పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
ఇంద్రుండు నహుషు తేజోవిశేషంబు సూచి మఱుఁగువడుట (సం. 5-13-16)
క. చని యతని నశ్వమేధం | బునఁ గల్మషరహితుఁ జేయఁ బురుహూతుండుం
దన పురికి నరిగి నహుషుం | గని తత్తేజోవిశేషకంపితుఁ డయ్యెన్‌.
168
వ. ఇట్లు వృత్రారి తన బ్రహ్మహత్య వాయుటయేకాని నహుషునంత బలంబు లేమింజేసి భయా కులితచిత్తుండై. 169
క. ఎందేనిఁ జనియె నాతని | సుందరియును నెమ్మనమున శోకోద్రేకం
బొంది ‘పురందరుఁ డరిగిన | కందువ యే నిప్పు డెట్లు గాంతునొ?’ యనుచున్‌.
170
వ. నిశాసమయంబున నుపశ్రుతి నారాధించినఁ దదీయాధి దేవత ‘నీ సత్యంబువలన నీ మగనిం గను’దని చెప్పి, యనంతరంబ సాకారయై పొడసూపినఁ బౌలోమి ‘నీవెవ్వ?’రవని యడిగిన, నదియును ‘భవత్పాతివ్రత్య సత్య శౌచంబులకుఁ బ్రియంబంది వచ్చితి; నుపశ్రుతి’ నని చెప్పి, ‘నీకుం బాకశాసనుం జూపెదర’మ్మని తోడ్కొని హిమవంతంబు నుత్తరంబున మంజుమంతంబను మహాశైలంబున కరిగి, దానియందు శతయోజన విస్తీర్ణంబైన యొక్క సరోవరంబు సొచ్చి, యచ్చట నుల్లసిల్లు పంచవర్ణ కమనీయంబులగు కమలంబులలో నొక్క నాళంబు భేదించి, ముందటఁ బ్రవేశించె; నింద్రాణియుం దోడన చని తదీయ తంతుమధ్యంబున సూక్ష్మరూపంబున నున్న సురపతిం గన్నంత, నయ్యుపశ్రుతి యదృశ్యం బగుటయు. 171
క. పతిసన్నిధి వడసి మహా | ద్భుత మందెడు శచి తదీయ పూర్వ సుకర్మ
స్తుతి సేయుచు నిలిచిన, నతఁ | డతివం గని సంభృతాదరాత్ముం డగుచున్‌.
172
ఉ. ‘ఇచ్చట నేను నిల్చు టిది యెట్టు లెఱింగితి? నన్నుఁ గాన నీ
వచ్చిన కార్య మేమి? యనవద్యగుణోత్తర ! చెప్పు’ నావుడుం
బొచ్చెము లేక యా నహుషు పోయిన పోకలు, వానికిం దగం
జెచ్చెరఁ గాలయాపనము సేసిన భంగియుఁ జెప్పె దేవియున్‌.
173
వ. చెప్పి, యుపశ్రుతి తెఱంగును నతని కెఱింగించి ‘దేవా! నీ విత్తఱింబ్రకాశుండవై, భవత్ప్రతాపంబున నహుషునకుఁ బరాభవం బొనరించి నన్ను రక్షింపక తక్కిన, నుక్కివుండగు నతని పాప నిశ్చయంబున నాపద వచ్చు’ ననిన విని వల్లభకు దివిజవల్లభుం డిట్లనియె. 174
క. ‘ఆ నహుషు బాహుగర్వ మ | నూనంబై యున్నయది సముజ్జ్వల ముని స
మ్మాన ప్రవృద్ధ మగుటను; | దానం గాలంబు వేచెదను జయమునకున్‌.
175
చ. తఱి యగు నంతకున్‌ రిపునుదగ్రత సైఁచుట నీతి; నీవు నా
కఱపిన యట్ల చేయుము; తగం జని యాతనిఁ గాంచి ‘నన్ను నె
త్తెఱఁగుననైనఁ బొందఁగ మదిం దలపోఁతయ కల్గెనేనిఁ గ్ర
చ్చఱ ‘మునివర్గ వాహనుఁడవై చనుదె’ మ్మను; మంతఁ దీఱెడున్‌.
176
ఆ. అనిన ‘నట్ల కాక’ యని పతి వీడ్కొని, | యింతి నహుషుపాలి కేఁగుదెంచె;
నతఁడు దమక మడర నద్దేవిఁ బెద్దయు | నాదరించి యిష్ట మడుగుటయును.
177
వ. ఇంద్రాణియు నిట్లనియె: ‘మన నిరూపించిన సమయంబునకుఁ గొండొక తడవు గలదు. కాలం బగుటయు నిన్ను వరియించెద; నీవు మహాముని వాహనుండవు గావలయు. అది నాకుఁ బ్రియంబు; నీకు ననన్య సామాన్యం బైన యానంబు తేజోవిశేషకరం బగు’ ననిన, నప్పలుకులకు నహుషుండు ప్రహర్షచిత్తుండై. 178
ఆ. ‘ఏను దక్క నొరుల కెవ్వరికైన న | వ్వాహనంబు నెక్క వశమె? నీకు
సమ్మతంబు గాఁగ సప్తర్షిగణము నా | యందలంబు మోవ నరుగుదెంతు.’
179
క. అని వనితఁ బంచి, యప్పుడ | మునులం బిలిపించి; మౌర్ఖ్యమునఁ దనకున్‌ వా
హనముగఁ జేసి, యొకింతయు | ననుమానము లేక తిరిగె నతఁ డెల్లెడలన్‌.
180
క. చని పౌలోమియు సురగురుఁ | గని ‘నహుషుడు వేచియున్నకాలం బెడ లే;
దనిమిషనాథున కిత్తఱి | ననుగ్రహము సేయవలయు నవహితబుద్ధిన్‌.
181
వ. శరణాగతనైన నన్ను రక్షింపు, మనిన నతం డిట్లనియె. 182
క. ‘ఆ నహుషువలన నాపద | రా నీ; నాతనికి నాతురత గావింపం
బూని యొనర్చెద వేలిమి | దానను మునివాహనత గతస్థైర్యుఁ డగున్‌.
183
క. వెరవున నీ పతి యునికియు | నరసెద’నని యూరడించి, యప్పుడ వైశ్వా
నరు నర్చితుఁ జేసి, పురం | దరు తెఱఁగుం జెప్పి యతనిఁ దడవం బనిచెన్‌.
184
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )