ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
పాండవులు దమ యాయుధంబుల శమీవృక్షమునఁ బెట్టుట (సం. 4-5-9)
వ. అని చెప్పిన నందఱు నత్తెఱంగున కియ్యకొనుటయు, నతండు గాండీవంబు నవలోకించి. 167
చ. ‘అనిమిష దాన వాంబరచరాదిక జాతుల నెల్లఁ బోర నీ
ధనువునఁ గాదె గెల్తు! సముదగ్ర విరోధి భయావహంబు; దీ
నిని నొక మ్రానఁ గట్టి చను నిశ్చయ మొందఁగఁ జేసె దైవ; మే
మనఁ గల? దట్ల కాక’ యని యాత్మ నలందురి మందచేష్టుఁడై.
168
వ. ఎక్కు డించినఁ బాండవాగ్రజుండు. 169
క. దనుజకుల త్రాసకరం | బును రిపుభంజనము రత్నభూషిత రూపం
బును గురుదేశాహ్లాదన | మును నగు నిజకార్ముకంబు మో పెడలించెన్‌.
170
వ. తదనంతరంబ భీమ నకుల సహదేవులదెసఁ గనుంగొని. 171
సీ. ‘సైంధవ యక్ష పాంచాల త్రిగర్తుల | దీనన యోర్చితి మానధనుఁడ!
సౌరాష్ట్రనాథాది శత్రులు దీనిచేఁ | గాదె మర్దితు లైరి ఘనభుజుండ!
కాళింగ పాండ్య మాగధుల నిర్జించుచో | నిదియ కైదువు నీకు విదితయశుఁడ!’
యని క్రమంబున వారలందఱ విండులు | పెంపెసలార వేర్వేఱ పొగడి
 
ఆ. గొనయములు వదల్ప ననుమతి సేయుడు | వారు నట్ల చేసి తేరఁ, జాప
ములును దొనలు వర్మములు నసి ముద్గ రా | ద్యాయుధములుఁ గూడ నతఁడు గట్టె.
172
వ. ఇట్లు పూర్వోక్త ప్రకారంబునం బొదివి, మహోరగంబులం బెట్టియలం బెట్టి కట్టు చందంబున బంధించి, వానిం గొనుచు, నయ్యజాతశత్రుండు ధర్మదేవతా దత్తవరుం డగుటంజేసి నిశ్శంకం బైన యంతఃకరణంబుతోడ శమీవృక్ష సమారోహణం బాచరించి. 173
తే. బ్రహ్మ విష్ణు మహేశ దిక్పాల చంద్ర | సూర్య వనదేవతా పితృస్తుతు లొనర్చి
దివియు భువియును జూచి ప్రార్థించి, యొక్క | విపులశాఖ నాయుధములు వ్రేలఁగట్టె.
174
వ. ఇట్లు కట్టి తదీయాధిదైవతంబుల నుద్దేశించి నమస్కరించి. 175
క. ‘నరునకు నాకుం దక్కఁగ | నొరులకు మీరూపు సూపకున్నది; విషవి
స్ఫురిత భుజగభంగి భయం | కర మూర్తులు దాల్చి యుండఁగా వలయుఁ జుఁడీ.
176
ఉ. భీముఁడు ధార్తరాష్ట్రకుల భీషణరోషుఁడు; చిత్త మెప్పు డె
ట్లై మదమెత్తునో; యతని యాగ్రహవృత్తికి లోనుగాక మీ
రే మెయి నైన వంచన వహించి తొలంగుట మత్సమీహితం;
బేమఱకుండఁగా వలయు నివ్విషమాబ్దములోన నాతనిన్‌.
177
వ. అని వేఁడికొని వృక్షంబు డిగ్గి దానికిం బ్రదక్షిణంబు వచ్చి ప్రణమిల్లి భీమసేనుదెస మరలి చూచి సాంత్వన వచన సమేతంబుగా నతనిం గౌఁగిటంజేర్చి యనునయించి తమ చేసిన విధంబు తత్ప్రదేశవర్తు లయిన గోపాలాది క్షుద్రజనంబులకు మఱుఁగు వెట్టం దలంచి వారల కభిముఖులై పాండునందను లందఱు నిట్లనిరి. 178
చ. ‘ఇది శతవృద్ధు మాజనని; యిప్పుడు మృత్యువుఁ బొందె; నట్లు సే
యుదుము; కులప్రయుక్త మగుచున్న సనాతన ధర్మ మిత్తెఱం
గ; దహన కర్మ మొల్ల; మది గానిదిగా మును నిశ్చయించి మా
మొదలిటివా రొనర్చు విధముం గొనియాడితి మేము నియ్యెడన్‌.
179
వ. అని యిట్లు పలుమఱుం దెలియఁబలికి శస్త్రాస్త్రంబుల నిక్షేపణంబు నిగూఢం బగుటకు నూఱడిల్లి; యచ్చేరువం జచ్చిన పసరంబు వడియున్నం జూచి, సహదేవుం బనిచి, ధర్మ తనయుండు దాని చర్మం బొలిపించి, శీతాతప వర్ష పరిహారంబుగా నాయుధంబులం బొదివించి, మఱియును దత్సమీపంబున నొక్క శుష్కశవంబు నవలోకించి ‘యిది యుంఛవృత్తి యైన మానవు కళేబరంబు గావలయు’ ననుచు నదియునుం గైదువుల కట్టపయిం బెట్టి కట్టించె; నివ్విధంబున నత్యంతగుప్తి యాచరించి, ‘దీని దుర్గంధంబున వనచారు లెవ్వరుం జేర రని నవ్వుచు వార లచ్చోటు వాసి విరాట పురాభిముఖులై చనుచుండి, యజ్ఞాతవాస కాలంబునం దమ రహస్యపు వ్యవహారంబునకు ననువుగా నేవుర పేళ్ళును గ్రమంబున జయుండును, జయంతుండును, విజయుండును, జయత్సేనుండును, జయద్బలుండునని సంకేతించుకొని, యాజ్ఞసేనీ పురస్సరంబుగాఁ బుణ్యనదీ తీర్థావతరణంబు సేసి, తదీయస్నానంబునం బథిశ్రమం బపనయించి, దేవపితృతర్పణ మంగళ జపహోమ ధ్యానాద్యనుష్ఠానంబు లొనర్చిరి; తదనంతరంబ యక్కౌంతేయాగ్రజుండు ప్రాఙ్ముఖుం డయి నిర్మలచిత్తంబున ధర్మదేవతం దలంచి యిట్లనియె. 180
ఆ. ‘తండ్రి! నీవు నాకు దయతోడ నిచ్చిన | వరము చిత్తగించి, వలయు తెఱఁగు
సమయ సముచితముగ సమకట్టు మయ్య! యీ | రాకుమారు లవిధిఁ బోక యుండ.’
181
వ. అనుచు ననుజుల దెసకు దూర వగచి డగ్గుత్తిక వెట్టి మఱియును. 182
ఉ. అంబరవర్తి వైనఁ గని యక్షునిచే నగపడ్డ వీరి ప్రా
ణంబులు మున్ను నిన్నడిగి, నల్వురకున్‌ నయవిక్రమ ప్రభా
వంబులు వేఁడికొన్న నతివత్సలభావము; బొంది యాదరా
ర్ద్రంబగు చూడ్కితోఁ బ్రియహిత స్థిరభాషల నూఱడింపవే.
183
వ. అని తారు మున్ను భూసురవరు నరణి దేర నరిగిన నాఁడు సరోవరతీరంబునం దనకు ధర్ముండు సేసిన మన్నన దోఁప నతనికి విన్నవించినవాఁడై కరకమలంబులు మొగిచి, ఫాలభాగంబునం గదియించి, సంప్రార్థనంబుగా వినయ వినమిత మస్తకుం డగుటయుఁ, దదనుగ్రహంబునఁ బాండవాగ్రజుండున్న యునికిన సన్న్యాసి రూపం బలవడి ధాతుపట దండకమండలు కలిత మూర్తి యయ్యె; నయ్యవసరంబున వారందఱు మహాద్భుతం బంద వారివారికి నయ్యైవేషంబుల కనుగుణంబులగు నంబరాభరణ మాల్యాద్యుపకరణంబులు సన్నిహితంబు లయినం జూచి సంతసిల్లి, యెల్లవారిం గలయం గనుఁగొని, క్రమంబున నొంటిమైఁ జనుదెండని నియోగించి, యతండు నానావిధంబులగు నక్షంబులముడి కక్షంబున నిడికొని, చని, దైవయోగంబున విరాటుండు వెడలివచ్చి బయలికొలు విచ్చుటంజేసి తదాస్థానంబు చేరంబోవునప్పుడు. 184
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )