పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
దేవతలు నహుషుని సురరాజ్యాభిషిక్తునిం జేయుట (సం. 5-11-21)
వ. పాకశాసను తెఱం గెఱింగింది. 144
క. ‘ర మ్మింద్రపదవి సేకొని | మ మ్మెల్లను నరయు’ మనిన, మానవపతి, ‘నా
కమ్మహిమకుఁ దగు మాహా | త్మ్యమ్ము గలదె? నన్ను నేల యలఁచెద?’ రనినన్‌.
145
వ. అంత నిలువక యత్యంత ప్రార్థనంబు సేసి. 146
క. యమ వరుణాది త్రిదశులు | దమ దమ శక్తి ప్రభావ దర్పంబులు భూ
రమణునకుఁ బంచి యిచ్చిరి | ప్రమోద మెసఁగంగ మునిసభామధ్యమునన్‌.
147
వ. ఇవ్విధంబున నిచ్చి, యధికబలసమన్వితుం గావించి తోడ్కొనిపోయి, పూజ్యంబగు దివిజరాజ్యంబున కభిషిక్తుం జేసిన, నతండును బరమ ధర్మపరుండై, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యాధరాది సమస్త దేవయోనులవలనను దేజోభాగంబులు పుచ్చికొని మహానుభావుండై, దివ్యముని సేవ్యంబైన యద్దేవేంద్ర పదంబు సేకొని తుంబురు నారదాది వినోద పాత్రంబులును, రంభాద్యప్సరోగణంబులుం గొలువ నభిమతభోగంబు లనుభవించుచు, మదంబు మిగిలి మన్మథాధీనుండై వర్తిల్లుసమయంబున నొక్కనాఁడు. 148
తే. మహిత లావణ్యమున నసమాన యనఁగఁ | జనిన పౌలోమి యా నహుషునకు నయన
మార్గగోచర యగుటయు, మదన బాణ | భిన్న హృదయుఁడై, ధృతిఁబాయఁబెట్టి యతఁడు.
149
క. ‘సురలోక రాజ్య పదవిన్‌ | గరిమంబున నున్న నన్నుఁ గవయం బరమా
దరలీలఁ జతురయగు నీ | సరసిజముఖి రామి యేమి చందమొ తలఁపన్‌?’
150
క. అని యప్పొలఁతిం బిలిపిం | చిన, నదియును భయము నొంది, శీఘ్రమ దేవే
జ్యుని సదనమునకు శరణం | బనుచుం జనుటయును వాసవాచార్యుండున్‌.
151
వ. పరమాదరంబున నద్దేవిని గారవించి ‘నిన్ను నహుషు దుర్వినయంబుఁ బొరయకుండ నరయువాఁడ; నాఖండలుండు నా యత్నంబున నవశ్యంబును దడయక వచ్చు’ నని యూఱడించిన. 152
క. అది యెల్ల నెఱిఁగి కోపం | బొదవఁగ నహుషుండు ‘గురున కుచితమె యే న
మ్ముదితం బిలిపింపఁగఁ దన | సదనంబున నునుచు’ టనియె సంక్షుభితుండై.
153
చ. అనుడు మునీంద్రులున్‌ సురలు ‘నక్కట నీ మహనీయ గౌరవం
బునకుఁ బరాంగనం గవయుబుద్ధి జనించుట యీడుగాదు’ నా
విని, ‘మును పూని యిమ్మెయి వివేకము గౌతముభార్యఁ బాకశా
సనుఁ డెడఁ గోరుచోఁ గఱపఁ జాలర మీ రది యెట్లు సెప్పుఁడా!’
154
వ. అనుచు నతండు కోపించిన, భయంబుఁగొని వార లా పౌలోమి నతని పాలికిం దోడ్కొని వచ్చువారై పూని బృహస్పతికడకుం జని యద్దేవి వినుచుండ నిట్లనిరి. 155
క. ‘నహుషుఁడు మహేంద్ర పదవీ | సహితుఁడు; శచికిన్‌ వరింపఁ జను నాతని; లో
కహితంబు గాఁగఁ బుచ్చుము | మహాత్మ! తచ్చిత్తమున యమర్షం బడఁగన్‌.’
156
క. అనవుడు శోకం బడరఁగ | ననిమిషగురుఁ జూచి యిట్టులను శచి ‘యటుపు
చ్చిన దూఱు రాదె? నను శుచి | యని మీ కొనియాడు టెల్ల ననృతము గాదే?’.
157
వ. అనిన విని దరహసితవదనుం డగుచుఁ బురుహూత పురోహితుండు. 158
క. ‘నహుషుండు పనుచువాఁ డటె! | విహితానుష్ఠానపరులు వీ రటె! తా లో
కహితం బటె! యిది మనకున్‌ | మహనీయమ కాక యెట్లు మానఁగవచ్చున్‌?’
159
వ. అని యుల్లసం బాడి యనిమిషులను ఋషులను జూచి యిట్లనియె. 160
తే. ‘శరణు సొచ్చిన రక్షింపఁ జాలియుండి | కడపి పుచ్చిన నూర్ధ్వలోకములు దప్పుఁ,
బుణ్యకర్మంబు లఫలతఁ బొందు ననఁడె | కమలగర్భుండు దొల్లి జగద్ధితముగ?’
161
వ. అని యనురూపాలాపంబుల నిషేధింప, వార ‘లట్లేనిఁ గర్తవ్యం బెయ్యది యూహింపు’ మనిన, ‘నద్దేవి నహుషుకడకుం జని సముచితంబుగాఁ దదీయ సాంగత్యంబున కెడవలికికొని వచ్చునది; యటమీఁద మన మందఱముం బురందరున కభ్యుదయం బగుతెఱంగాచరించువార’ మనుటయు, వాచస్పతి వచనంబులకు సంతసించి సుర సంయమి సంఘంబు లరిగిన యనంతరంబ. 162
క. పౌలోమియు నా నహుషుని | పాలికిఁ జనుటయు, నతండు భావజ వికృతి
వ్యాలోల మానసుం డయి | లీలా సంభావనా లలిత ముఖుఁ డయ్యెన్‌.
163
వ. అట్టియెడ. 164
ఉ. అల్లన యింతి యిట్లనియె ‘నారసి వాసవు కల్మిలేమియుం
దెల్లముగా నెఱింగికొని తేఁకువలే కిట వచ్చు టొప్పు; నా
యుల్లము శంకితం బగుచు నుండఁగ వేగిరపాటు మేలె? నీ
వెల్ల నెఱుంగు; దిప్పు డెడ యిచ్చుట యుక్తము నాకుఁ జూడఁగన్‌.
165
వ. అని యొడంబఱిచి కొండొకకాలం బెడ వలికికొని యింద్రాణియు మగుడం జనుదెంచె; నమరగణంబును మునిజన సహితంబుగ విష్ణుదేవు పాలికి రహస్యవృత్తిం బోయి, జిష్ణుని దురితంబు వాపుటఁ గోరిన, శౌరి కరుణాయత్తచిత్తుండై. 166
క. ‘హయమేధంబున నాకుం | బ్రియ మొనరింపంగ వృత్రభేదికిఁ బుణ్యో
దయ మగు’ నావుడు వారలు | రయమునఁ జని రందఱుం బురందరు కడకున్‌.
167
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )