ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
ధౌమ్యుండు పాండవుల నూరార్చుట (సం. 4-1-22) (కుంభకోణప్రతి)
ఉ. ‘ధర్మనిరూపకత్వమున ధైర్యమునన్‌, మహనీయవృత్తి, స
త్కర్మ విధిజ్ఞతం జతురతా మహిమన్‌, దృఢబుద్ధి నెవ్వరున్‌
ధర్మజుపాటిగా రనఁగ ధాత్రిఁ బ్రసిద్ధుఁడ వైన యిట్టి నీ
పేర్మికి నీడె? దుర్దశల పెల్లునకున్‌ దురపిల్లు టారయన్‌.
51
వ. అట్లుంగాక 52
క. దేవతల కైన నొక్కొక | చో వలయున కాదె శత్రుసూదనవిధి కా
లావాప్తికి మును దమ స | ద్భావంబు లడంచి యుడుగఁబడి యుండంగన్‌.
53
సీ. నిషధాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న | సంచరణమున వర్తించుటయును
నదితి గర్భంబున నవతార మై వామ | నాకారమున హరి యడఁగుటయును
జనని యూరు ప్రదేశంబున నతి నిగూ | ఢంబుగా నౌర్వుండు డాఁగుటయును
ధేను శరీర విలీనుఁడై యజ్ఞాత | చర్య మార్తాండుండు సలుపుటయును
 
ఆ. వినమె! యిట్లు వడిన వీరలు పదపడి | తమకు నగ్గమైన తఱి జయింప
రెట్లు ప్రబల రిపుల; నీవును నాపద | కోర్చి భంగపాటు దీర్చికొనుము.’
54
క. అనవుడు నప్పలుకులు విని | తన చిత్తము కలఁక దేఱి ధర్మతనూజుం
డనుజన్ముల దెసఁ జూచిన | ననిలసుతుం డిట్టు లనియె నాతనితోడన్‌.
55
మ. ‘భవదాజ్ఞా దృఢబంధ సంయమిత శుంభ ద్వేగ మై కాక నాఁ
డవలీలన్‌ మన యర్జున ద్విపము గ్రోధావేశదుర్దాంత ద
ర్ప విలాసోద్భట భంగి నేపడరి కౌరవ్యాంబుజ శ్రేణిఁ జి
క్కువడం జేయదె యొక్క వ్రేల్మిడిన నీకున్‌ వేడ్క సంధిల్లఁగన్‌.’
56
వ. అనిన విని ధర్మనందనుండు తెలివొందిన మొగంబు తోడ శిరఃకంపంబుసేసె; నట్టి సమయంబున నవ్విప్రులందఱు నొక్క మొగిన ‘మీ తలంపునకు దైవం బనుకూలంబు గావుత’ మని పాండుపుత్త్రుల దీవించి పునర్దర్శనం బయ్యెడు మనుచు వీడ్కొని నిజస్థానంబులకుం జనిరి; తదనంతరంబ బాహ్యపరివారం బెల్లను సముచిత ప్రకారంబున వీడుకొలు వడసి తమ తమ పొందుపట్లకుం బోయిన. 57
ఉ. తమ్ములు ధౌమ్యుఁడున్‌ సతియుఁ దా నరదంబులతోడఁ గ్రోశమా
త్ర మ్మొక చోటి కల్లఁ జని, ధర్మతనూభవుఁ డందు నాఁటిరే
యిమ్ముల సల్పి వేగుటయు నీప్సితకార్యము సేయఁగా విచా
రమ్మున నున్నచో నమరరాజతనూభవుఁ జూచి యిట్లనున్‌.
58
క. ‘మన మొక యేవుర మీయం | గనయుం దో నరుగుదేరఁగా నెయ్యెడఁ బో
యిన నెఱుఁగ కుండుదురె? యి | ద్దినములు గడపంగ నెద్ది తెఱఁ గయ్యెడినో!’
59
వ. అనిన నతం డి ట్లనియె. 60
తే. ‘ధర్మదేవత నీదు సత్కర్మమునకు | మెచ్చి యెంతయుఁ బ్రీతిమై నిచ్చినట్టి
వరము గలుగంగ మన మేమి వర్తనమున | నెచట నున్నను నొరులకు నెఱుఁగ నగునె?
61
వ. కురు జనపదంబు చుట్లం బాంచాల చేది మత్స్య సాళ్వ విదేహ బాహ్లిక దశార్ణ శూరసేన కళింగ మగధ దేశంబులు సుభిక్షంబులు, జనాకీర్ణంబులు, నతిస్థిరంబులు నై నివాసయోగ్యత కలిగి యున్నయవి యని విందుము. వానియందు మీకుఁ జూడం బోలిన యెడఁ దగిన చందంబున నిలుచువారము గాక’ యనినం బ్రియంబంది ధర్మనందనుం డి ట్లనియె. 62
క. ‘అగు నది యట్టిద; దైవము | దగ నిచ్చిన యవ్వరంబు దప్పునె? మనకున్‌
విగత భయ వాస యోగ్యం | బుగ నొక్కెడ సెప్పు మిపుడ పోవఁగవలయున్‌.
63
ఆ. నాకుఁ జూడ మత్స్య నరపతి సద్ధర్మ | వర్తి, సుజనహితుఁ, డవార్య బాహు
బలుఁడు గాన యతని పాల నందఱుఁ దగ | వైన పనుల నిలుచు టభిమతంబు.
64
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )