పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము
ధర్మజుఁడు దేవమునులను గర్ణాది స్వజనులఁ జూప వేఁడుకొనుట (సం. 18-3-6)
సీ. ‘సంగ్రామ మృతులైన సకలబంధులకుఁ ది | లోదకం బే నిచ్చుచుండ వచ్చి
కుంతి కర్ణుఁడు తన కొడు కని చెప్పి నా | కతని జన్మము తెఱం గంతవట్టు
విదితంబుగాఁ జేసె నది మొదలుగ నమ్మ | హావీరుఁ దలఁచిన యప్పు డెల్ల
నుల్లంబు సంతాప మొందుఁ దదీయపా | దంబు లద్దేవి పాదంబులట్ల
 
ఆ. యని సభక్తికముగ నర్చితంబులు సేయఁ | గానకునికి నేను గరము వగతు;
నతఁడు నేము నైన నమరేంద్రుఁడును మమ్ముఁ | జెనయునే త్రిలోకసేవ్యులార!
013
చ. అతని నెఱుంగకుండి వినుఁ డర్జునుఁ బంచితి నమ్మహాత్మునిన్‌
మృతుఁడుగఁ జేయఁగా; నది శమింపదు శోకము నావహించుచున్‌;
మతికి నలంత సేయు గుణమాన్యుని నాతనిఁ జూచు కౌతుకం
బతిశయ మొందుచున్న యది; యాయన యెచ్చట నుండుఁ? జెప్పరే!
014
వ. ద్రుపద విరాట యుధామన్యులు, శంఖ ప్రభృతి తదీయజ్ఞాతులును రణాగ్నికిం బ్రాణహవిస్సులు వేల్చినవారు; వారల నాకుం జూడవలదే ప్రాణసముండగు జగత్ప్రాణ నందనుని సంక్రందన తేజోవిరాజితుండగు శ్వేతాశ్వుని. నశ్వుల ననుకరించు నకుల సహదేవులను, సహజ సద్గుణ శాలిని యగు పాంచాలినిం జూడక నిలువం జాలుదునె? వారి కెవ్వరికిని నాకలోక నివాసంబు లేక తక్కెనేని సోదర రహిత స్వర్గంబునందు స్వర్గత్వబుద్ధి పుట్టదయ్యెడు; వార లెచ్చోటనుండి రచ్చోట యేను పుణ్యలోకంబుగాఁ దలంచెద; నయ్యెడ కనిచి పుచ్చుం డనిమిషవర్యులారా!’ యని పలికిన నప్పాండవాగ్రజుతో నద్దేవమును లిట్లనిరి. 015
ఆ. ‘అట్ల చేయువార మమలాత్మ! నీదు చి | త్తమున నేది దోఁచె దాని నాచ
రింప వలయు నని నిలింపేశ్వరుండు పా | టించి మాకు నప్పగించినాఁడు.
016
సీ. అని దేవదూతునిఁ గనుఁగొని ‘యిమ్మహి | తాత్ముని భీమసేనార్జునాదు
లున్నచోటికి నన్పు ‘మన్న నప్పురుషుఁ డా | దర మెసఁగంగ నా ధర్మతనయు
నిందు ర మ్మనుచుఁ దా ముందటఁ జన నమ్మ | హానుభావుఁడు వాని ననుగమించె;
నట్లు సనంగఁ గేశాస్థిసాంద్రంబు దు | ర్గం ధంబుఁ బరుషతరంబు దంశ
 
ఆ. మశక నిబిడమును దమఃకలితముఁ గ్రిమి | కీట రక్తమాంస కూట కుణప
ఘోరవిధము శాత దారుణ చంచు వా | యసరవాన్వితంబు నయ్యెఁ బథము.
017
వ. అప్పథంబునఁ బాండవాగ్రజుండు చనిచని యారంగ్రాఁగిన నూనియ వోలెం దెరలుచున్న జలంబులు గలిగి యాయస కంటక దుస్స్పర్శంబగుచుఁ దటంబున నిశితాసి పత్త్రవనంబు శోభిల్ల వైతరణియను పేరఁ బరఁగిన యేఱును దత్ప్రదేశంబున ననేక ప్రకార యాతన లనుభవించు పాప కర్ములనుం జూచి దేవదూతునితో ‘మనకుఁ బోవలయు చోటింక నెంత దవ్వుగల? దియ్యెడయును దేవతాధీనంబై యుండునే?’ యని యడిగిన నప్పురుషుం డతనితోడ. 018
తే. ‘ఈ నెలవును బృందారకాధీన; మిదియ | మనకు రావలసిన చో’ టనిన నతం డ
సహ్య దుర్గంధ ఘోర దర్శనత నచొటు | చిత్త మతిదుఃఖితంబుగఁ జేయుటయును.
019
వ. మరలి పోవం జూచిన నయ్యెడఁ గొన్ని యెలుంగులు. 020
తే. ‘భవ్యజనన! నీ గాత్రము దివ్యసౌర | భంబు బెరసిన గాడ్పు మాపైఁ గరంబు
హృద్య మై వీచుటయు దుఃఖ మెల్లఁ బాసె | భూరి సౌఖ్యంబు నొందుచున్నార మేము.
021
క. నినుఁ జూడఁ గనుటఁ బటుయా | తనలం దొరఁగితిమి పరమధర్మాత్మక! నీ
వనయము దయ నిచ్చట నిలి | చిన బ్రదుకుదు; మింకఁ గొంత సేపు నిలువవే!’
022
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )