ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
కథా ప్రారంభము (సం. 4-1-1)
వ. ఏను విన్నపంబు సేయు తెఱంగుగా నంతస్సన్నిధిం గలిగించుకొని యమ్మహాకావ్యంబు నర్థంబు సంగతంబు చేసెద. 37
క. శరణాగత సంశ్రిత భయ | హరణా! సురనికర శేఖరానర్ఘమణి
స్ఫురణా పరిచయ రంజిత | చరణా! వనమాలికా భుజంగాభరణా!
38
క. అజగవ శార్ఙ్గాలంకృత! | భుజగర్వ నిరస్తదైత్య! భూమస్తుత్యా!
త్రిజగద్ధారణ నిత్యా! | భుజగ సమాచరిత శయన భూషణ కృత్యా!
39
క. జలనిధి హిమవద్భూధర | కలిత జనన కేళికౌతుక వ్యక్తా వ్య
క్త లలిత సౌందర్య స్ఫుర | దలఘుతను స్త్రీ సనాథ! హరిహరనాథా!
40
వ. దేవా, దివ్య చిత్తంబున నవధరింపుము. 41
ఆ. కథ జగత్ప్రసిద్ధి గావునఁ బూర్వ ప | ర్వార్థ యుక్తి చేయునట్టి యెడల
యత్న మించుకంత యయినను వలవదు | వలసినట్లు చెప్పవచ్చి యుండు.
42
వ. మహాభారతంబు సమస్త దురితాపహంబును, నభిమత శుభావహంబును, నశుభ హరణంబునుం గావున నొక్క మహాఫలంబు గోరి జనమేజయుండు కృష్ణద్వైపాయన మహాముని కారుణ్యంబు వడసి, తదీయ ప్రియశిష్యుం డైన వైశంపాయను వలన వినిన కథ యగుటం జేసి తత్ప్రకారంబు నడపెద; నది యె ట్లనినం బరమ పవిత్రు లగు పాండుపుత్త్రుల చరిత్రం బుపాఖ్యాన సహితంబుగా వ్యాఖ్యానంబు సేయుచుండ వారల వనవాస సమ్యగనుష్ఠానంబు సవిస్తరంబుగా విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 43
చ. “మహిత సముజ్జ్వలాకృతులు, మానధనుల్‌, జనమాన్యు లంగనా
సహితము గాఁగ నేమిగతి సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై
నహితుల కప్రభేద్యముగ నా పదుమూఁడగు నేఁడు మత్పితా
మహులు చరించి? రంతయుఁ గ్రమంబున నా కెఱుఁగంగఁ జెప్పుమా.”
44
క. అని యడిగిన వైశంపా | యనుఁ డమ్మనుజేంద్రచంద్రు నధి కౌత్సుక్యం
బున కలిమికిఁ దన హృదయం | బున గాఢాదరము భరితముగ ని ట్లనియెన్‌.
45
వ. పాండవులు వనవాసంబు సముచితంబుగా సలిపి, పండ్రెండగు నేఁటి కడపటఁ దమకు ధర్మదేవతా సమాగమం బయినం, దత్ప్రసాదంబున నజ్ఞాతవాస సమయంబునకు భంగంబు గాకుండ వరంబు వడసి, యంతకుమున్ను తమ వెనుక నడవులం దిరుగుచు నగ్ని హోత్రంబులఁ దోడన కొని వర్తిల్లు భూసురోత్తములు దమ్ముం బరివేష్టించి యుండఁ దారనుష్ఠింపం బూనిన పని వారల కెఱింగింపం దలంచి కర (కమల)ంబులు మొగిచి సవినయంబుగా ని ట్లనిరి. 46
సీ. ‘తెల్లంబు గాదె మీ కెల్ల సుయోధను | చేసిన కుటిల విచేష్టితంబు
లకట! మాతో మీరు నడవుల నిడుమలఁ | బొందితి; రొకభంగిఁ బోయెఁ గాల;
మిది పదుమూఁ డగు నేఁడు మా కజ్ఞాత | వాసంబు సలుపంగ వలయు; నిందు
ధార్తరా ష్ట్రులు సూతతనయ సౌబలులును | జెఱుపన వేతురు; చిన్నసన్న
 
ఆ. యెఱిఁగి రేనిఁ జాలనెగ్గు వాటిల్లు, న | ట్లగుట మమ్ము నింక నతి రహస్య
వృత్తిమై నిరస్తవిఘ్నుల రై చరి | యింపుఁ డని యనుగ్రహింపవలయు.’
47
వ. అని చెప్పి; రట్టి సమయంబున ధర్మనందనుండు విషణ్ణహృదయుండై. 48
క. ‘ఒకనాఁ డేమును నాపద | లకు విడుమరఁ గాంచి విప్రులం జుట్టలఁ బె
ట్టుకొని సుఖముండఁ బడయుదు | మొకొ! యిప్పా టెందుఁ గలదె యొరు లెవ్వరికిన్‌?’
49
వ. అని డగ్గుత్తిక వెట్టి దుఃఖ పరవశుం డగుటయు, నమ్మహీసురవరులుం దమ్ములు నతని నాశ్వాసించుచుండఁ దత్పార్శ్వంబున నున్న ధౌమ్యుండు తదీయ విషాదాపనోదంబు సేయం దలంచి యి ట్లనియె. 50
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )