఁ గయ్యమున నీ | కే దురితంబులు నితాంత హృదయ క్లేశా
పాదకములు వాటిల్లె న | నాదృతములు సేయు వాని నన్నిటి ననఘా!’
009
చ. అన విని యమ్మునీంద్రునకు నవ్విభుఁ డిట్లనుఁ ‘బాపశాలి స
జ్జన సతతాపకారి కులసంక్షయ కారణరోషభాగి యి
మ్మనుజవరాధముం డితఁ డమర్తు ల్య కెల్లను మాననీయుఁ డై
మనునటె పుణ్యలోకమున? మాటలు వేయును నేల సంయమీ!
010
తే. అతని నట్లుండనిమ్ము; నా యనుజతనుజ | మిత్ర జనములఁ బాంచాలపుత్త్రి నా క
వశ్యమును నభివీక్షింప వలయుఁ జూపఁ | బనుపు వారల యున్నెడ భవ్యచరిత!’
011
వ. అని మఱియుం గలుగు మునీంద్రులఁ గలయం గనుంగొని. 012
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )