| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అనిన విని దుర్యోధనుండు దండ్రి కి ట్లనియె: | 207 |
| చ. |
‘అడవులఁ గొండలం బడి మహాపద రూపఱి చన్నవారి ని ప్పుడు కొనివచ్చి కృష్ణుఁ డొక ప్రోవుగఁ గూటువమూఁకఁ గూర్చినం, బొడుతురె పాండునందనులు? భూవర! యేటికి నింతభీతి? మా కడిమియు లావు నీ వసదుగా గణుతింపకు; గెల్తు మెమ్మెయిన్. |
208 |
| తే. |
పరశురాముని గెలిచిన బల్లిదుండు | భీష్ముఁ; డవనీశు లీతని పేరు వినినఁ బాఱుచుండుట యెఱుఁగవే? పాండుపుత్త్రు | లనఁగ నెంతటివా రితం డలిగెనేని? |
209 |
| క. |
కృపుఁడును గురుఁడు నయోనిజు | లపరిమిత భుజాబలాఢ్యు, లాహవకేళీ నిపుణు, లజేయులు; వీరలు | కుపితాత్మకులైన మాఱుకొనునే హరుఁడున్? |
210 |
| క. |
ఈశ్వర వరజనితుఁడు, హరి | దశ్వ ప్రతిమాన తేజుఁ, డస్త్రకళా ని త్యై శ్వర్య ధురంధరుఁ డీ | యశ్వత్థామ గలుగ మన కని వెఱపేలా? |
211 |
| ఆ. |
సహజ కుండలుండు, శౌర్యధుర్యుఁడు, సము | దీర్ణ బాహుబలుఁడు కర్ణుఁ డిందుఁ గలఁడు; వీని కెదురు గలఁడని యెన్నుమా | ధర్మపుత్త్రుపాల, ధరణినాథ! |
212 |
| క. |
వినుము నరేశ్వర! కర్ణుని | పెనుపు; మహేంద్రుండు వచ్చి ప్రియమున శచికై తను నర్థింపఁగ నిచ్చెను | గొను మని లోకంబు లెఱుఁగఁ గుండల యుగమున్. |
213 |
| వ. | వీర లా ధర్మపుత్త్రాదుల చేతన కా దెవ్వరి చేతనుం జెడమి దెల్లంబు. బాహ్లిక సోమదత్త భూరిశ్రవ శ్శల్య సింధురాజ గాంధారరాజ ప్రభృతి మహావీరులు వీరలకంటెను శక్తి సమగ్రులు. తక్కటి రాజలోకంబును, సహాయులై వచ్చిన వివిధ దేశాధీశులును నాతోడి సుఖదుఃఖంబుల కియ్యకొని, యగ్గలికమై నగ్గినైన నుఱుకను, సముద్రంబైన నీఁదను దెంపుసేసి పొంపిరివోవుచున్నవారు. కావునఁ బాండవులకు మా దిక్కుదేఱి చూడనుం గొలంది గా, దనుమానింపకు; మిట్లునుంగాక మాకు నెవ్వరును లేక చుట్టంబులును జెలులును విడిచి, తోడు వచ్చినవారును విచ్చిపోయి, భృత్యులును విరక్తులై, వారిక పోటుమానుసులును, బంధుమిత్త్ర సహాయులును, బ్రజానురాగంబునుం గలిగినట్టిదైన నది ప్రాప్తకాలం; బింతియకాని, యేమింక వారి యడుగు లొత్తను, బాఱిపోవనుం జాల; మెల్ల భంగుల సమరంబు సేయుదుము; మా తలంపిట్టిద; నా తలంచినట్లొండె, వాసుదేవుండు దలంచిన ట్లొండె నయ్యెడు నట్లైన మే; లింత వట్టును నిర్ణయం’ బని పలికి, మఱియు నిట్లనియె: | 214 |
| తే. |
‘కులములోఁ దలవంపగు కూడు గుడువఁ | బంపఁ జూచెద, వొకళులఁ బఱతు రట్టె! వారు పై నెత్తి వచ్చినఁ ‘బోరి కోప’ | మనిన, ధృతి చేట కాక, పొం దగునె చెపుమ? |
215 |
| క. |
నీవు బతిమాలి కొడుకుల | చావునకును జేటునకును జాలక, యిమ్మై వా విడిచి యఱచినం గడు | నేవ పడరె జనులు? నిన్ను నే మననేర్తున్? |
216 |
| తే. |
భీమసేనుని నీ వింత పెద్ద చేసి | పెక్కు భంగులఁ జెప్పితి ‘యుక్కు గలఁడు, గదకు నేర్చు నం’ చెంతయు బెదరె; దతఁడు | నన్నుఁ బోలమి యెఱుఁగవే నరవరేణ్య? |
217 |
| మ. |
గద నాతో ‘సరి మూఁడు లోకముల నేఁ గానం; జలం బెత్తి యు న్మదుఁ డా భీముఁడు న న్ననిం దొడరిన న్వజ్రప్రహారంబు బె ట్టిదమై తాఁకినఁ గూలు పర్వతము మాడ్కిం గుంభినిం గూలవ్రే సెద! నా కోర్కి గదా గదారణము వచ్చెం బెద్దకాలంబునన్! |
218 |
| ఆ. |
అతఁడు వడిన వెండి యా సేనఁ గోల్తల | సేయ నొకఁడు లేమి సిద్ధ; మింత యెఱిఁగి వెఱచి కాదె ‘యే నూళ్ళు లైనను | దమకుఁ జాలు’ ననియె ధర్మసుతుఁడు. |
219 |
| వ. | అర్జునుండు గలం డని తలంచితివేని. | 220 |
| తే. |
కర్ణు పడసిన యా శక్తి గలుగఁ, బోర | బ్రదుక వచ్చునె నరునకు? నదియుఁ గాక, యతని భీష్మాది రథికుల యతులితాప్ర | మేయ దివ్యబాణంబులు మ్రింగికొనవె? |
221 |
| వ. | దుశ్శాసన దుష్ప్రహ దుర్ముఖ వివింశతి వికర్ణ చిత్రసేనాదులగు నీ కొడుకు లొకం డొకండ జగంబులెల్ల జయింపఁజాలుదు; రందఱు నొక్క మొగంబై త్రోచి నడచిన సవ్యసాచి నొక్కరుండ కాదు; పాండవులనెల్ల నొక్కెత్తున వైచికొన నోపుదు; రట్లునుంగాక, మాకు నక్షౌహిణులు పదునొకండు, వారికి నే డక్షౌహిణులు, మా సైన్యంబు సారవంతంబు; వారిబలంబు నిస్సారంబు; వారు మమ్మెవ్విధంబున జయింపనోపుదు? రీ యెక్కువ తక్కువలు విచారింపక వలవని వెఱపు గట్టికొని ముక్కూరి వగచుచున్నవాఁడవు; నిన్ను వగవకుండ నుడుపం జాల మంతియ కాని, తక్కెల్ల పనులకుం జాలుదు’ మని పలికి, సంజయు దెసఁ గనుంగొని సుయోధనుం డిట్లనియె: | 222 |
| క. |
‘నానాదేశంబుల బలు | మానుసులం గూర్చికొని సమత్సరబుద్ధిం దా నే మనియెడు నయ్యమ | సూనుం డాతని తెఱంగు సూతము చెపుమా!’ |
223 |
| వ. | అనిన విని సంజయుం డిట్లనియె : | 224 |