పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
కర్ణుఁడు శ్రీకృష్ణునకుఁ దగిన యుత్తరంబు లిచ్చుట (సం. 5-139-1)
చ. ‘వెడవెడ యేనుఁ దొల్లి యిది వింటి’ ననుం గని కుంతి నిర్దయన్‌
జెడ నదివైచిపోయెఁ; గృపఁజేకొని సూతుఁడు దెచ్చి తాను మున్‌
కొడుకులఁ గానకున్కిఁ బ్రియకుం దగనిచ్చినఁ జేఁపెఁ జన్ను; ల
ప్పడఁతియు నప్పుడాదిగ శుభస్థితిఁ బెంచెఁ బ్రయత్నశీలయై.
33
క. మూత్ర పురీషాదులు దమ | గాత్రములం దింక వారు గారవ మెసఁగం
బుత్త్రుండని సంవర్ధిత | గాత్రునిగాఁ జేసి రింతకాలముఁ గూర్మిన్‌.
34
క. నేఁ డింక నెఱిఁగి యొరువుల | వాఁడఁ గదా యనుచు నేను వారిఁ దొఱఁగినం
బోఁడిమి సెడదే? మదిఁ గడు | వాఁడి గలదె నాకు నకట వారిజనాభా!
35
వ. వృద్ధోప సేవనంబును ధర్మ సంవేదనంబునుం గలవాఁడ వని నన్ను నీవ చెప్పితివి; రాధయు నధిరథుండును నాకు జాతకర్మాది సమస్త సంస్కారంబులు నిజకులోచితంబుగా నాచరించి; రట్టి తల్లిదండ్రులకుఁ బుత్త్రకృత్యంబులు నిర్వర్తింపక వారలంబాసి యేను వచ్చుట ధర్మంబగునే?’ యని పలికి వెండియు. 36
క. ‘సోదరులుఁ బ్రియులు ననుజులు | నా దెసఁ బెక్కండ్రు; వారినందఱ విడువం
గాదని యూహింపక దా | మోదర! నన్నిట్లు పిలుచు టుచితమె? చెపుమా!
37
వ. అదియునుం గాక. 38
ఉ. సూతసుతుండు వీఁ డనక సూనుల తమ్ములకంటె నాకు సం
ప్రీతియొనర్చి తేజమును బెంపును నాఁటికినాఁటి కగ్గలం
బై తనరార నన్నుఁ దనయంతటి మానిసిఁ జేసియుండ నే
నేతగవూఁది యా కురుకులేశ్వరుఁ బాయుదు? ముట్టవచ్చినన్‌.
39
క. నను నయ్యర్జునునకు నెదు | రని పెద్దయు నమ్మియుండు నక్కట! దుర్యో
ధనుఁ; డా నమ్మిగ వమ్ముగఁ | జనునే పాండవులఁ గలయఁ జన నా కనఘా!
40
ఆ. ఏను నర్జునుండు నెక్కటెక్కటి దల | పడకయున్న నగరె పుడమి జనము?
లందు నాదు వచ్చు టతనికి నపకీర్తి | యనిన నాకు వేఱె యడుగనేల?
41
క. హిత ముపదేశించితి నీ | వతి నిర్మలబుద్ధి వగుట; నైనను నిది నా
మతి సొరదు; రహస్యము ర | క్షితముగఁ బాటింపుమయ్య! చిత్తములోనన్‌.
42
వ. అది యేమిటి కంటేని. 43
తే. ధర్మతనయుండు తాను నా తమ్ముఁ డగుట | యెఱిఁగెనేనియు సామ్రాజ్య మేల పూను?
నట్టి ధార్మికుఁ డాధిపత్యంబుఁ జేయ | వలవదే శాశ్వతంబుగ వసుధకెల్ల?
44
క. అనుజులు ఋత్విజులుగ, నీ | పని యిటు సేయుమను నీ వుపద్రష్టవుగా
విను! కురుకుమార పశువిశ | సనమున రణయజ్ఞ మతఁడు సమ్మతిఁ జేయున్‌.
45
వ. దానం బుణ్యభూమి యగు కురుక్షేత్రంబున మముబోం ట్లెల్లను సద్గతి వడయుదురు గాక!’ యనిన విని వసుదేవనందనుండు సూతనందనున కిట్లనియె. 46
మ. ‘దయ నా యాడినమాటఁ గైకొనవు సంతాపంబుఁ దెచ్చుం జుమీ!
స్మయ మెట్లుం దుది నీకు నర్జునునితో మాత్సర్యమైనం బరా
జయ మొండెన్‌ మృతి యొండెఁ గాక గెలువన్‌ శక్యంబె? పెక్కండ్ర కిం
తియ కాలం బగునట్టె నీ మనము శాంతింబొందఁగా నేర్చునే?
47
క. గాండీవముఁ గవదొనలు న | ఖండిత దివ్యాస్త్రములు నొగలపై నేనుం
జండ భుజబలమునై యు | ద్దండత నరుఁ డడర నెదురఁ దరమే నీకున్‌?
48
వ. ఎల్లభంగులం బాండవుల గెల్తు; రది యట్లుండె; నీవు పొ; మ్మిప్పుడ పోయి సుయోధనునకును గురుభీష్ములకును మీకుం దోడువచ్చిన రాజుల కందఱకుం జెప్పు : మిమ్మాసంబు సౌమ్యంబై సమశీతోష్ణంబై పుష్పఫలోపేతంబును, సమగ్ర ధాన్యంబును, సులభయవ సేంధనంబును నగుచు నొప్పియున్నయది; యేడెనిమిది దివసంబులకు నమావాస్య వచ్చు; నది పుణ్యదినంబు; నాఁడు భండనంబు గావలయు’ ననినఁ గానీనుండు కమలనాభున కిట్లనియె. 49
క. ‘కలవు నిమిత్త స్వప్నం | బులు కౌరవ పాండవులకుఁ బోటగు; దానన్‌
గెలు పయ్యుధిష్ఠిరునకును | గల; దెఱుఁగుదు నీవు సెప్పఁగా నేమిటికిన్‌?
50
వ. అట్లుగాన కదా యే నందు రా’ నని పలికి మఱియును. 51
క. ‘దీనికి మూలము శకునియు | నేనును, దుశ్శాసనుండు, నింతియ; కుంతీ
సూనుల వారలు గలసిన | రానేరఁగ వచ్చు నాకు రాజీవాక్షా!
52
వ. ఈ సమర సముద్రంబు గడవ నీఁది నిన్నుం గనియెదఁ; గాదేని నూర్ధ్వలోకంబునం గాంచెద; నీ వింక నేమియుం బలుకకుము; పని వినియెద’నని కౌఁగిలించుకొనిన ‘నట్ల కాక పొ’మ్మని విష్ణుండు వీడుకొలువ రాధేయుండు రథావతరణంబు సేసి, కనక రత్నమయంబగు తన యరదం బెక్కి కరిపురంబున కరిగె; నచ్యుతుండును సాత్యకిం దన రథం బెక్కించుకొని దారుకుం జూచి ‘పద పద పోనిమ్ము పోని’మ్మని పలికి లలితాటోపకలితుండగుచుఁ జనియె; నట్టియెడ విదురుండు విషాదంబుతోఁ బాండురాజమహిషి పాలికిం జని యిట్లనియె. 53
ఉ. ‘అక్కట! కౌరవాన్వయ మహార్ణవ మింకెడునట్లు వుట్టె; నిం
దొక్కరుఁడైనఁ గేశవు హితోక్తికి మేకొనఁ డయ్యె; నర్జునుం
డెక్కటి దాన చాలుఁ దము నిందఱఁ దీవ్రశరాగ్నిఁ గాల్పఁ; బెం
పెక్కిన పాండునందనుల యేడ్తెఱఁ దొల్లియుఁ దా రెఱుంగరే?
54
తే. అన్ని వడియును బంధుక్షయంబు సేయ | నొల్ల కెల్ల విధంబుల నుపశమంబ
కోరి రప్పాండవేయులు; వారి కిట్టి | దొసఁగు వచ్చునె తులువల తోడఁబుట్టి.’
55
వ. అని వెండియు నివ్విధంబు మాటలఁ బాండవులకుఁ గయ్యంపు టలజడియైన వగపు దోఁప నాడుచుం గొండొక ప్రొద్దు నిలిచి నిజనివాసంబునకుం బోయిన యనంతరంబ కుంతి యిట్లని వితర్కించె. 56
మ. ‘తమ వారిన్‌ సిరికై వధించు టిది సద్ధర్మంబె? యక్లేశ కృ
త్యమె తాఁ గయ్యము? ద్రోణ భీష్మ కృప కర్ణాటోపముల్‌ మాన్చు ట
ల్పములం దీఱునె? యందు నర్కజుని యుల్లం బెప్పుడుం గ్రోధ దీ
ప్తము భీమాదుల మీఁదఁ; దక్కొరుల కుత్సాహంబు లే దాజికిన్‌.’
57
వ. అని యిత్తెఱంగునఁ బెక్కులు చింతించి తలంచుకొని ‘కర్ణునకుం బుట్టువు తెలిపి సహోదర స్నేహం బావహించెద; నట్లయిన నాహవంబువలని కడంక యుడుగకుండునె?’ యని విచారించి యతని పాలికిం బోన నిశ్చయించి, యుచిత ప్రకారంబున వెడలి యతం డనుష్ఠానార్థంబు భాగీరథికిం జనుట విని తత్ప్రదేశంబున కరిగి యతనికి జపకాలంబయి యునికిం జూచి వెనుక వలనఁ గూర్చుండఁ, గొండొక సేపునకు జపంబుదీఱి కలయం గనుంగొని యమ్మహాదేవింగాంచి కానీనుండు సంభ్రమ వినయంబులతోడం జేరి సూత గోత్రంబును రాధేయనామంబునుం జెప్పి యభివాదనంబు చేసి ‘నీవు విజయంచేసిన కార్యం బేమి? నాకుం జేయంగల పని యెయ్యది? యానతి’మ్మనినఁ గుంతి యేకాంతంబుగా నిట్లనియె. 58
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )