ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
కృతి నిర్మాణ ప్రస్తావన
వ. అని సకల బ్రహ్మ ప్రార్థనంబు సేసి, తత్ప్రసాదాసాదిత కవిత్వ తత్త్వ నిరతిశయాను భావానంద భరితాంతః కరణుండ నగుచుండి యొక్కనాఁ డిట్లని వితర్కించితి. 2
శా. విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు, విజ్ఞాన సం
పద్విఖ్యాతుఁడు, సంయమి ప్రకర సంభావ్యానుభావుండు, గృ
ష్ణద్వైపాయనుఁ డర్థి లోకహితనిష్ఠం బూని కావించె ధ
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్‌.
3
క. వేదములకు నఖిల స్మృతి | వాదములకు బహు పురాణ వర్గంబులకున్‌
వా దైన చోటులను దా | మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికిన్‌.
4
వ. అదియును. 5
ఉ. ఆదరణీయ సార వివిధార్థ గతి స్ఫురణంబు గల్గి య
ష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండ; నం
దాదిఁ దొడంగి మూఁడుకృతు లాంధ్ర కవిత్వ విశారదుండు వి
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్‌.
6
మ. హృదయాహ్లాది, చతుర్థ, మూర్జిత కథోపేతంబు, నానా రసా
భ్యుదయోల్లాసి విరాటపర్వ; మట యుద్యోగాదులుం గూడఁగాఁ
బదియేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్థ్యంబులై పెంపునం
దుదిముట్టన్‌ రచియించు టొప్పు బుధ సంతోషంబు నిండారఁగన్‌.
7
క. అని రచనా కౌతుకమున | మన మలరఁగ ‘ నీ ప్రబంధ మండలి కధినా
ధునిఁగా నే పురుషునిఁ బే | ర్కొనువాఁడనొ’ యను తలంపు గూరిన మదితోన్‌.
8
వ. ఇంచుక నిద్రించు సమయంబున. 9
సీ. మజ్జనకుండు, సమ్మాన్య గౌతమ గోత్ర | మహితుండు, భాస్కరమంత్రి తనయుఁ,
డన్నమాంబాపతి, యనఘులు కేతన | మల్లన సిద్ధనామాత్యవరుల
కూరిమి తమ్ముండు, గుంటూరి విభుఁడు కొ | మ్మన దండనాథుండు, మధుర కీర్తి
విస్తర స్ఫారుఁ డాపస్తంబసూత్ర ప | విత్రశీలుఁడు సాంగవేదవేది
 
తే. యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్ల | నస్మదీయ ప్రణామంబు లాదరించి
తుష్టి దీవించి, కరుణా ర్ధ్ర దృష్టిఁ జూచి | యెలమి ని ట్లని యానతి యిచ్చె నాకు.
10
వ. “కి మస్థి మాలాం కిము కౌస్తుభం వా | పరిష్క్రియాయాం బహుమన్యసే త్వమ్‌ | కిం కాలకూటః కిము వా యశోదా | స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే,” అని నీవు తొల్లి రచియించిన పద్యంబు గాఢాదరంబున నవధరించి, భక్తవత్సలుం డగు హరిహరనాథుండు నీదెస దయాళుండై యునికిం జేసి నిన్నుం గృతార్థునిఁ జేయం గార్యార్థి యయి నాకలోక నివాసి యయిన నాకుఁ దన దివ్య చిత్తంబునం గల యక్కారుణ్యంబు తెఱం గెఱుంగునట్టి శక్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించికొని వీఁడె విజయం చేయుచున్నవాఁడనుచుం జూపుటయు సవిశేష సంభ్రమ సంభరిత హృదయుండ నయి యవ్వలనుఁ గలయం గనుంగొనునప్పుడు. 11
సీ. కరుణారసము పొంగి తొరఁగెడు చాడ్పున | శశిరేఖ నమృతంబు జాలువాఱ
హరినీలపాత్రిక సురభిచందన మున్న | గతి నాభి ధవళపంకజము మెఱయ
గుఱియైన చెలువున నెఱసిన లోక ర | క్షణ మనంగ గళంబు చాయ దోఁపఁ
బ్రథమాద్రిఁ దోఁతెంచు భానుబింబము నా ను | రమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప
 
తే. సురనదియును గాళిందియు బెరసినట్టి | కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి
నా మనంబు నానంద మగ్నముగఁ జేయ | నెలమి సన్నిధి సేసె సర్వేశ్వరుండు.
12
వ. ఏనును భక్తిమయం బగు సాష్టాంగదండప్రణామం బాచరించి, కొండొక దొలంగి వినయావనతుండనై, లలాటోపరిభాగంబున నంజలిపుటంబు ఘటించి, నయనంబులు నవయవంబులును బ్రమదబాష్ప సలిల విలులితంబులును, బులకపటల పరికలితంబులునుం గా నంతంత నిలిచిన నద్దేవుండు. 13
క. అనుకంపాతిశయంబునఁ | దన దక్షిణనేత్రమును సుధారోచియ కా
నను వింత లేక చూచి, వ | దనమున దరహాసరసము దళుకొత్తంగన్‌.
14
ఉ. ‘వైదిక మార్గ నిష్ఠమగు వర్తనముం దగ నిర్వహించుచున్‌
భేదము లేని భక్తి మతి నిర్మల వృత్తిఁగఁ జేయుచుండు మ
త్పాద నిరంతర స్మరణ తత్పర భావము కల్మి, నాత్మ స
మ్మోదముఁ బొందఁ గావ్య రసముం గొనియాడుచు నుండు దెప్పుడున్‌.
15
వ. అందును. 16
క. పారాశర్యుని కృతి యయి | భారత మను పేరఁ బరఁగు పంచమవేదం
బారాధ్యము జనులకుఁ ద | ద్గౌరవ మూహించి నీ వఖండిత భక్తిన్‌.
17
తే. తెనుఁగుబాస వినిర్మింపఁ దివురు టరయ | భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము గాదె!
దీని కెడ నియ్యకొని వేడ్క నూని కృతి | పతిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ!’
18
వ. అనిన నద్దివ్యవచనామృతంబు నా యుల్లంబున వెల్లిగొనినఁ బునః పునః ప్రణామంబు లాచరించి, యప్రమేయ ప్రభావ భావనాతీతుండయ్యును నప్పరమేశ్వరుం డాశ్రితులకు నత్యంత సులభుండని బుధులవలన విని యునికిం జేసి ననుబోఁటి బాలస్వభావునకు నిట్టి మహనీయ మహిమ దొరఁకొనుటయుం గలుగున కాక యని తలంచుచు నవ్విభునకు విన్నపంబు సేయువాఁడనయి కొమ్మనామాత్యునాననం బాలోకించి తదనుమతి వడసి యిట్లంటి. 19
క. భూరి భవత్కారుణ్య | క్షీరాంబుధిలోన నాదు చిత్తంబును వి
స్తార మహితముగ నునిచితి | వారయ నచ్చెరువు గాదె యఖిలాండపతీ!
20
ఉ. ఇంతకు నేర్చు నీకు, నొక యింతటిలోన, మదీయవాణి న
త్యంత విభూతిఁ బెంపెసఁగు నట్టి నినుం గొనియాడఁ జేఁత దా
నెంతటి పెద్ద? నీ కరుణ నిట్లు పదస్థుఁడ నైతి నింక జ
న్మాంతర దుఃఖముల్‌ దొలఁగు నట్లుగఁ జేసి సుఖాత్ముఁ జేయవే.
21
వ. అని యుపలాలితుం డగు డింభకుండు దన కొలంది యెఱుంగక మహాపదార్థంబు వేఁడు విధంబున బ్రహ్మానంద స్థితిం గోరి సర్వాంగాలింగిత మహీతలం బగు నమస్కారంబు సేసిన నజ్జగన్నాథుండు. 22
తే. జనన మరణాదులైన సంసార దురిత | ములకు నగపడకుండంగఁ దొలఁగు తెరువు
గనువెలుంగు నీ కిచ్చితి ననిన లేచి | నిలిచి సంతోష మెద నిండ నెలవుకొనఁగ.
23
వ. ఇట్లు మేలుకాంచి. 24
క. ఎలమియు నచ్చెరువును సరి | నెలసి పొదలు మానసమున నెంతయుఁబ్రొద్దేఁ
గలలోనఁ గన్న చందము | దలఁచుచు నుండితిని భక్తి తాత్పర్యమునన్‌.
25
వ. తదనంతరంబ. 26
ఉ. ఇట్టి పదంబు గాంచి పరమేశ్వరునిం గృతినాథుఁ జేసి యే
పట్టునఁ బూజ్యమూర్తి యగు భారత సంహితఁ జెప్పఁగంటి; నా
పుట్టుఁ గృతార్థతం బొరసెఁ, బుణ్యచరిత్రుఁడ నైతి; నవ్విభుం
గట్టెదఁ బట్ట మప్రతిమ కావ్య కవిత్వ మహావిభూతికిన్‌.
27
ఉ. కూర్చుట నూత్నరత్నమునకుం గనకంబునకుం దగున్‌; జనా
భ్యర్చిత మైన భారత మపార కృపాపరతంత్రవృత్తిమైఁ
బేర్చిన దేవదేవునకుఁ బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ధి; నా
నేర్చిన భంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికిన్‌.
28
వ. ఇది యనన్య సామాన్య కరణం బగు పరమధర్మ ప్రకారంబు. 29
ఉ. కావున భారతామృతముఁ గర్ణపుటంబుల నారఁగ్రోలి యాం
ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ సంస్మృతి
శ్రీ విభవాస్పదం బయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ
క్షావిధి నొంది పద్యముల గద్యములన్‌ రచియించెదన్‌ గృతుల్‌.
30
వ. అని పూని యీదృశంబు లగు పుణ్యప్రబంధంబులు దేవసన్నిధిం బ్రశంసించుటయు నొక్క యారాధన విశేషం బగుటం జేసి. 31
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )