| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అనిన విని యమ్మునీంద్రుం డిట్లనియె; ‘నన్నహుషుని మోచి వేసరుచున్న మును లతనికడ గోష్ఠీ వినోదంబుల నుండి ‘బ్రాహ్మణంబు లయిన మంత్రంబులు గోసంప్రోక్షణంబునందుఁ జెప్పంబడియుండు; నవి నీకుఁ బ్రమాణ భూతంబు లగునే?’ యని యడిగినం, బాపనిశ్చయుండై యతం’ డమ్మంత్రంబులు ప్రమాణంబులు గా’వనిన నే నమ్మాట నిషేధించి, ‘పూర్వాచార్యులచేత నభినందితంబులగు మంత్రంబులు నిందించుట యజ్ఞానం’బని వివాదంబు సేసితి; నతండు కోపించి మదీయ మస్తకంబు దన్నె; నతనిం గనుంగొని, పుణ్యహీనుండును, దేజోహాని దీనుండును నగుట యుపలక్షించి, ‘నీవు పూజనీయులయిన మహామునుల నిన్ను వహింపం బనిచితి; వారలు గొనియాడు మంత్రంబులు గర్హించి; తదియునుంగాక నన్ను నవమానించితి; గావున నింద్రపద భ్రష్టుండవై బహుసంవత్సరంబులు భూలోకంబున నురగరూపంబున నుండు’ మని శాపం బిచ్చి, పదంపడి యనుగ్రహించి, ‘భవదీయవంశజాతుండయి యజాతశత్రుం డను పెంపుగలిగి యుధిష్ఠిరనామధేయుండైన యొక్క సత్పురుషుని సందర్శనంబున దురితంబులఁ బాసి పుణ్యలోకంబు వడయువాఁడ’ వనినఁ, దత్‌క్షణంబ. | 201 |
| క. |
స్వర్గ పరిభ్రష్టుండై | దుర్గతికిం బోయె నతఁడు; దుష్టాత్ములకున్ దౌర్గత్యము, సుజనులకు న | నర్గళ సద్గతియు నగుట యరుదే యెందున్?’ |
202 |
| మ. |
అనినన్ దేవతలుం దపోధనులు నత్యానందముం బొంది; రా మునిఁ బూజించె నమర్త్యనాథుఁడు మనోమోదంబు సంధిల్ల, న య్యనురాగంబు చరాచరంబులకు హృద్యం బయ్యెఁ; సర్వాప్సరో జనముం గౌశికుఁ గానవచ్చె సుభగైశ్వర్యంబు శోభిల్లఁగన్. |
203 |
| వ. | తదనంతరంబ. | 204 |
| ఉ. |
పావకుఁ డాదిగా దిగధిపాలురుఁ, గిన్నర సిద్ధ సాధ్యులున్, దేవగురుండుఁ దోన చనుదేరఁగ, వైభవ ముల్లసిల్ల, నై రావణ దంతి నెక్కి యమరావతికిం జని, యింద్రుఁ డా శచీ దేవియుఁ దాను మోదమునఁ దేలి రభీష్ట వినోద లీలలన్. |
205 |
| వ. | ఇవ్విధంబున మహానుభావుం డగు నమ్మహేంద్రుండు. | 206 |
| క. |
ఆజ్ఞాభంగం బయినం | బ్రాజ్ఞేతరునట్లు దుఃఖపడి యుండఁడె? తా నజ్ఞాతవాసమును గా | లజ్ఞతఁ జలుపండె? యన్యులకు వగపేలా? |
207 |
| క. |
కావున మీ పడిన యర | ణ్యావాస క్లేశమునకు, నజ్ఞాత విధిన్ సేవకుల రైన దానికి | నోవకుఁడీ మీరు లఘుమనోవృత్తులరై.’ |
208 |
| వ. | అని యిట్లు సెప్పి శల్యుండు సభాసదులం గలయం గనుంగొని. | 209 |
| ఉ. |
కౌరవనాథుఁ డా నహుషుకైవడి నాశముఁ బొందు; వాసవ శ్రీ రమణీయుఁడై జయము సేకొని ధర్మజుఁ డంబురాశి వే లా రశనా సముజ్జ్వల విలాస మనోహర మేదినీ వధూ సార సమగ్ర భోగముల సన్నుతి కెక్కెడుఁ దానుఁ దమ్ములున్. |
210 |
| వ. | అని పలికి వెండియు నతండు పాండవాగ్రజున కిట్లనియె. | 211 |
| క. |
‘సౌఖ్యంబులు వొందు, జగ | త్ప్రఖ్యాతులుఁ జెందుఁ, దగఁ బురందర విజయో పాఖ్యానము విన్నను, ద | ద్వ్యాఖ్యానము సేసినన్ జనావలి కనఘా! |
212 |
| క. |
మోహరము నడచుచుండఁగ | నీ హరి విజయంబు విను నరేంద్రుఁడు రిపు సం దోహంబు గెల్చుటకు సం | దేహం బించుకయు లేదు ధీరవిచారా!’ |
213 |
| వ. | అనిన విని ధర్మనందనుండు మద్రపతిం బ్రస్తుతించి ‘మహానుభావా! భవదీయ భాషణ శ్రవణంబునఁ జిత్తంబు కలంక దేఱె’ నని సంభావించి యతనికి సముచితంబులగు మజ్జన భోజనంబు లొనరించి, యనంతరంబ యతండు పయనంబునకు నుద్యోగించిన. | 214 |
| ఆ. |
అతని ననుప నేఁగి యధిక సంప్రీతి నే | తెంచునప్పు డయ్యుధిష్ఠిరుండు ‘రణములోన మీరు రాధేయుఁ బలుకుట | మఱవకుండవలయు మమ్ముఁ దలఁచి.’ |
215 |
| క. |
అనుటయు మద్రేశ్వరుఁ డా | తని నూఱడఁ బలికి గాఢతరముగ నాలిం గన మొనరించి చనియె హ | స్తినాపురికి బలముతో నతిత్వరితగతిన్. |
216 |
| వ. | అట్టి యవసరంబున. | 217 |