పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
శ్రీకృష్ణుండు కుంతియింటికిం జని యాయమతో మాటలాడుట (సం. 5-129-20)
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియెఁ గృష్ణుం డత్తెఱంగున వెడలిన విస్మితయై గాంధారి యభ్యంతర మందిరంబున కరుగం గౌరవులెల్లను బంధుమిత్ర సహాయ సహితంబుగాఁ దనతోడన వెడల, మొగంబు గంటు వెట్టికొని కక్ష్యాంతరంబులు గడచినప్పుడు దారుకుండు తేరినొగలపై నుండి పొడసూపి కేలు మొగిడ్చి ఫాలభాగంబునం గదియించినం, దత్ప్రదేశంబున నిలిచి, వారలదెస మరలిచూచి ‘మీ రింక నిలువుం’ డని పలికిన నాంబికేయుండు పుండరీకాక్షుం జేరి నిజతనూజుల నుపలక్షించి. 2
ఉ. ‘వీరును బాండుపుత్త్రులును వేరము దక్కి పొసంగి మన్కికై
పోరితమాడి యే నటులు బుద్ధులు సెప్పిన భంగియుం, గులా
చారము నిర్వహింపఁ బలుచందములం దగ దుఃఖపాటు నీ
కౌరవజాతికిం దెలిసెఁ గాదె గదాధర! నీదు సన్నిధిన్‌.’
3
వ. అని వెండియు. 4
తే. ‘నీకు శుద్ధుండ నగుటయ నిఖిలబంధు | మిత్ర గురుజన కోటికి ధాత్రి కెల్ల
నంబుజాక్ష! నిర్దోషుండ నగుట; గాన | నా తెఱంగు నీ వెఱుఁగుట నాకుఁ జాలు.
5
వ. అనిన విని యచ్యుతుండు బాహ్లిక భీష్మ ద్రోణ కృప ప్రముఖ నిఖిల విశిష్టజనంబుల నాలోకించి. 6
తే. ‘ఇప్పు డీ సభఁ బుట్టిన యింతవట్టు | మీకుఁ దెల్లంబు గాదె! యీ మేదినీ వి
భుండు దా నేమిటికిని ముఖ్యుఁడఁ గాను | దప్పు దనదెస లేదని చెప్పి విడిచె.
7
వ. కావున నాకు నియ్యెడం దడయం బనిలేదు; పోయివచ్చెద; ధర్మపుత్త్రునకు నింత వృత్తాంత బెఱింగింపవలయు’ నని పలికి వారల నామంత్రణంబు సేసినవాఁడై రథారోహణంబు సేసి ధృతరాష్ట్రుండును నచటి జనంబులును వెనుకం జనఁ జని కుంతీగృహద్వారంబున నరదంబు డిగ్గి. 8
క. వారందఱుఁ దనతోడన | గారవమున నరుగుదేరఁగాఁ జొచ్చి మహో
దారుఁడు కుంతీ చరణాం | భోరుహముల కెఱఁగి వినయభూషణుఁ డగుచున్‌.
9
క. కౌరవసభఁ దా నాడిన | గౌరవవాక్యములుఁ గార్యఖడ్గక్రమ వా
క్పూరములు సుయోధను దు | ష్ప్రారంభము నల్పవచన పద్ధతిఁ జెప్పెన్‌.
10
వ. ఇట్లు ధృతరాష్ట్రు కొలువునం బుట్టిన విశేషంబుల పాండురాజమహిషి కెఱింగించి మాధవుండు మఱియును. 11
తే. ‘కురుకుమారులు తమయంతఁ గుడిచి క్రొవ్వి | మీఁ దెఱుంగరు; మాకేమి? మేల కాక;
నాలుకలు గ్రోయు నర్జునానలము దగిన | యెర గొనం గని సంతృప్తి యెసక మెసఁగు.
12
వ. పాండుకుమారులపాలికిం బోయి వచ్చెద; వారికిం దగిన బుద్ధు లానతి’మ్మనిన నద్దేవి విక్రమోపజీవులయిన ముచుకుందుండును సృంజయుండును నను తొంటినరపతుల చరిత్రంబులు సెప్పి, ‘యుధిష్ఠిరుండు వీరిని వినండొ కాక’యని పలికి యెల్లవారును వినుచుండ వెండియు నిట్లనియె. 13
ఉ. ‘రాజుల కెందు నారయఁ బరాక్రమజీవన వృత్తి దక్క నొం
డోజ నిషిద్ధ మండ్రు మును; లుత్తమసత్త్వులు వంశధర్మముల్‌
పూజిత భంగిఁ జేయుదురు; బుద్ధివిహీనులు వానిఁ దక్కి ని
స్తేజపుఁ గూటి కియ్యకొని దీనతఁ బొందుదు రంబుజోదరా!
14
క. నీ వియ్యంబులు సంధియ | కావింపంబడిరి; వీరిఁ గలయుట కష్టం;
బా వెరవు దప్పుటయ మే | లై వచ్చెం బొమ్ము; విడువు మనుమానంబున్‌.
15
మ. నిజవంశోచిత వీరవృత్తమున కున్మేషంబుగా నా కపి
ధ్వజుఁ డుత్సాహము సేయకున్న నకటా! దైన్యంబు వాటిల్లదే?
భుజదర్పోద్ధతుఁడైన భీమునకు నీ పొం దొప్పునే? నీవు స
ర్వజగన్మాన్యుఁడ విందు రాఁదగునె? దైవం బిట్లు దప్పించునే!’
16
వ. అని యంత నిలువక గొంతి యిట్లనియె: 17
క. ‘మఱచిరె కొలువున ద్రౌపదిఁ | బఱచిన బన్నంబు? ధర్మపథము దొఱంగన్‌
వెఱచుట కప్పటి కది దగుఁ; | జెఱచినచో వెదక వలదె చిరతర కీర్తిన్‌?’
18
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )