పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము
సంజయుఁడు దుర్యోధనునకు ధర్మరాజు నిశ్చయం బెఱింగించుట (సం. 5-55-2)
ఉ. ‘ఆతఁడు భండనం బనిన నార్చిన మూరెఁడు వేర్చు; నెంతయుం
బ్రీతి వహించి తమ్ము లొక పెండ్లికిఁ బోయెడు నట్ల యున్నవా;
రా తెలి వెందునుం గలదె? యందలి నాయకు ‘లెప్పుడొక్కొ మా
చేతుల తీఁట పుత్తు?’ మను చిత్తమ కాని చలింప రేమియున్‌.
225
తే. నరుని పాశుపతాది బాణముల పెంపు, | భీము గద సొంపు నమ్మి యుద్దామ లీలఁ
జెలఁగి వెఱపేది యక్కడి బలము ముసురు | గవిసి యెపుడుఁ గయ్యమునకుఁ గాలు ద్రవ్వు.’
226
క. నావుడు ‘నిది యౌ, సంజయ! | కైవారము సేసె దీవు కౌంతేయుల; వా
రేవి రణ సాధనమ్ములు | గా వెఱవక నడచువారు కౌరవుల పయిన్‌?’
227
వ. అనిన సుయోధనునకు సూతనందనుం డర్జును దివ్యరథ శ్వేతాశ్వ కపిధ్వజ దేవదత్తంబుల మహానుభావంబులు వేఱువేఱ వర్ణించి చెప్పి, యుధిష్ఠిర భీమ నకుల సహదేవుల యరదంబులు, తురంగాది పరికరంబు లిట్టిట్టి వని యేర్పడం బలికి, విరాట ద్రుపదాదులకు వలయు నుపకరణంబులు గొఱంత లేమియు నెఱింగించిన, ధృతరాష్ట్రుం ‘డిందుఁ గల బలు మానుసు లెవ్వరికి నసాధ్యులు. వీరి సాధించుతెఱం గూహించిరే?’ యని యడిగిన నతనికి సంజయుం డిట్లనియె: 228
సీ. ‘గంగాసుతుండు శిఖండిపా, లతనికిఁ | బ్రాపు మత్స్యేశ్వరు బలము; కుంభ
భవుఁడు ధృష్టద్యుమ్ను పా, లతనికిఁ దోడు | పడు ద్రౌపదీ పుత్త్ర పంచకంబు;
రారాజుఁ, దమ్ములు మారుతి పాలు; కు | మారు లందఱు నభిమన్యు పాలు;
శకుని సైంధవులు, నశ్వత్థామ కర్ణులుఁ, | దక్కొరుచేఁ బోని దండిమగలు
 
ఆ. సవ్యసాచి పాలు; సాత్యకి పాల్‌ కృత | వర్మ; చేకితాన వసుమతీశు
పాలు సోమదత్తుఁ; డాలంబునకు నిట్లు | నిశ్చయించి రచట నృపవరేణ్య!
229
క. నకులుఁడు, సహదేవుండును, | శకుని నులూకాది సుతుల సారస్వతులం
బ్రకటబలులైన కాళిం | గకులను సమయించువారు కౌరవనాథా!
230
క. కేకయులు మనలఁ గలిసిన | కేకయుల జయించువారు; కృతపుణ్యుఁడు సు
శ్లోకుఁడు ధర్మతనూజుఁడు | లోకోత్తరు శల్యుఁ దా గెలుచువాఁ డధిపా !
231
వ. అట్టి పలుకుల సమయంబున నచ్చోటఁ గొందఱు జనంబులు ధర్మనందను నుద్దేశించి. 232
క. ‘ఇతఁ డెక్కడ? మద్ర మహీ | పతి యెక్కడ? నితని కతఁడు సాటియె?’ యనుడుం,
బ్రతివచనంబుల శల్యుని | యతి బల శౌర్యములు వారి కాతఁడ చెప్పెన్‌.
233
వ. ఇట్లు గాకయు నెవ్వరి మొగంబున నెవ్వరు వడిరి, వారికి వార చాలియుండు వా రని; రివ్విధంబునఁ గ్రొవ్వు మిగిలి కొఱంతలేని తెగువం దేజరిల్లుచున్నవారు. నీకు నీ కొడుకునకు నెయ్యది గర్జంబై తోఁచె నదియ చేయుం’ డనిన విని విచిత్రవీర్యతనయుం డిట్లనియె. 234
క. ‘నా కొడుకుల కెక్కడి బ్రదు? | కే కొలఁది దలంపు నిప్పు డెన్నిన వీరా
నీకంబు నోర్వవచ్చునె | యీ కూడిన సైనికులకు? నే మనువాఁడన్‌?
235
క. రాజు యుధిష్ఠిరుఁడై, హరి | దా జయ మొడఁగూర్ప నున్నఁ, దత్సైన్యము రా
రా జిట్లు సరకు సేయమి | నా జన్మము దుఃఖభాజనం బగుటఁ జుమీ!
236
క. నా కుడుప నేల వశమగు? | నీ కూడిన భూపతులకు నింతియ కాలం
బై కడచన్నది సంజయ! | నీ కీ వగపేల? యింక నిలుపుము పలుకుల్‌.’
237
వ. అనిన విని దుర్యోధనుండు నిజ జనకునితో నిట్లనియె : 238
ఉ. ‘ఏమును బాండునందనులు నేక కులంబునఁ బుట్టి యొక్కచో
నే మొకఁడైనఁ జేసి గెడ నెప్డుఁ జరించినయట్టివార; ము
ద్దామబలంబు శౌర్యమును దర్పము వారిక కల్గి, వార సం
గ్రామమునన్‌ జయింతు రనఁగా నొక నిశ్చయ మెట్లు గల్గెడున్‌?
239
ఉ. వారిని, వారివారి నిటు వర్ణన సేసెదు గాని, మమ్ము మా
వారిఁ దలంప; వి ప్పుడమి వారికిఁ బాయను, మాకు నంతయున్‌
జేరను మున్‌ సృజించె విధి సిద్ధము, దీని నొకండు మాన్పఁగా
నేరఁ; డకారణంబ మది నెవ్వగ లేటికిఁ బట్టుకొల్పఁగన్‌?’
240
వ. అనిన విని సూతనందనునకు నంబికానందనుం డిట్లను- ‘నా కొడు కున్మత్త ప్రలాపంబులు సేయుచున్నవాఁ; డింతియకాని సత్యధర్మ నయ పరాక్రమ సహాయ సంపన్నులైన పాండవులఁ దనకు గెలువ వచ్చునే? తాను బ్రబలుం డయినను బెనఁకువ గీడ కాక మేలగునే? యది యట్లుండె; నొక్కటి యడిగెద సంజయా! చెప్పుము. 241
క. సమరమునకుఁ బురికొల్పుచు, | మముఁ దలఁచిన నుల్లి కుట్టు మాటలఁ దచ్చి
త్తము లుడికించుచుఁ బాండవ | సమితిం గడఁగించువా రచట నెవ్వరొకో?’
242
క. నావుడు సంజయుఁ డిట్లను; | ‘దేవా! పాండవుల యలుక ధృష్టద్యుమ్నుం
డే వెరవుమాటనైనను | నే వోసిన యగ్ని భంగి నిగుడం జేయున్‌.
243
వ. అతండు ధర్మతనయుతో నిట్లను: ‘గాంగేయ కుంభసంభవాది మహావీర క్రూరసత్త్వ బహుళంబును, గరిఘటా గిరి కదంబ కలితంబును, దురంగ నికర తరంగ పరంపరా ఘోరంబు నగు కౌరవసేనా సముద్రంబునకు నేనొక్క చెలియలికట్టనై నిలిచెద’ ననవుడు నయ్యుధిష్ఠిరుండు ‘నీ వింతకుఁ జాలుట యెవ్వరు నెఱుంగరే? యెట్లును సంగరంబున మమ్ముద్ధరింపు’ మనియె; నిట్లు గొనియాడిన, నాతండు నా దెసం గనుంగొని, ‘సంజయా! మీ వారల కెల్లనుం దెలియం జెప్పు; మీశ్వరాది దేవతలు సమకట్టిన సవరణగల యర్జునుచేత నిర్జింపంబడిన యుత్కృష్టజాతు లనేకు లగుట యెఱుంగుదుర కాదె? మనుష్యు లతనికెంత పెద్ద? యిట్టి జెట్టి వెన్నుదన్ని చూడఁగలవాఁడు గావున, మముబోంట్లెల్లఁబోక పెనంగినం, బోరు భరంబైనం, బ్రాణంబులపై వచ్చు; నంతకంటెను బరమ దయాపరుండైన పాండవాగ్రజు మఱువు సొచ్చి బ్రదుకుం డను; మంతలంతలు దప్పులు సేసితి మని తలంక వలవ; దెంత సేసినను, గౌంతేయ పూర్వజుండు శాంతి సుధానిధి యగుటంజేసి శరణు సొచ్చినం గాచు’ నని పలికె’ ననిన విని ధృతరాష్ట్రుండు దుర్యోధనున కిట్లనియె: 244
క. ‘పరిజనులకు నీకును ని | ద్ధరలోన సగంబు సాలుఁ; దక్కటి సగముం
గర ముచితంబుగఁ బాండవ | వరుఁ డగు ధర్మజున కిచ్చి బ్రదుకుము నెమ్మిన్‌.
245
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )