ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
పాండవులు పాంచాలితోడ విరాటు నగరంబునకు బయలుదేరుట (సం. 4-4-48)
వ. తదనంతరంబ, హుతవహునకుం బురోహితునకుం బ్రదక్షిణంబు సేసి, యమ్మహీసురవరేణ్యు నను మతి వడసి, పాండవులు పాంచాలిం బురస్కరించుకొని, యాతండును దోడన యరుగుదేరం గదలి, శుభ నిమిత్తంబులు గైకొనుచుం జని, దశార్ణ దేశంబున కుత్తరంబునఁ బాంచాల జనపద యామ్యదిగ్భాగంబున సాళ్వ శూరసేన విషయంబులలోనం గాళిందీ దక్షిణతీరం బొరసికొని, పశ్చిమాభిముఖ ప్రయాణంబుల నెడనెడ వన్యాహారంబుల శరీర యాత్రలు నడపుచు, నానా మృగ వివిధ విహారంబులను, మనోహర కుసుమ కదంబ గంధ మకరంద బిందు సందోహ సుందర తరుచ్ఛాయా సేవనంబులను, గమల పరాగ పరంపరా ధూ సరిత భాసుర జలాశయ సమవగాహనంబులను, సరిత్సంగమ స్నానాద్యనుష్ఠానంబులను, బహుప్రకార పాదప గుల్మలతావ లోకనంబులను, బక్షికుల ప్రకరానేకభంగి విరుతాకర్ణనంబులను వినోదించుచుఁ, గానన మార్గంబుల నరిగి, మత్స్యమండలంబు గడి సేరి ధౌమ్యుని వీడుకొనిరి; అవ్విప్రవరుండును నొక్క పుణ్యాశ్రమంబున వసియించె; వారు మఱియు నూళ్ళు సొరక యడవి తెరువుల నడచి విరాటు నగరంబున కనతిదూరం బగు కాంతారంబునం దఱిమి పోవు సమయంబునఁ బథిశ్రమంబు నూని యాజ్ఞసేని యిట్లనియె. 147
ఉ. ‘డప్పి జనించె, వ్రేళుల పుటంబులు పొక్కఁ దొడంగె, గోళ్ళలోఁ
జిప్పిలఁ జొచ్చె నెత్తురులు, చిత్తము నాకుఁ గడు న్వశంబుగా
దప్పుర మిచ్చ టచ్చటను నాసల వచ్చితి, నెంత ద వ్వొకో!
యిప్పటి భంగి నొక్కడుగు నేఁగెడు దానికి నోర్వ నెమ్మెయిన్‌’.
148
వ. అనవుడు. 149
క. తన మదిఁ గరుణయు ఖేదం | బును బిరిగొనుచుండ ధర్మపుత్రుఁడు నకులుం
గనుఁగొని ద్రుపదనృపతి నం | దన దెస యాతనికిఁ జూపి తగ నిట్లనియెన్‌.
150
ఆ. ‘అకట! మనము వచ్చినది గడుదవ్వు, నేఁ | డప్పురంబు సొత్త మని తలంచి
తఱిమి నడచితిమి లతాతన్వి యిది; వడ | గొనియె; మోచి తెమ్ము కొంత దవ్వు’
151
క. అనిన విని పూని గ్రక్కున | జనుదేరమి, నతఁడు డస్సెఁ జాలం డని నె
మ్మనమున నెఱింగి యాతని | యనుజన్మునిఁ బనిచె; నతఁడు నలసుం డయినన్‌.
152
వ. సవ్యసాచిం జూచి. 153
ఉ. ‘ఇమ్మదిరాక్షి డస్సె, మన కీనడుమన్‌ విడియంగ నొండుచో
టిమ్మును గాదు; నిక్కమున కేమును డస్సితి; మట్లు గాన నీ
వెమ్మెయినైన దీని భరియించి పురంబు సమీప భూమికిం
దె’ మ్మని చెప్ప నాతఁడును దెచ్చెఁ బ్రియంబునఁ బుష్పకోమలిన్‌.
154
క. మోచికొని వాసవాత్మజుఁ | డా చెలువం దేర నిట్టు లరిగి పురము దృ
గ్గోచర మగుటయుఁ దమ్ములఁ | జూచుచు వారలకు ధర్మసుతుఁ డిట్లనియెన్‌.
155
క. ‘చక్కని చిక్కని మేనులు | నిక్కోదండములు నైన నెఱుఁగరె? మన మీ
చక్కటి నిలుతమె? శస్త్రము | లొక్కెడ దాఁచుటకు, వేషయోజనములకున్‌.’
156
వ. అనిన నిది కార్యంబని మధ్యమపాండవుం డా సుమధ్య నొక్క శీతల సికతాతలంబున డించె; దక్కినవారలు నట్ల చేయుద మని నిలిచి; రట్టియెడలఁ బాండవాగ్రజుండు గాండీవి చేతి వి ల్లుపలక్షించి యతని కిట్లనియె. 157
క. ‘మన శస్త్రాస్త్రంబులు ద | క్కినయవి యొకభంగి; వీటికిని గాండివముం
గొనిపోయితిమేని సుయో | ధనునకు నగపాటు నిశ్చితం బూహింపన్‌.’
158
వ. అనవుడు. 159
చ. ‘ఇది పెనుఁబాము చందమున నెంతయు భీషణమై జనంబులన్‌
బెదరఁగఁ జేయు; నట్లగుటఁ బెట్టి చనన్‌ వలయుం; దలంచి నా
హృదయము దీనిఁ బాయుటకు నియ్యకొనం జొర; దెట్లు చెప్పినం
దుది నొకచోట వైచుటయ తోఁచిన కార్యము నయ్యెడుం గటా!’
160
వ. అని వితర్కించుచుం గిరీటి యురియాడు చిత్తంబు నుత్తలం బుడిపికొని నిశ్చయించి, యాయుధంబులు నిక్షేపించుటయ కర్జంబుగాఁ బలికి యోగ్యస్థల నిరూపణంబునకు నలుదిక్కులుం బరికించి ప్రేతభూమి పరిసరారణ్యంబునందు. 161
సీ. నెగసిన కొనలేచి నింగినంతంతకు | నవులఁ ద్రోచుచుఁ దనరారు దానిఁ,
జాఁగిన శాఖ లాశాచక్రమున కొలం | దులు బారవెట్టంగఁ బొలుచు దానిఁ,
గవట లొండొంటితోఁ; గదియుచు నెడములు | మ్రింగి ప్రబ్బఁగ సొంపు మిగులు దాని,
లోని జొంపము పవలును బెను జీఁకటి | నొదవించి పొదలంగ నొప్పుదానిఁ
 
తే. గనియెఁ బవమాన వివిధ వర్తన కళాను | వర్తి; గాకఘూకారవస్ఫూర్తి జాత
భీతి పరిసరవర్తి నాభీల భుజగ | చండమూర్తి, శమీతరు చక్రవర్తి.
162
వ. కని యమ్మహీరుహంబు ధర్మనందనునకుం జూపి యిట్లనియె. 163
శా. ‘పక్షివ్యాకులముం, బరేత నిలయోపాంతోత్థమున్‌, డాకినీ
రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధంబునై చూడఁ జి
త్తక్షోభం బొనరించు; నట్లగుటఁ జెంతం జేరరా దీ శమీ
వృక్షం బెవ్వరి; కిందుఁ బెట్టుదమె పృథ్వీనాథ! శస్త్రాస్త్రముల్‌?
164
క. పెనుఁ బొడువుఁ బఱపు జొంప | మ్మును గలయది; దీన నెల్ల పురుషులకుఁ బ్రయో
జన మొకఁడు లేదు, చేరం | జనఁ, జూడఁగ, నరయ, నెక్క సమకట్టంగన్‌.
165
ఉ. కావున దీనియం దిడుట కార్యము కైదువులెల్లఁ; గేశచ
ర్మావృత సంచయంబుగ శవాకృతిగా నొనరించి కట్టినం
బోవరు దీని ది క్కొరులు భూవర! నెమ్మది నూఱడిల్లు; మె
చ్చో వసియించినం బిదపఁ జొప్పడుఁ గ్రమ్మఱ వచ్చి కైకొనన్‌.’
166
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )