పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము
దుర్యోధనుఁడు తండ్రితోఁ దన బలపరాక్రమంబులు సెప్పుట (సం. 5-60-20)
క. ఏ నలిగిన వారిని సుర | లైనను రక్షింపనోప; రమరు లలిగినం
బూని చెడకుండఁ గాతును; | మానవు లొక సరకె నాకు మనుజాధీశా?
263
తే. గర్వమున నాడు మాటలుగాఁ దలంప | వలవ; దిది యెల్ల నిక్కంబు; వసుమతీశ!
నన్ను నేఁ జెప్పికొందునే యెన్నఁడైన? | నాత్మసంస్తుతి పౌరుషం బగునె చెపుమ?
264
వ. ధర్మతనయాది పాండవేయులును, ద్రుపదాది పాంచాలురును, విరాటాది మాత్స్యులును, వాసుదేవాది యాదవులును, మఱియునుం గేకయ పాండ్య మాగధ చైద్య ప్రముఖ నిఖిల దండనాయకులును నాబారింబడి మున్నీరు సొచ్చిన యేఱుల చందంబున నడంగిపోవుట యవధరించెదుగాక! వారెల్లఁ దేజోధైర్య పరాక్రమోపాయ విచార వివేకంబుల నాయెత్తు వత్తురె? పితామహ ద్రోణ కృపాశ్వత్థామలు శస్త్రాస్త్ర విషయంబులుగా నేమేమి యెఱుంగుదు రెంతెంత నేర్తు రది యెల్ల నెఱుంగుదు; నంతయు నేర్తు’ నని పలికి, యందఱు వెఱఁగుపడియుండం, దాను సంజయుతో సంగరంబు తెఱంగు నాలోచనంబుగాఁ బాండవుల దెస మాటలాడుచుండఁ గర్ణుండు ధృతరాష్ట్రుం గైకొనక, ధార్తరాష్ట్రునకుం బ్రియంబుగా నిట్లనియె: 265
క. ‘గురు నలుక నాకు నస్త్ర | స్ఫురణ మెడలె నండ్రు జనులు; బొం కది; పూజా
పరతమెయి నమ్మునీశ్వరు | కరుణ గొఱలి మగుడఁ బడయఁ గాంచితిఁ బ్రీతిన్‌.
266
ఉ. కావున నస్త్రశస్త్రము లఖండిత సంపద నొంది యుండు; దే
వావలికైన నన్నుఁ జెనయన్‌ భర; మేఁ గలుగంగ నర్జునుం
డే విడిపించు మేదినిఁ? గడింది మగంటిమి యుల్లసిల్లఁగా,
నీవు బలంబు మెచ్చ నని నిల్చెద గెల్చెదఁ బాండవేయులన్‌.
267
శా. గాంగేయాదులు నీకడన్‌ నిలిచి వేడ్కం జూడఁగా సర్వ సే
నాంగాంగంబులమీఁద గాలియును జిట్టాడంగ నీ కేను వీఁ
కం గౌంతేయులఁ దాఁకి, తత్తనువు లుగ్రస్ఫారబాణాలిఁ గూ
లం గోదండ విలాసముల్‌ మెఱయ లీలం బోరఁ గ్రీడించెదన్‌,’
268
వ. అనిన విని యిననందనునకు మందాకినీనందనుం డిట్లనియె: 269
క. ‘కాలుఁడు ప్రేరేపఁగ నిటు | ప్రేలినయంతటన నిన్నుఁ బెద్దగఁ దలఁపం
బోలునె మాకును? నుడుగుము; | చాలుదు నీ వెల్ల పనులు సాధింపంగన్‌!
270
ఉ. కూలెడువారె పాండవులు? ఘోరపుఁబోర నొకం డొకండ యీ
చాలెడువార లెల్ల మును చావఁ, గ్రమంబున సేన లన్నియుం
గూలఁగఁ గౌరవుల్‌ పిదపఁ గూలుదు; రింతియకాక, నోరి చే
టేల? వృథాభిమానమున నిన్నియుఁ బ్రేలెదు సూతనందనా!
271
తే. దివిజపతి నీకు నిచ్చిన తీవ్రశక్తి | చేతఁ గవ్వడి వడునని చూతువేని
వాసుదేవునిచే నది వ్రయ్యలయ్యుఁ, | దునియ లయ్యును, బొడియయ్యుఁ దొరఁగు ధరణి.
272
క. సర్పముఖ శరము గల దను | దర్పంబునఁ గ్రీడిఁ దొడరఁ దలఁపకు; హరి పెం
పేర్పడఁగ నదియ కా, దట | తీర్పవలయువాని నెల్లఁ దీర్చు నరునకై.’
273
వ. అని పలికి, ధృతరాష్ట్రునితో నిట్లనియె: 274
క. ‘జ్ఞాతులు దమలోఁ బొందినఁ | జేతో మోదమున వెలిఁగి చెలు వొందుదు; ర
న్నీతిం బాసిన విగత వి | భూతిం గడకొఱవులట్ల పొగయుదు రధిపా!
275
వ. కావునఁ దమలో విరోధం బొప్పదు; సంభాషణ సహభోజనాది సత్కారంబులను, సవినయ వర్తనంబులను బ్రీతులైన జ్ఞాతు లిహ పరార్థ సాధకు లగుదు’ రని చెప్పి వెండియు. 276
క. ‘విను మే నొక శైలమునకు | మును భూసురవర్గ సహితముగ నొకపనికిం
జను నెడఁ జనరాని తటం | బున నొక జున్నుండె; దానిఁ బొగడిరి తద్‌జ్ఞుల్‌.
277
తే. ‘దీని తేనియఁ ద్రావిన మానవులకు | జరయు రుజయును డప్పియుఁ జావుఁ గలుగ’
వనఁగఁ, గొందఱు బోయలు విని, కడంగి | యుఱక మొఱకలై చఱిఁబడ నుఱికి రపుడు.
278
వ. ఇట్లుఱికి మృతిఁ బొంది; రట్లపోలె నవినీతు లైన నీ కొడుకులు పుడమి యెల్లను దార యేలుతీపుఁ జూచెదరుగాని తమ పొలిసి పోవుటం గానరు; వీర లర్జునుతోడం బెనంగి మానప్రాణంబులు దక్కించుకొనువారె? యట్లుంగాక సమబలులైననుం గయ్యంబునఁ గదా వీరౌదురు వారౌదు రనవచ్చు; నదియేల నీలోనికి ధర్మనందనుం దెచ్చికొనుటయ నీకుఁ గర్తవ్యం’ బనిన బాహ్లికుండు ధార్తరాష్ట్రున కిట్లనియె: 279
క. ‘కను బ్రమసిన తెరువరి తన | కనపాయం బైన మార్గ మరసి తగ నెఱిం
గినవారు సెప్పఁగాఁ గై | కొనని కరణిఁ దగిన వెంటకుం జొర వకటా!’
280
వ. అనిన వైచిత్రవీర్యుండు దుర్యోధనున కిట్లనియె: 281
మ. ‘కొడుకా! యే నెటు లట్ల బాహ్లికుఁడు నీకుం గూర్చు, భీష్ముండు నీ
యెడ సస్నేహుఁడు, వీరి మాట విను; మే మీ మువ్వురున్‌ మన్ననల్‌
వడయంగాఁ దగునట్టివారము; నినుం బ్రార్థించెదన్‌ ధర్మజున్‌
విడువంగాఁ దగ, దిమ్ము వారలకు నుర్విం బాలు నెమ్మిం దగన్‌.’
282
క. అనినను వెండియు నొడఁబా | టునకుఁ జొరని దానికిం గొడుకుతోడఁ గడుం
గినిసి ధరణీశ్వరుం డి | ట్లనుఁ గొలువున నున్న వార లందఱు వినఁగన్‌.
283
తే. ‘బవరములు గావె! విఱిగిన బార సాఁప | వచ్చునే? యొక్కరుండ వివ్వచ్చుఁ డడరి
పసులఁ బెట్టించునపుడు నీ బలము విఱుగ | దయ్యెనే? నీవుఁ గర్ణుండు నచట లేరె?’
284
వ. అని రాధేయు దిక్కు మొగంబై మఱియు నిట్లనియె: 285
ఆ. ‘నాఁటి కొలఁది గాదు; నారాయణుఁడు నొగ | లెక్కఁ, గెలన భీముఁ డేచి నడవ,
ననుజ తనుజ సహితుఁడై వచ్చు వివ్వచ్చు | మార్కొనంగ వశమె మనకుఁ గర్ణ!
286
చ. బలమును దర్పమున్‌ మెఱయ బంటుతనంబున నీవు పాండవే
యుల నని మార్కొనం గడఁగు టొప్పెడు తెంపగుఁ; జచ్చి శుద్ధుఁడై
పలుకులు మాన్పు భృత్యుఁ డను పాటి దలంచెద; విట్లు మేలె? య
చ్చలమున నీ సుయోధనుని చావున కోర్చుట గాదె యంతయున్‌?
287
వ. అనిన విని కానీనుండు సంక్షుభితమానసుండై ‘యిది యెల్ల నిట్లయ్యె; నిట్లుం గాక, తక్కినయది యట్లుండె; నదీ సూనుండు నన్ను నిరాకరించి పలికిన పలుకుల ఫలం బనుభవించుం గాక!’ యని యతని నుద్దేశించి యిట్లనియె: 288
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )