ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
ధౌమ్యుఁడు పాండవులకు సేవాధర్మంబు లెఱింగించుట (సం. 4-4-6)
క. ‘ఎఱిఁగెడు వారికి నైనను | గఱపక తక్క రుచిత ప్రకారము శుభముం
గొఱలు హితు; లట్లగుట నం | దఱకును జెప్పంగ వలయుఁ దగియెడు బుద్ధుల్‌.
116
వ. అదియునుం గాక. 117
తే. కౌరవాన్వయజాతులై గారవమునఁ | బెరిఁగినట్టి మీ రొండొక నరునిఁ గొలిచి
మసలి వర్తిల్లి మానావమానములకు | నోర్చి, యడఁకువతోడన యునికి యరిది.
118
క. వాలి వివిధాస్త్ర విద్యా | జ్వాలల వెలుఁగొందు పాండవజ్వలనం బా
భీలత మండం దొడరినఁ | గాల విరోధంబు మఱచి కార్యముఁ దప్పున్‌.
119
వ. కావున మీకు నప్రమాదార్థంబుగా నా నేర్చిన విధంబున నుపదేశం బవశ్యకర్తవ్యంబు; రాజులం గొలిచి యెమ్మెయి నయినను బ్రదుకు జనంబులు గీడునుం బొరయకుండునట్టి సాధారణ నీతి సంక్షేప రూపంబున నెఱింగించెద సావధానులరయి వినుండు. 120
క. తగఁ జొచ్చి తనకు నర్హం | బగు నెడఁ గూర్చుండి రూప మవికృతవేషం
బుగ సమయ మెఱిఁగి కొలిచిన | జగతీవల్లభున కతఁడు సమ్మాన్యుఁ డగున్‌.
121
క. ‘నరనాథుఁ గొలిచి యలవడఁ | దిరిగితి నా కేమి’ యనుచుఁ దేఁకువ లేమిన్‌
మరియాద దప్ప మెలఁగినఁ | బురుషార్థంబునకు హాని పుట్టకయున్నే?
122
ఉ. రాజగృహంబుకంటె నభిరామముగా నిలు గట్టఁ గూడ, దే
యోజ నృపాలుఁ డాకృతికి నొప్పగు వేషము లాచరించు, నే
యోజ విహారముల్‌ సలుప నుల్లమునం గడువేడ్క సేయు, నే
యోజ విదగ్ధుఁడై పలుకు; నొడ్డులకుం దగ దట్లు సేయఁగన్‌.
123
క. పుత్రులు పౌత్రులు భ్రాతలు | మిత్రు లనరు రాజు లాజ్ఞ మిగిలిన చోటన్‌
శత్రుల కాఁ దమయలుకకుఁ | బాత్రము సేయుదురు నిజశుభస్థితి పొంటెన్‌.
124
క. చనువాని చేయుకార్యం | బున కడ్డము సొచ్చి నేరుపున మెలఁగుచుఁ దా
నును బయిఁ బూసికొనుటఁ దన | మును మెలఁగిన మెలఁకువకును ముప్పగుఁ బిదపన్‌.
125
ఆ. రాజునొద్దఁ బలువురకు సంకటంబు గాఁ | దిరుగు పనుల నెంత తేజ మయిన
వాని బుద్ధి గలుగు వా రొల్ల; రవి మీఁదఁ | జేటు తెచ్చు టెట్లు సిద్ధ మగుట.
126
క. ఊరక యుండక, పలువుర | తో రవ మెసఁగంగఁ బలుకఁ దొడరకయు, మదిం
జేరువ గల నాగరికులుఁ | దారుఁ గలసి పలుక వలయు ధరణీశుకడన్‌.
127
క. వేఱొక తెఱఁగున నొరులకు | మాఱాడక యునికి లెస్స మనుజేంద్రుకడం;
దీఱమి గల చోటులఁ దా | మీఱి కడఁగి వచ్చి పంపు మెయికొన వలయున్‌.
128
చ. ధరణిపు చక్కఁ గట్టెదురు దక్కి పిఱుందును గాని యట్లుగా
నిరుగెలనం దగం గొలిచి యే మనునో, యెటు సూచునొక్కొ! యె
వ్వరి దెస నెప్పు డే తలఁపు వచ్చునొ యీతని కంచుఁ జూడ్కి సు
స్థిరముగఁ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి కొల్వునన్‌.
129
క. నగళులలోపలి మాటలు | దగునే వెలి నుగ్గడింపఁ దన? కేర్పడ నొం
డుగడం బుట్టినఁ బతి విన | నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్‌.
130
క. అంతిపురము చుట్టఱికం | బెంతయుఁ గీ, డంతకంటె నెగ్గు తదీయో
పాంత చర కుబ్జ వామన | కాంతాదులతోడి పొందుకలిమి భటునకున్‌.
131
ఆ. ఉత్తమాసనములు, నుత్కృష్ట వాహనం | బులును గరుణఁ దమకు భూమిపాలుఁ
డీక తార యెక్కు టెంతటి మన్నన | గలుగువారికైనఁ గార్య మగునె?
132
క. మన్నన కుబ్బక, యవమతి | దన్నొందిన స్రుక్కఁబడక, ధరణీశుకడన్‌
మున్నున్న యట్ల మెలఁగిన | యన్నరునకు శుభము లొదవు నాపద లడఁగున్‌.
133
క. జనపతి యెవ్వరి నైనను | మనుపఁ జెఱుపఁ బూనియునికి మది దెలియ నెఱిం
గిన యేనిఁ దాను వెలిపు | చ్చునె మునుము న్నెట్టి పాలసుండును దానిన్‌?
134
ఉ. ఎండకు వాన కోర్చి, తనయిల్లు ప్రవాసపుఁ జోటు నాక, యా
కొండు, నలంగుదున్‌, నిదురకుం దఱి దప్పెడు, డప్పి పుట్టె, నొ
క్కండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినా
తం డొక చాయ చూపినను దత్పరతం బని సేయు టొప్పగున్‌.
135
క. తా నెంత యాప్తుఁ డైన మ | హీనాయకుసొమ్ము పామునెమ్ములుగా లో
నూనిన భయమునఁ బొరయక | మానినఁగా కేల కలుగు మానము బ్రదుకున్‌?
136
ఆ. ఆవులింత, తుమ్ము, హాసంబు, నిష్ఠీవ | నంబు గుప్త వర్తనములు గాఁగఁ
జలుప వలయు నృపతి కొలువున్న యెడల, బా | హిరము లైనఁ గెలని కెగ్గు లగుట.
137
క. వైరుల దూతలు, నెరవగు | వారు, నిరాకృతులుఁ బాపవంతులుఁ దమకుం
జేరువఁగా వర్తించుట | నేరమి; తుదిఁ బోయి చేటు నిందయు వచ్చున్‌.
138
ఆ. వసుమతీశు పాల వసియించు నేనుంగు | తోడ నైన, దోమతోడ నైన
వైర మగు తెఱంగు వలవదు; తా నెంత | పూజ్యుఁ డైన జనుల పొందు లెస్స.
139
క. కలిమికి భోగముల కదా | ఫల మని తను మెఱసి బయలుపడఁ బెల్లుగ వి
చ్చలవిడి భోగింపక వే | డ్కలు సలుపఁగ వలయు భటుఁ దడంకువతోడన్‌.’
140
వ. అని యిట్లు పురోహితుండు సేవాధర్మంబు లెఱింగించిన ధర్మజ భీమార్జున నకుల సహదేవులు ప్రసన్న చిత్తులై యిట్లనిరి. 141
క. ‘తల్లియుఁ దండ్రియు దైవము | నెల్ల సుహృజ్జనము మీర; యిట్లు గొలిచి వ
ర్తిల్లెడు తెఱంగు లెంతయుఁ | దెల్లము సేసితిరి; బ్రతికితిమి మీ కరుణన్‌.’
142
ఆ. అనిన ధౌమ్యుఁ డిట్టు లనియె; ‘నీ వత్సర | మొకఁడు నెట్టు లయిన నుడిగి మడిఁగి
సంకటముల కోర్చి చరియించి యాపద | నిస్తరించి పిదప నెగడవలయు’.
143
క. అనవుడు, ‘నట్టుల చేసెద’ | మని వారలు భక్తియుక్తి నతనికి నభివం
దన మొనరించినఁ దగు దీ | వన లిచ్చె నతండు గాఢవాత్సల్యమునన్‌.
144
క. భూదేవోత్తము నాశీ | ర్వాదంబులఁ బ్రీతిఁ బొంది వారలు ప్రస్థా
నాదరపరు లగుటయు స | మ్మోదావహ పుణ్యకర్మముల కుద్యతుఁడై.
145
ఆ. అతఁడు నియతితోడ నగ్ని సముజ్జ్వలం | బుగ నొనర్చి కామ్యపూజ దీర్చి
యాన సమయ మంగళార్థంబు లగు మంత్ర | సంచయములు దగ జపించుచుండె.
146
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )