పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము
కుంతీదేవి కర్ణునకు నతండు తన పుత్త్రుం డగుట దెలుపుట (సం. 5-143-1)
సీ. ‘వినుము! సూతాన్వయంబున నీవు పుట్టుట | బొం; కేను మా కుంతిభోజునింటఁ
గన్నియనాఁడు భాస్కరుని రావించితి | వరమంత్రబలమున; వచ్చి యతఁడు
సంప్రీతి నొసఁగంగ జన్మించినాఁడవు | నాకుఁ; గావునఁ బాండునందనుండ
వగుదు ధర్మస్థితి; నట్టి నీ వితరులఁ | గొలువ నేటికిఁ గురుకులవరేణ్య?
 
తే. ధర్మతనయాదులైన నీ తమ్ములకును | ధార్తరాష్ట్రులకును నీవ తగు విభుండ;
వేలు మీ లోకమెల్ల; నీ కేల రాధ | కొడు కితం డను తక్కువ? కొడుకుఁగుఱ్ఱ!’
59
క. అని పలికిన యవసరమున | నినబింబములోన నుండి ‘యిది నిజ మిబ్భం
గిన నెగడవన్న మేలగు’ | నను వాక్యము వెడలెఁ గర్ణుఁ డాకర్ణింపన్‌.
60
తే. దాని వినియును నపుడు రాధాసుతుండు | దిరుగఁబడని మనంబుతో ధీరవృత్తిఁ
దల్లి కిట్లను ‘నీమాట తథ్యమగున | యైన నొక్కటి సెప్పెద నవధరింపు.
61
క. క్షత్రియ సంస్కారమునకుఁ | బాత్రముగా నీవు నన్నుఁ బాటింప విహా
ముత్రఫలములకు నీ కేఁ | బుత్రుఁడ నని వచ్చుటింకఁ బోలునె చెపుమా?
62
వ. సూర్యానుగ్రహంబునఁ జేసి నింద్యంబుగాక తక్కెనేనియు నా జన్మంబు పరమ రహస్యంబునై యున్నయది; దీనిఁ బ్రకాశంబు చేయుట మనకెంత మే? లట్లుంగాక. 63
ఆ. విజయు విక్రమంబు విఖ్యాతమై యుండ | ‘నేను గుంతికొడుక భానుజుండ’
ననుచు నతనిఁ గూడ నరిగిన నతనికి | వెఱచి పోయె ననరె? వేయు నేల?
64
క. కడిఁది పగఱ నేఁ దెప్పగఁ | గడవంగా నీఁదఁదలఁచు కౌరవనాథుం
జెడుఁ గాక యంచు నిత్తఱి | విడువఁదగునె? యతని వలన వెలసిన వాఁడన్‌.
65
క. కౌరవులచేతఁ గుడిచిన | వారికి నిది సమయ; మెట్టివారును సంగ్రా
మారంభంబునఁ బాయుదు | రే? రాజులు మనలఁ దిట్టరే యట్లయినన్‌.
66
వ. ఏ నవశ్యంబును దుర్యోధనునకై నీకొడుకులతోడం బెనంగుదు. 67
ఉ. నీ పలు కెంత వోలినను నిర్ణయ మిట్టిద కాని యొండు లే;
దీపని మీఁది భారమున నీ విట వచ్చితిగాన పాండవుల్‌
సేపడిరేనిఁ జంప; నఱసేయక చెప్పెద సవ్యసాచిపైఁ
గోపము పెద్ద; వాఁడు సమకూరిన బిట్టఱఁ జంపుదుం జుమీ!
68
ఆ. సవ్యసాచిచేతఁ జచ్చుటయును గీర్తి | కరమ యతఁడు లోనుగాఁగ నేవు
రేను లోనుగాఁగ నేవురుగాని నీ | కొడుకు లార్వురనుట విడువు’మింక.
69
చ. అనుటయు నప్డు గొంతి హృదయంబున శోకము నివ్వటిల్ల ని
ట్లను ‘నిది దైవసంఘటన మక్కట! యెట్లును దప్ప నేర్చునే?
యనుపమ సత్యవిస్ఫురణ నాడినమాట మఱాకుమన్న! నీ
యనుజుల నల్వురం గడపు; మర్జునుఁ జేఁతకు సమ్మతించితిన్‌.
70
ఆ. అనుచుఁ గౌఁగిలింప నర్కజుం ‘డట్ల కా’ | కని ప్రియంబు మెఱయ వినతుఁ డైన
నరిగె సదనమునకు నద్దేవి; యతఁడును | జనియె నిజనివాసమునకుఁ బ్రీతి.
71
వ. అక్కడ వాసుదేవుం డుచిత ప్రయాణంబుల నుపప్లావ్యంబునకుం జని ధర్మతనయుచేతం బూజితుండయి, భీమసేనాదులు విరాట ద్రుపదముఖ్యులగు తగువారలుఁ దన్నుం గాంచిన వారినెల్ల నభినందించి, కొలువున నుండి యుధిష్ఠిరుతో నిట్లనియె. 72
తే. ‘ధార్తరాష్ట్రు లున్మత్తులు; తగిన పలుకు | లేల విని సంధి సేయుట కిచ్చగింతు?
రెదిరిఁ దమ్మును నెఱిఁగిర యేని వార | లంత లంతలు చేయుదు రయ్య నాఁడు?’
73
వ. అని యెల్లవారును వినఁ దనపోయివచ్చిన కార్యంబు తెఱంగెఱింగించి, పథిశ్రమంబు పుచ్చువాఁడయి పుండరీకాక్షుండు నిజమందిరంబున కరిగె; నాఁటి రాత్రి ధర్మనందనుం డనుజ సహితంబుగా నుచిత ప్రదేశంబున నుండి గోవిందుని రావించి ‘నీవు సుయోధనునితోఁ బలికిన చందం బెయ్యది? యతండేమి విధంబున నుత్తరంబిచ్చె?’ నని యడిగిన నచ్యుతుఁ డిట్లనియె. 74
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )