పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము
ధృతరాష్ట్రుఁడు దుర్యోధనునితో సంధి సేయుమని చెప్పుట (సం. 5-57-4)
చ. పెనఁకువ నాక యేల మన పెద్దల కెవ్వరి కియ్యకోలు గా;
దనుచిత వృత్తి గాన గురుఁడాదిగ నాప్తులు బంధుమిత్రులున్‌
గొనకొని పోరికిం జొర; రకుంఠిత తేజుఁడు ధర్మపుత్రుఁ; డా
తనిఁ దగఁ గూడి మన్కి ప్రమదం బగుఁ గౌరవజాతి కెంతయున్‌.’
246
వ. అని వెండియు. 247
క. ‘కర్ణుండు రేఁచి పెట్టఁగ, | దుర్ణయపరులైన శకుని దుశ్శాసను లీ
నిర్ణయమె మేలనఁగ, నీ | కర్ణములకు నించు నెట్లు కార్యవచనముల్‌?’
248
వ. అనినఁ గటకటంబడి సుయోధనుం డిట్లనియె : 249
క. ‘నీ చెప్పెడి పెద్దలు ద్రో | ణా చార్యులు మొదలుగాఁగ నని కొల్లని వా
రై చేరని వారిం గొని | యే చక్కం బెట్టువాఁడ నేఁ బాండవులన్‌?
250
శా. రాధేయుండును దుస్ససేనుఁడును బోరం బ్రాపుగాఁ బాండవ
క్రోధజ్వాలల నార్తు; నొండొకఁడు నాకుం దోడె? నీ వింక నన్‌
బాధం బెట్టకు; వాఁడి సూది మొనమోవంజాలు నంతైన నే
నీ ధాత్రీతల మీను వారలకు; నాకే లింత సేగిం బడన్‌?’
251
వ. అనిన గాంధారీవల్లభుం డతని కిట్లనియె: 252
ఆ. ‘నీకు నంత వగవ; నీపోవు తెరువునఁ | బోవు వారు గాఁగఁ బూనియున్న
వారికెల్ల నేను వగచెదఁ; గయ్యంబు | వలవ దుడుగు మయ్య చలము గొనక.
253
చ. ఉభయ బలంబులుం బొగడ నుగ్రత భీముఁడు విస్ఫురద్గదన్‌
రభస మెలర్పఁ గుంభములు వ్రయ్యఁగ వ్రేసిన, నెత్తు రొల్కఁగా
నిభముల పిండు గావి సెలయేఱుల తోడి నగంబులట్లు సం
క్షుభితములై పయిం బఱవఁ జూచి తలంచెదు నాదు వాక్యముల్‌!
254
చ. ఉఱక ధనంజయుండు వివిధోగ్ర శరంబుల నొక్క మాత్ర నే
డ్తెఱ నుఱుమాడినం బుడమిఁ ద్రెళ్ళిన నీదగుసైన్యమంతయున్‌
నఱకినఁ బడ్డ ఘోర విపినంబు విధంబున నున్నఁ జూచి, య
త్తఱి నయినం దలంపు ముచితంబగు నా వచనంబుఁ బుత్త్రకా!’
255
వ. అని పలికి, యతని వలనం బలుకుగానక మనంబు మరలంబెట్టు కొని కొడుకులు జయింప నోపుదురొకో యను నాస సంజయు దిక్కు మొగంబుసేసి పాండవ కౌరవ పక్షంబులం గలవారి నడుగుచుం, గొలందులు దలపోయుచు, నాతని వచనంబులం దన విచారంబులను బలాబలంబులు నిశ్చయించి, పాండవేయు లెక్కు డవుట యెఱుంగుచుఁ, గ్రమ్మఱ నా సూతపుత్రుతో లెక్కలు వెట్టుచుం, బోలించుచుఁ, బెద్దప్రొద్దు వితర్కించి, కౌంతేయుల శక్తి దేవశక్తియు, గాంధారేయుల శక్తి మనుష్యశక్తియుంగాఁ దెలిసినవాఁడై, యంబికానందనుండు నిజనందనునితో నిట్లనియె: 256
క. ‘నరుఁ డగ్నిదేవుఁ దనకును | వరదునిఁగాఁ గొలిచినాఁడు; వానికిఁ గేతు
స్ఫురణం బాదిగఁ గల సం | గర పరికర మెల్ల నతఁడు గావించె దయన్‌.
257
వ. అదియునుం గాక ధర్మదేవతయు, వాయుదేవుండును, వాసవుండును, నాశ్వినులును వారలకుఁ బాండురాజు తోడి వారలు; వారి నొక కీడునుం బొరయకుండ రక్షింతురు గావున, భీష్మ ద్రోణ ప్రముఖులకుఁ బాండవులం బరిభవింపరామి దెల్లంబు. 258
క. దేవత లేటికిఁ? బార్థుఁడు | దేవ సముఁడు గాఁడె? వాఁడు దివిజులచేతం
బోవని దైత్యులఁ జంపఁడె? | యీవును నీవారు నతని నెఱుఁగరె చెపుమా?
259
వ. కౌరవులకు వచ్చిన యిమ్మహాభయంబునకుఁ బ్రతీకారంబు శాంతిం గడచినయది లే; దెన్ని భంగులం జూచినఁగయ్యం బుడుగుటయ మనకుం గర్తవ్యంబై యున్నయది; యుపశమింపవయ్య! దీర్ఘ వైరంబు వలవదనినఁ దండ్రికిఁ గొడు కిట్లనియె: 260
క. ‘దేవత లర్జునునకుఁ దో | డై వత్తు రనంగ వలవ; దది యెట్లనినన్‌
దేవత్వము రాగద్వే | షావేశము లేమిఁ గాదె యైనది మొదలన్‌?
261
వ. కావున వా రొకళ్ళవారుం గా; రట్లుంగాక పక్షపాతులై పూని వత్తురయేని నది దేవత్వంబు గా; దట్టి దేవత్వంబున నర్జునుండును సురక్షితుండు గానేరఁడు; నీకు నా పనికిఁ జింత వలవ’ దని పలికి, వెండియు నిట్లనుఁ; ‘బెఱిగి వచ్చు కార్చిచ్చు నుడుపను, బాషాణ వర్షంబు వారింపను, మహావాయువు నిలుపను, నీళ్ళు గట్టిగా నభిమంత్రించి వానిపైఁ గరి తురగాదుల నడపింపను, నా సేన నడచునప్పుడు వలసినచోట జలంబు లుత్పాదింపను జాలుదు; సింహ శరభ శార్దూల భూత బేతాళాది క్రూరసత్త్వ సంరంభ స్తంభన ప్రకారం బెఱుంగుదు, మిత్త్రశత్రు విషయంబులైన శుభాశుభంబులు వలయుభంగి నావహింపనేర్తు; మఱియు నానావిధ సిద్ధి ప్రదంబులగు మంత్ర ధ్యానాద్యనుష్ఠానంబుల నాకుం గొఱంత లేదు; నీ చెప్పిన యగ్నిప్రముఖ దేవతలం బ్రసన్ను లగునట్లుగా నారాధించినవాఁడ; వారికి నాకుం బోలె మహానుభావంబు గలిగినఁ బదుమూఁడు వత్సరంబు లబ్భంగి నిడుమలం బడుదురె? వినుము చెప్పెద. 262
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )