ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
పాంచాలీ పాండవులు తమ మెలంగవలయు పనుల నిశ్చయించుకొనుట (సం. 4-1-15)
క. మనలోన నెవ్వఁ డెమ్మెయి | పని వెంటను విరటు మనము వడయుద? మదియె
ల్లను నేర్పరించి యందఱుఁ | దన తనమది నున్న తెఱఁగు తథ్యమ చెపుఁడా!
65
వ. అనిన విని సవ్యసాచి సవితర్కంబును సవిషాదంబును సగౌరవంబునుంగా నతని నుపలక్షించుచు నిట్ల నియె. 66
సీ. ‘మహనీయమూర్తియు, మానవైభవమును, | సౌకుమార్యంబును, సరసతయును,
మార్దవంబుఁ, బ్రభుత్వ మహిమయు, నపగత | కల్మషత్వంబును, గౌరవంబు
శాంతియు, దాంతియుఁ, జాగంబు, భోగంబుఁ, | గారుణ్యమును, సత్యసారతయును,
ధర్మమయ క్రియా తత్పరత్వంబును | గీర్తి, ధనార్జన క్రీడనంబుఁ
 
ఆ. గలిగి జనుల నేలఁ గాని, యెన్నందును | నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని
యట్టి నీవు విరటు నెట్టి చందంబున | ననుచరించు వాఁడ వధిప! చెపుమ.’
67
క. అనినం దమ్ముని నెమ్మన | మునఁ బుట్టిన వగపు భావమున నెఱిఁగియు గీ
టునఁ బుచ్చుచుఁ బ్రస్తుత కా | ర్య నిరూపణ దశయ మెఱయ నతఁ డి ట్లనియెన్‌.
68
క. ‘సన్న్యాసి వేషమున రా | జన్యునిఁ గని యెపుడుఁ గొలిచి సభ్యత్వమునన్‌
మాన్యుఁడనై పుణ్యకథా | విన్యాస మొనర్తు నతని వేడుకకుఁ దగన్‌.
69
క. శ్రౌత స్మార్త నిమిత్త | జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయసం
జాత ప్రాగల్భ్యుఁడ నై | చాతుర్యము మెఱసి మానసం బలరింతున్‌.
70
క. ఆతనితో నొక్కొక మరి | కౌతూహలవృత్తికిం దగం దొడఁగి మృదు
ద్యూతంబునఁ గ్రీడింతుం | జేతోముద మొదవ నక్షశిక్షాప్రౌఢిన్‌.
71
తే. మణిమయమ్ములుఁ గలధౌతమయములును సు | వర్ణ మయములు నాదిగా వలయునట్టి
యడ్డసాళులు గలవు నా కభిమతముగ | వానిఁ గొనిపోయి చూపుదు వరుసతోడ.
72
వ. మఱియు నవసరోచితంబు లగు వినోదంబులం బ్రమోదంబు పుట్టించుచుఁ బ్రసాదంబునకుం బాత్రుండ నై కంకుండను నామధేయంబు ధరియించి చరియింతు; నయ్యుర్వీశ్వరుండు మ త్పూర్వవర్తనం బడిగె నేనియు ధర్మపుత్త్రుతోడి మైత్రిం దగిలి యతనిపాల వసియింతు ననంగలవాఁడ’ నని చెప్పి, యనిలతనయు నిరీక్షించి తత్కాలజనితం బయిన ఖేదంబునం దొరఁగ సమకట్టు బాష్పజలంబులు మగుడ నింకించుచు నిట్టూర్పు లడంచి ధైర్యం బవలంబించి యి ట్లనియె. 73
సీ. ‘కడిమిమై సౌగంధికమున యక్షుల మద | మడఁచి కృష్ణకుఁ బువ్వు లట్లు దెచ్చెఁ;
గిమ్మీరదానవు నమ్మెయి నిర్జించి | విగతకంటకముఁ గావించె వనము;
బకదైత్యుఁ దొడరి యాభంగి రూపఱఁ జేసి | రక్షించె నేకచక్రాపురంబు;
నప్పాటఁ బ్రబలు జటాసురు నడరి దం | డితుఁ జేసి మనలఁ బెట్టించుకొనియె;
 
తే. నితఁడు పుట్టినకోలెను నెసఁకమెసఁగ | దర్పమునన వర్తిల్లు నుదగ్రమూర్తి
యకట! యొరు చిత్తమున కెక్కునట్లు గాఁగ | మెలఁగి యేమి విధంబునఁ గొలుచువాఁడు.’
74
వ. అనిన విని భీమసేనుం డి ట్లనియె. 75
తే. ‘ఏను వంటలవాఁడ నై యా నరేంద్రుఁ | గొలిచి గరగరగాఁ గూడు గూర చిత్త
మునకు వచ్చిన చందంబునన యొనర్చి | నేర్చి మెలఁగుదుఁ గరము వినీతి మెఱసి.
76
ఉ. ఆఱురసంబులం జవులయందలి క్రొత్తలు వుట్ట నిచ్చలున్‌
వేఱొకభంగిఁ బాకములు విన్ననువొప్పఁగఁ జేసి చేసి న
న్మీఱఁగ బానసీని నొకనిం బురిఁ గానని యట్లుగాఁగ మేన్‌
గాఱియవెట్టియైన నొడికంబుగ వండుదుఁ గూడుగూరలన్‌.
77
తే. పఱియ వాపంగఁ దునియఁగా విఱువవలయు | నెడలఁ గాళులఁ జేతులఁ దొడలఁ బట్టి
కడఁగి యనువుగఁ జేసి ప్రొయ్యిడుదుఁ గాని | కత్తి గొడ్డలి యడుగ నేఁ గట్టియలకు.
78
క. సూపాధ్యక్షుఁడు గలిగిన | నాపురుషునితోడ సఖ్య మగునట్లుగ నే
నే పాట నైన నడవఁగ | నోపుదుఁ దత్తద్విధ ప్రయోగముల మెయిన్‌.
79
వ. అట్లుంగాక. 80
తే. జెట్టితండంబుతోడఁ జేపట్టి హొంత | కారి విఱిచినయట్టు లగ్గలిక విఱుతు
లాఁగు వేగంబు మెఱసి బలంబు నెఱపి | మల్లుతనమున మెప్పింతు మనుజవిభుని.
81
క. పెక్కండ్ర నొక్క పోరను | నుక్కఱ భంజించి చంపు టుడుగుదు; రాజుం
దక్కటి చూపఱు లెంతయు | వెక్కసపడఁ జిత్రగతుల విహరింతుఁ దగన్‌.
82
చ. అదియునుఁ గాక కోలుపులి నైనను, గా రెనుపోతు నైన, ను
న్మదకరినైన, నుగ్రమృగనాథుని నైనను గిట్టి ముట్టి బె
ట్టిదముగఁ గాలఁ గేలను గడింది మగంటిమి యుల్లసిల్లఁ బ
ట్టుదు నడఁగంగ మాత్స్యుఁడు గడున్‌ వెఱఁగందుచుఁ బిచ్చలింపఁగన్‌.
83
వ. ఇట్లు నానాప్రకారంబుల నతని మనంబు వడయుచు వలలుండను సమాఖ్య వహింతు; నమ్మహీపతి ‘నీ వెవ్వరి వాఁడ?’ వని యడిగె నేని ‘పాండవాగ్రజునకు బానసంబు సేయుదు ననం గలవాఁడ’ ననిన విని ధర్మజుం డమ్మెయికి సమ్మతించి బీభత్సు వీక్షించి ఘూర్ణమాన మానసుం డగుచు నిట్లనియె. 84
ఉ. ‘ఖాండవ మేర్చె; దేవతలుఁ గానని యీశ్వరుఁ గాంచె; దోర్బలో
ద్దండ మహాసుర ప్రతతి దర్ప మడంచి ప్రియం బొనర్చి యా
ఖండలుఁ డున్న గద్దియసగంబున నుండె; మహానుభావుఁ డీ
తం డొక మర్త్యుఁ జేరి యనుదాత్తత నెమ్మెయిఁ గొల్చువాఁ డొకో!’
85
క. అను మాటలు విని సంక్రం | దన నందనుఁ డిట్టు లనియె ‘దైవంబుకతం
బున నాకు నొక్క చందం | బనువై యున్న యది; దీని నౌఁగా దనుఁడా!
86
వ. అమరనగరంబున కరిగినయెడ నూర్వశి నన్ను నపుంసకుంగా శపియించిన, నాకు నాకేశుండు గరుణించి, ‘ఈ శాప ఫలంబు భవదజ్ఞాతవాస వత్సరంబున ననుభవించి, తదనంతరంబ శాప మోక్షంబ వడయు’ మని దీవించెం గావునఁ బేడితనంబు దాల్చి బాహులదీర్ఘత్వంబునకు, గుణకిణంబులకు, గంచుకంబును, శంఖ వలయంబులును మాటు సేసికొని విరాటు కడకుం జని. 87
క. ఉత్తమ కన్యాజనులకు | నృత్తము గఱపంగ నాకు నేర్పు గలదు; త
ద్వృత్తమునకు న న్నేలుము; | చిత్తమునకు నెక్కఁ బనులు చేసెద నందున్‌.
88
క. అని కొలిచి యే బృహన్నల | యను నామముతోడఁ గన్యకాంతఃపుర వ
ర్తన మొనరించుచు లాసిక | తనమున నిపుణుండనై యతని మెచ్చింతున్‌ .
89
క. మానవపతి న ‘న్నెక్కడి | దానవు నీ’ వనియెనేని ‘ద్రౌపదికడ స
మ్మానంబు వడసి మెలఁగుదు; | నా నగళుల నృత్యగురువ ననఁగల వాఁడన్‌’.
90
తే. అనిన ‘నిది వోలు’ నని యియ్యకొని యజాత | వైరి యల్లన నకులుని వలను సూచి
నెమ్మనంబున నుమ్మలికమ్ము గదుర | నెలుఁగు చందంబు వేఱుగా నిట్టు లనియె.
91
ఉ. ‘ఒప్పెడు మేనుఁ బెంపు గల యుల్లము, నాగరికంపుఁ జందముం
జెప్పక చూప కీతని విశేషముఁ దెల్పెడుఁ గొల్చుటెంతయున్‌
డెప్పర; మేమి సేయుదుఁ గడింది విచారము పుట్టె; నె ట్లితం
డప్పురి సంచరించునొకొ! యన్యు లెఱుంగక యుండునట్లుగన్‌.’
92
వ. అనిన నప్పలుకులకు నకులుం డిట్లనియె. 93
ఆ. ‘అశ్వశిక్షకుండనై మత్స్యభూవిభుఁ | గొలుచువాఁడ; గుఱ్ఱములకు వలయు
తెఱఁగు లెల్లఁ జాల నెఱుఁగుదు; రూపుగా | నరయ నేర్తు వాని ననుదినంబు.
94
సీ. గోడిగ జాతిలోఁ గొదమ పెంటుల నేర్చి | మావుల హత్తించు మార్దవంబుఁ,
ద్రాళ్ళఁ బట్టింపంగఁ దఱి యైన కొదమల | సంచంబు లెఱిఁగి శిక్షించు నేర్పుఁ,
గళ్యాలఁ బదిలంబు గాని గుఱ్ఱంబులఁ | గ్రొత్త ముట్టున కియ్య కొలుపు వెరవుఁ,
బెనఁగు శూకలముల బిరుసుతనంబులఁ | జలము డింపక తీర్పఁ జాలుటయును.
 
తే. నలవరించిన వాఁడ; లాయమున నున్న | యపుడు దొసఁగించుకయు లేనియట్లు గాఁగ
మాటి మాటికిఁ బరికించి మందడీల | కెల్ల నూఱట యగుచు వర్తిల్ల నేర్తు.
95
క. దామగ్రంథి యనఁగ నొక | నామము వెట్టుకొనువాఁడ, నా తొంటి విధం
బా మనుజేశ్వరుఁ డడిగిన | నే మీకడవాఁడ నందు; నిది దెఱఁ గధిపా!’
96
క. అనినఁ ‘గడు లెస్స’ యని నె | మ్మనమున నూఱడి, విభుం డమానుష తేజో
ధనుఁ డగు సహదేవుఁ గనుం | గొని యిట్లను వగలు మిగిలి కొందలపఱుపన్‌.
97
చ. ‘అకుటిలుఁ; డార్యసమ్మతుఁ, డహంకృతి దూరుఁడు, నీతి నిర్మలా
త్మకుఁ డనవద్య శీలుఁడు, సధర్ముఁడు, దాంతుఁడు, గొంతిముద్దుసే
యు కొడుకు, మేను లేఁత, దన యుల్లము మెత్తన, యిట్టి యీతఁ డె
ట్లొకొ యొరు నాశ్రయించు? విధి యోపదె యెవ్వరి నెట్లు సేయఁగన్‌!’
98
క. అనుడు నతఁడు దన చిత్తం | బునఁ దోఁచిన విధము ధర్మపుత్రునితో ని
ట్లని చెప్పె నాతనికిఁ బు | ట్టిన యుత్తలపాటు గొంత డిందుపడంగన్‌.
99
క. ‘కీలారితనమునకు నేఁ | జాలుదు నని కొలిచి మత్స్యజనపాలుకడన్‌
మేలగు నడవడిఁ దంత్రీ | పాలుం డను పేరుతోడఁ బరఁగుదు నధిపా!
100
సీ. వంజల నైనను వల నేర్పడఁగ నొక | భంగిఁ జేఁపఁగ జేసి పాలు గొనఁగ.
బడుగుల నైనను బాటించి పరికించి | గోమున మైఁ గండ క్రొవ్వుదేఱఁ,
దెవులు గొంటులనైనఁ దీర్చి సంకటమున | కోపి ముందటియట్ల రూపు సేయ,
నఱ్ఱల నైనను నలువైన వెరవున | ముట్టె యంటఁగఁ బట్టి కట్టి విడువఁ.
 
ఆ. బిదుకఁ గదుపు సేర్పఁ బెదరు వాపఁగ నీరు | మేపు గలుగు నెడకు మెలఁగ, వెలువ
మెకము నరయ, మ్రుచ్చు మెలఁగిన వెలిగొట్ట | నేర్తుఁ; బసికిఁ జాలఁ గూర్తు నేను.
101
వ. నన్ను విరాటుండు ‘మున్ను నీ వెందుండు’ దని నిరూపించెనేని’ “యుధిష్ఠిరుగోష్ఠంబుల కధిష్ఠాతనై యుండుదు ననియెద’ నని పలికినఁ గౌంతేయాగ్రజుం” డిది యుక్తం బగు’ నని యనుమతి సేసి, పాంచాలి నాలోకించి, ఖిన్నాంతఃకరణుం డగుచు ని ట్లనియె. 102
చ. ‘ఇది కడు ముద్దరాలు, పను లేమియుఁ జేయఁగ నేర, దెంతయున్‌
మృదు, వొక కీడుపాటునకు మేకొనఁజాల, దుదాత్తచిత్త, యొం
టి దిరుగు దాని కోర్వ, దొకటిం దను దా సవరించుచొ ప్పెఱుం
గదు, తగ నొడ్లనుం గొలువఁగా వెర వెమ్మెయిఁ గల్గు నక్కటా!’
103
క. అనిన నతని చిత్తంబున | వెనుఁబాటంతయును బాయు వెరవు కలిమి యె
ల్లను దెలియునట్లుగా ని | ట్లనియెం బాంచాలి యుచితమగు చందమునన్‌.
104
క. ‘సైరంధ్రీ వేషంబునఁ | జేరుదు నంతఃపురంబు చెంతకు; నన్నా
భూరమణుదేవి యెంతయు | గారవమునఁ బిలువనంపఁగా వినయమునన్‌.
105
క. కని కొలువు సేసికొని మా | లిని నాఁజని ‘సాధ్వి యిది ; మలీమసవృత్తం
బున పొంతఁ బోవ దెన్నఁడు’ | నను వ్రేఁకఁదనంబు దోఁచునట్లు చరింతున్‌.
106
సీ. కలపంబు లభినవగంధంబులుగఁ గూర్చి | తనువున నలఁదుదుఁ దనుపుగాఁగ
మృగమదపంకంబు మృదువుగా సారించి | తిలకంబు వెట్టుదుఁ జెలువు మిగులఁ;
బువ్వులు బహు విధంబులఁ గట్టి ముడి కొక్క | భంగిగా నెత్తులు వట్టి యిత్తు;
హారముల్‌ మెఱయ నొయ్యారంబుగాఁ గ్రుచ్చి | యందంబు వింతగా నలవరింతు;
 
ఆ. వివిధ శిల్పములఁ బ్రవీణ నై మఱియును | వలయు పనుల వెంట మెలఁగ నేర్తు;
మత్స్యరాజమహిషి మనమున మక్కువ | నెలకొనంగ నిట్లు గొలువ నేర్తు.
107
క. ‘మును నీ వెచ్చో నిలు? తే | పని మెయి వర్తిల్లు?’ దనినఁ బాంచాలికి నే
ననుచారిణినై తగఁ బం | చిన గరువపుఁ బనులు నేర్చి చేయుదు నందున్‌.’
108
వ. అనవుడు ధర్మనందనుండు ద్రుపదనందన కి ట్లనియె. 109
క. ‘మన వంశంబును, వృత్తం | బును, బెంపును గావఁ జాలు పుణ్యసతివి; దు
ర్జను లగు తులువల తలఁపులు | గనుఁగొని యేమఱక మెలఁగఁగా వలయుఁ జుమీ!’
110
వ. ’అనిన విని యాజ్ఞసేని యనాదర మందస్మిత సుందర వదనారవింద యయి యతని కిట్లనియె. 111
క. ‘ఆరయ నెందును గౌరవ | భారం బెడలంగనీక పాతివ్రత్యా
చారము మై వర్తింతురు | సైరంధ్రీ జాతివారు సౌజన్యమునన్‌.
112
క. కావున నుచితము లగు నా | కా వెంటం గొలిచి తిరుగునప్పుడు, మితభా
షా విరచనమును, వ్రతసం | భా వనమును గౌరవంబుఁ బాపభయంబున్‌.’
113
క. అని చెప్పిన విని ‘యగుఁ బొ’ | మ్మని కైకొని ధర్మతనయుఁ ‘డందఱమును ని
ట్లనపాయత వర్తిల్లుద’ | మని తమ్ములతోడ నిశ్చయంబుగఁ బలికెన్‌.
114
వ. ఇవ్విధంబునఁ గార్యంబు నిర్ణయించి, ‘మన యగ్నిహోత్రంబుల నెల్ల ధౌమ్యులు రక్షించువారు; వంటలవారును మహానసాధ్యక్షులును బాంచాలీపరిచారికలును ద్రుపదపురంబున నిలుచువారు; రథంబులుగొని యింద్రసేనాదులైన సారథులు ద్వారకానగరంబున కరుగువారు; వీ రెల్లను దమ్మెవ్వరైనను మన వార్త లడిగిరేని ‘ద్వైతవనంబున మమ్ము విడిచి పోయి రట యెఱుంగ’ మనంగల వా’ రని చెప్పి యిత్తెఱంగున నభ్యంతర పరివారంబు నెల్ల నియోగించి వీడుకొలిపె; నయ్యవసరంబున ధౌమ్యుండు పాండుకుమారుల కి ట్లనియె. 115
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )