పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
శ్రీకృష్ణుఁడు కర్ణునిఁ దన రథం బెక్కించుకొని కొన్ని రహస్యోక్తులు పలుకుట (సం. 5-138-1)
వ. అని పలికి పుండరీకాక్షుం గౌఁగిలించుకొని, యచ్యుతుండు మ్రొక్కిన దీవించి, ‘యేను సుఖంబున్న దాన’నని పాండవులకుం జెప్పుము; చేతుల లావునం గనిన జీవనంబున బ్రదుకుం డనుము; పోయిర’మ్మని వీడుకొల్పిన సింహగమనసుందరంబుగా వెడలి, తన తోడన కదలివచ్చిన ధృతరాష్ట్రాదుల నిలువంబనిచి, రథారోహణంబు సేసి గోవిందుండు కర్ణుదెసం గనుంగొని, ‘న న్ననిచి వత్తుగానిర’మ్మని కరంబు సాఁచి చెయివట్టి తన యరదం బెక్కించికొని, సాత్యకి వేసరి నెక్కి కెలనం జనుదేరం గదలిచని, యనుపవచ్చిన కృతవర్మ నుచిత ప్రకారంబున సస్నేహంబుగా నిలిపి యరుగు నవసరంబునఁ బౌరలోకంబు. 19
ఉ. ‘అక్కట! వాసుదేవు పను పాదరణంబునఁ జేయరైరి; వీ
రెక్కడి బుద్ధిమంతు? లని నిందును నందును లోకమెల్లఁ బే
రుక్కున మ్రగ్గుటం దలఁప నొల్ల కపాయము సేసి రట్టె! యీ
యుక్కివు లెందునుం గలరె? యొప్పరు వో ధృతరాష్ట్ర నందనుల్‌.’
20
వ. అని మఱియు ననేకు లనేక ప్రకారంబులం బలుకుచు నిరుగెలంకులం జూచుచుండఁ బుండరీకాక్షుండు పురంబు నిర్గమించె; నట ధృతరాష్ట్రుండును మగిడి కొలువు కూటంబునకు వచ్చి యెప్పటివారలు పరివేష్టింప నుండి కృష్ణుని వలని మాటలాడుచున్న సమయంబున సుయోధనునితో భీష్మద్రోణు లిట్లనిరి. 21
చ. ‘పలుకునె యిట్లు గొంతి? విని బమ్మెరపోయితి; మింత బెట్టిదం
బు లగునె మాట? లయ్యమయుఁ బుణ్యుఁడుఁ గృష్ణుఁడు గార్యవాదముల్‌
వలికెడు వార లిట్లు దెగఁబాఱిరి; ధర్మజవారిరాశికిం
జెలియలికట్ట వాసె; మనచే నగు కర్జముచంద మెట్టిదో?’
22
వ. అని పలికి వెండియు. 23
శా. ‘మాకుం జూడఁగఁబోలు కార్య మిది: ధర్మప్రీతి నీ వేఁగి సు
శ్లోకుండైన యుధిష్ఠిరుం గని జనస్తుత్యంబుగా శాంతిమై
నీ కౌరవ్యులనెల్లఁ గాచికొనవే యే పొప్ప దెందుం; దుదిన్‌
శోకం బొందక వేగమైఁ గదలి కృష్ణుంగూడఁబోవే నృపా!’
24
వ. అనిన విని దుర్యోధనుండు మొగంబు రాఁజుచుండ నూరకుండె; గాంగేయుండును గురుండును దిగ్గనలేచి యతని నవలోకించి. 25
క. ‘కురునృప! విను సంసారము | దరిద్రొక్కినవార; మింకఁ దలఁకెదమే? సం
గరమునకు నేము నీకై | పొరలితి; మెట్లైన నగును బోయెద’ మనుచున్‌.
26
క. అరిగిరి, రాజును నభ్యం | తరమునకుం జనియె, రాజతనయుండు బహిః
పరివారముఁ బొమ్మని మిత | పరిజనుఁడై యేఁగె నాత్మభవనంబునకున్‌.
27
తే. అంత నక్కడ నచ్యుతుఁ డరిగి యరిగి | యధిక సంప్రీతి దలకొన నర్కతనయు
నాననంబు వీక్షించి యిట్లనియె నెమ్మి | నన్యు లెవ్వరు వినకుండ నతనితోడ.
28
సీ. ‘నీవు వృద్ధజనోపసేవివి, ధర్మసం | వేదివి, తెలియంగ వినుము; సిద్ధ
మంత్రబలంబున మార్తాండు వరమునఁ | గన్నియ తఱి గొంతి గన్నవాఁడ
వగుటఁ బాండునృపాలు నగ్రసుతుండవు; | ధర్మమార్గం బిది; ధర్మతనయుఁ
డాదిగాఁ గల తమ్ములందఱు నా చేత | నెఱిఁగి నీ యడుగుల కెఱఁగి సకల
 
ఆ. పుత్త్ర మిత్త్ర బంధు భూరిసేనా సమ | న్వితముగాఁగఁ గొలిచి నిన్ను రాజ్య
భారవహనమునకుఁ బట్టంబుగట్ట ను | జ్జ్వలుఁడ వగుదు; రమ్ము వారికడకు.
29
వ. ఏను నిన్ను సామ్రాజ్యంబునకు నభిషిక్తుంజేయుదు; నీవు దొలుత వెడలునప్పటి మహోత్సవంబునకు యువరాజైయుధిష్ఠిరుండు నీ రథంబున నుండి నీకు ధవళచామరంబులు వైచు; వాయుపుత్త్రుండు సితచ్ఛత్రంబు వట్టు; సవ్యసాచి సారథ్యంబుచేయు; మఱియుఁ బాంచాల యాదవ పాండ్యమాత్స్యులు లోనుగాఁగల రాజలోకంబుతోడఁ గవలు నభిమన్యు ప్రభృతి కుమారులు బెరయ నే మెల్లం బలసి పరివేష్టించి వత్తు; మిట్టి మహేంద్ర విభవంబున మహనీయుండ వగుచు మహీచక్రం బేలు’ మని మఱియును. 30
క. ‘పాంచాల రాజపుత్రియు | నంచితముగ నిన్నుఁ బొందు నాఱవ వరుసన్‌;
సంచితపుణ్యుఁడ వీ వొక | యించుకయును వేఱుసేయ కేతె మ్మెలమిన్‌.
31
వ. ఇట్లైనఁ గుంతికి సమస్త బంధుమిత్రులకుఁ బ్రియంబగు’ ననిన విని రహస్యంబుగా రాధేయుండు మాధవున కిట్లనియె: 32
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )