| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
‘వారి దెస నీదు సెప్పిన | యా రథికులు ప్రబలు లగుదు రందఱు; నైనన్ వా రెల్లను నొకతల, య | మ్మారుతి యొకతల బలప్రమాణము సూడన్. |
184 |
| ఉ. |
భీముఁ దలంచినన్ మనము భీతిఁ గలంగుచునుండు నాకు, రే లేమియు నిద్ర రా; దతని నేడ్తెఱ మార్కొనఁ జాలునట్టి వాఁ డీ మొన లేఁ; డతం డలుక నెత్తిన యా గద కాలదండ; ము ద్దామ విలాసుఁడై కురు కదంబములో విహరింపకుండునే? |
185 |
| తే. |
చిఱుతనాఁడును వాఁడు నాశిక్షఁ బోఁడు; | వీరు చివ్వకుఁ జొత్తురు వైర మెత్తి; వానిచేఁ బీడ వడియును మాన; రిదియ | కాదె యీ భేదమున కెల్లఁ గారణంబు. |
186 |
| క. |
సమరమున దైత్య దానవ | సమితియు నాతని నెదుర్పఁ జాలదు; భుజయు ద్ధమున జరాసంధుని నొక | నిమిషంబునఁ జంపె; నొరులు నిలుతురె యెదురన్? |
187 |
| మ. |
బొమ లల్కన్ ముడివడ్డ, రౌద్రరస ముప్పొంగం, దనర్పన్ భుజా గ్రము, ‘లిందెవ్వఁడు నాకు మా’ ఱనుచు శౌర్యస్ఫూర్తి శోభిల్ల దు ర్దమ లీలం గదియంగ, భీముఁ గని ధైర్యం బేది కౌరవ్యసై న్యము లంతంతఁ గలంగఁ బాఱినటులై నా మోమునన్ వ్రేలెడిన్. |
188 |
| క. |
కరవాలము గద మొదలగు | పరికర మేమియును లేక బాహుబలమునం గరి గతి నడరినను వృకో | దరునకు నొకఁ డెదుర నిలిచి తలపడువాఁడే? |
189 |
| తే. |
ప్రళయకాల సముద్రము భంగిఁ బొంగి | కడు భయంకరుఁడగు భీముఁ గడవ నీఁద వశమె నా పుత్త్రులకు? విధివశము వొంది | యెదిరిఁ దమ్మును నెఱుఁగరు మదము కతన. |
190 |
| క. |
చిచ్చునకుఁ దోడు కరువలి | వచ్చు గతిన్ భీము దుర్నివార విహారం బచ్చు పడఁగఁ బ్రాపై వి | వ్వచ్చుఁడు వెస వచ్చు గాండివంబును దానున్. |
191 |
| వ. | సంజయా! వినుము; నీ కున్న రూపు సెప్పెద. | 192 |
| క. |
ఆ యర్జును మగఁటిమి కెన | యే యుగములఁ జూడ వినఁగ నెందును గలదే? నీ యెదుర నాడి నంతయుఁ | జేయుట కతఁ డోపు; రిత్త సెప్పెడువాఁడే? |
193 |
| ఉ. |
ఎక్కటి గాండివంబు నుతికెక్కి వెలుంగుట! మీఁదఁ గేశవుం డక్కజమైన తేజ! మది యాసపడండు, దనంత నర్జునుం డొక్కఁడ వైరిసేనలకు నొట్టిన మంట! ప్రతాపమూర్తు లి ట్లొక్కెడఁ గూడె, నిన్నిటి మహోగ్రపు వేఁడిమి కోర్వవచ్చునే? |
194 |
| క. |
దివిజ దనుజ సహితము లగు | భువనము లన్నిట మహేంద్ర పుత్త్రుఁడు విజయో త్సవ లీలఁ గ్రీడ సల్పుం; | దవులం బడఁడెందు నత్యుదగ్ర బలమునన్.’ |
195 |
| వ. | అని పలికి వెండియు. | 196 |
| క. |
‘కురుసేనఁ గదా! గెలుచుట | కరము భరం బర్జునునకు! గాండీవమునం బెరిఁగిన యమ్ముల మంటల | దరికొని తెగఁ గాల్చునట్టిద యగుం జుమ్మీ! |
197 |
| వ. | భీమార్జునుల కొలందులు భీష్మద్రోణు లెఱుంగునంతకంటె నెవ్వ రెఱుంగుదు? రెఱింగియు మానుషంబు వాటించి సేన మొగంబున నిలుతురు; కీర్తి వట్టి ప్రాణంబులు విడుతు; రంతియకాని చేయునది లే; దదియునుం గాక పౌత్రులగుటయు శిష్యు లగుటయు, గాంగేయునకు గురునకు సామాన్యం బగుటం జేసి, రెండు దెఱంగుల వారికి వీ రొక్కరూప; మన కడనున్న తప్పునకు మనముందట నిలువవలయునను నింత మాత్రకుంగా వీరల కింత వలసె; నేను దైవాధీనత కతంబున బిడ్డల నొత్తి చెప్పను, నియమింపనుం జాల; మొదల విదురుం డేమని చాటి చెప్పి నదియంతయుం బాటిలె; జూదంబు నాఁటనుండియుఁ గురుజాతికిం జేటు మూఁడుట దోఁచుచుండు; మంద బుద్ధియు, లోభోపహతుండును నయి దురభిలాషంబున దుర్యోధనుఁ డింతసేసెఁ; గాలపర్యాయంబునఁ గౌరవులకుఁ గడవరాని యవస్థ వచ్చె; సంజయా! నే నేమి సేయుదు? నెందుఁ జొత్తు? నెద్ది దెరు? వెవ్వరు శరణంబు? వా రిరువురుఁ గల యంతటన పోయెనే? విను’ మని మఱియు నిట్లనియె:’ | 198 |
| చ. |
‘అనుజులు నట్టి వార; ద్రుపదాది సుహృజ్జను లెల్ల నంతకం టెను బలవంతు; లాహవ పటిష్ఠుఁడు రాజు యుధిష్ఠిరుండు; స ద్వినయ వివేక శీలముల విశ్రుతుఁ డాతఁడు బంధు భృత్యులం దనకు వశంబు సేసికొనుదానికి నేర్చుఁ బ్రభుత్వ సంపదన్. |
199 |
| ఆ. |
సత్య శౌచ ధర్మశాలి దయాపరుం | డట్టి ధర్మపుత్త్రు నాక్రమింప మనము దలఁచు టెల్ల మంటలో మిడుత లు | దగ్రవృత్తి నుఱుకఁ దలఁచునట్ల. |
200 |
| వ. | కావునఁ బాండవులతోడి భండనంబునఁ గులక్షయం బగుట దప్పదు; శాంతిఁ బొందుటయ మేలు; మనవారల కది ప్రియంబగునేని దానికిఁ దగిన యత్నంబు సేసెద’ ననిన విని ధృతరాష్ట్రునకు సంజయుం డిట్లనియె: | 201 |
| క. |
‘దేవర యానతి యిచ్చిన | యీ వాక్యము లెస్స! నాఁడు నీవ యుపేక్షం బో విడిచితి; వింకను నీ | చే వత్తురు వారు; వీరి చే టొప్పుదురే? |
202 |
| వ. | అది యెట్లంటేని. | 203 |
| క. |
వారు దెస లొత్తికొనియు ధ | రా రాజ్యం బిచ్చి పోయిరా పోరా? తా రారణ్యపీడఁ బడియును | రారాజుం జెఱకుఁ బాపరా మన మెఱుఁగన్? |
204 |
| వ. | అట్టి యెడ నైనను. | 205 |
| క. |
రావించి తగవుమై సం | భావింపవ కాక, నాఁడ పాండవు లలుకం బో విడువరె? మిగులుదురే | నీ వచనంబులకుఁ? బిలిచి నిలుపుము వారిన్.’ |
206 |