| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | పనిచిన వహ్నియు వనితా రూపంబునం జని మనోగతి యగుటంజేసి సర్వదిశలును, భూమ్యంతరిక్షంబులును, గిరివిపినంబులును గొండొక సేపునకుం గలయం జూచి, సంక్రందను నెందునుం గానక మగిడి వచ్చి, వాచస్పతికి నత్తెఱం గెఱింగించి, ‘నాకు జలంబులు ప్రవేశింపరామి నంద పరికింపనేరనైతి; నప్పుల వలన నగ్నియు, బ్రాహ్మణుల వలన క్షత్రియ జాతియు, నశ్మంబుల వలన లోహంబును నుద్భవించె; వాని వాఁడిమి యెల్లయెడలనుంజెల్లుఁ; దమ తమ జన్మస్థానంబులయం దడంగుం, గావున నీళ్లు నాకు సంక్షయంబు సేయుట సుప్రసిద్ధం’ బనిన విని యనిమిష గురుండు హవ్యవాహను నత్యంత గౌరవంబునం గనుంగొని. | 185 |
| మ. |
‘సకల స్థావర జంగమంబులు భవత్సాన్నిధ్యమాత్రంబునన్ వికసిల్లుం; గ్రతు వైభవంబులుఁ, జతుర్వేదంబులున్ నీవ; పా వక! నీయంద జలంబులుం గలిగె; విశ్వవ్యాప్తిమై నున్ననీ కొకచో టెట్టు లగమ్య మయ్యె? నిను నీ వూహింపు పెంపారఁగన్. |
186 |
| ఉ. |
ఏనును బ్రహ్మమంత్రముల నెంతయు నీ కభివృద్ధిఁ జేసెదం గాన విశంకతన్ సలిలగామివి గ’ మ్మనినం, గృశానుఁడుం బూనిక నేఁగి వారినిధి భూరి నదీ సరసీ తటాక సం తానము రోయుచుం జని శతక్రతుఁ డున్న సరోవరంబునన్. |
187 |
| ఉ. |
అంబురుహంబులం గలయ నారసి చొచ్చి, యొకండు నాళసూ త్రంబున నున్న యింద్రుఁ గని, రాగమునన్ గురునొద్ద కగ్ని శీ ఘ్రంబున నేఁగుదెంచి, తన కన్నతెఱంగెఱిఁగింప, నాతఁ డు ల్లంబున నుల్లసిల్లి, సురలన్ మునులం దగఁగూడి గ్రక్కునన్. |
188 |
| మ. |
దివిజాధీశ్వరుపాలికిం జని, కృతార్థీభూతచేతస్కుఁడై, వివిధ స్తోత్ర పరంపరా చతుర వాగ్విన్యాసతం బ్రీతుఁ జే సి, ‘వరిష్ఠంబగు నీదు కృత్యము ననుష్ఠింపంగ నీ వుత్సహిం పవు; నీ కేమి కొఱంత? వృత్రవధ యే పాపంబు రూపింపుమా?’ |
189 |
| క. |
శరనిధి ఫేనంబున నా | హరి వొంది జగద్విరోధి యగు వృత్రునిఁ దాఁ బరిమార్ప, నీకు విజయము | దొరకొనియెం గాక, దీన దోసము గలదే?’ |
190 |
| వ. | అని సముచితంబుగా సంబోధించిన గురుని సంభాషితంబుల నిర్దోషితుండయి నిజరూపంబు వహించి, సకల సుమనోమునిసహితంబుగా నతని సంభావించి, జంభారి ‘కర్తవ్యం బెయ్యది?’ యని యడిగిన, నాచార్యుం ‘డితం డెఱింగినను విస్పష్టంబుగా నహుషు వృత్తాంతంబంతయు వివరించెదం గాక’ యని తలంచి యిట్లనియె. | 191 |
| క. |
‘నాఁ డట్లు నీవు నీ దగు | పోఁడిమి సెడి యడఁగుటయును, భువనంబుల కె వ్వాఁడును రక్షకుఁ డయ్యెడు | వాఁడిమగఁడు లేమిఁ ద్రిదశవర్గము మునులున్. |
192 |
| ఉ. |
ఒండొరుచేతఁ బీడవడ నోపక రక్షకుఁ డైనవాని నా ఖండలతుల్యు నేమిగతిఁ గాంతుమొకో?’ యనుచున్న చోట, ‘ను ద్దండబలైక రక్ష్యము శతక్రతు రాజ్యము, దాని నేల న న్యుండు సమర్థుఁడే?’ యనుచు నొల్లరు దివ్యులలోన నెవ్వరున్. |
193 |
| వ. | అట్టి సమయంబున మునిజనసహితంబుగ ననిమిషులు నహుషు కడకుం జని మనంబుల మనుజుం డను ననుమానంబు దక్కి యతని నింద్రపదవిఁ బరిపాలించుటకుం బ్రార్థించిన, నతండును దాను హీనబలుండననిశంకించినం, దమ తమ తేజంబుల యంశంబు లతని కొసంగి శక్తిమంతుం గావించి యభిషిక్తుం జేసిన. | 194 |
| క. |
మహనీయ భవ త్పదవీ | మహితుండై నహుషుఁ డేచి, మదమున ధర్మ స్పృహ దక్కి, తన్ను నిప్పుడు | వహియింపఁగ సన్మునీంద్రవర్గముఁ బనిచెన్. |
195 |
| ఆ. |
ఇదియకాదు; మఱియు నెన్నియు దుర్విన | యములు గలవు; వాని కలసి నిన్ను వెదక వచ్చితిమి; వివేకహీనుండగు | నతనిఁ జెఱుప నిప్పు డవసరంబు. |
196 |
| వ. | అది యెట్లంటేని వినుము. నాఁడు హరి పంపునం జేసిన యశ్వమేధంబున నీ వపగతకల్మషుండ వైనను, నహుషునకుఁ దేజోహాని లేమిం జేసి యతని నాక్రమింపరాదయ్యె; నిప్పుడు మహామునుల నధఃకరించి యతండు నిస్తేజుండై యున్నవాఁడు. కావున నీ చేతం జెడు, నట్లగుటయుం దురగమేధ ఫలపరిపాకంబ; యింక నుత్సాహంబు సేయు’మనుచున్న సమయంబున యమ వరుణ కుబేరులు సోమసహితంబుగా నరుగుదెంచి పురందరుం గాంచిన, నతండు ప్రియంబంది, యప్పటి కార్యంబు తెఱంగు వారల కెఱింగించి, తగిన సంభాషణంబుల వారలఁ బ్రీతచేతస్కులం జేసి, దృష్టి విషయ దుస్సహుండైన నహుషు గెలుచు నుపాయంబు విచారించు నవసరంబున. | 197 |
| క. |
‘కష్టుం డగు నా నహుషుఁడు | నష్టాత్మకుఁ డయ్యె; దివిజనాయక! నీ యు త్కృష్ట చరితమున సురలకుఁ | దుష్టిగ నిజరాజ్య సంగతుఁడ వగు’ మనుచున్. |
198 |
| క. |
మునివరుఁ డైన యగస్త్యుఁడు | ననుదెంచిన, శతమఖుండు సమ్మతి నుచితా సన మిడి, యర్ఘ్యముఁ బాద్యము | నొనరిచి, యిట్లనియె సవినయోక్తి నతనితోన్. |
199 |
| ఆ. |
‘అధిక విభవ మెసఁగ నసమాన శక్తి స | నాథుఁ డగుచునున్న నహుషుఁ డిప్పు డేమికతన భాగ్యహీనుఁడై యుజ్జ్వల | శ్రీ దొఱంగె మునివరేణ్య! చెపుమ.’ |
200 |