ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మరాజు సన్న్యాసి వేషంబున విరటుఁ గొల్వవచ్చుట (సం. 4-6-1)
ఉ. దవ్వులఁ జూచి మత్స్యవసుధావతి ‘యీ చనుదెంచుచున్నవాఁ
డెవ్వఁడొ? నాదు చూడ్కులకు నెంతయు వ్రేఁగయి తోఁచె నె ట్లితం
డివ్విధిఁ బొందెనో? జగము లెల్లను నేలఁగఁ జాలు తేజ మా
మువ్వుర తోడి జోడి యగు మూర్తి; యతీంద్రుని యొప్పుగంటిరే?
185
సీ. కరచరణాద్యంగకంబు లేలొకొ రత్న | భూషణ ప్రకరంబు పొందు దొఱఁగె?;
నుభయ పార్శ్వంబుల నిభఘట లేలొకో | చనుదేవు సమదాళి సమితి మొరయఁ?;
బాయు తొలంగు మంచాయత వేత్ర హ | స్తుల మొత్త మేలొకో తోడ రాదు?;
ధవళాతపత్రముల్‌ దఱచుగా నేలొకో | పట్టరు మౌక్తిక ప్రభలు వెలుఁగ?;
 
తే. నితఁడు రాజగు; రాజను నింత మాత్ర | గాదు; మూర్ధాభిషిక్త వర్గంబుఁ దనదు
చరణయుగ్మంబు గొలిపింపఁ జాలు సార్వ | భౌమ పదవికిఁ దగియెడు భంగివాఁడు.
186
క. మన కడకు నేమిటికి వ | చ్చెనొకో; యే నిమ్మహాత్ము చెప్పిన పనులె
ల్లను జేయువాఁడఁ గోరిన | కనకాంబరమణులు తలఁపు గడవఁగ నిత్తున్‌.
187
ఆ. మత్స్యవిషయ రాజ్యమహిమకు యుక్తుండు | గాఁ దలంచెనేని గారవమున
నట్లచేసి, భక్తి ననుచరింతు నమాత్య | సుత సుహృద్భటార్య యుతము గాఁగ’.
188
వ. అని సమస్తజనంబులుఁ దదభిముఖులయి భక్తియుక్తింబ్రత్యుత్థానంబు సేయం దానును గద్దియ డిగ్గి యెదురు సని నమస్కరించి, యతని యాశీర్వాదంబులు గైకొని, సగౌరవంబుగాఁ దోడ్కొని చనుదెంచి సమంచిత సమున్నతాసనంబున నునిచి వినయావనతుం డయి. 189
ఉ. ‘ఎయ్యది జన్మభూమి? కుల మెయ్యది? యెయ్యది యున్నచోటు? పే
రెయ్యది? మీర లిందులకు నిప్పుడు వచ్చిన దానికిం గతం
బెయ్యది? నాకు నింతయును నేర్పడఁగా నెఱిఁగింపుఁ డున్న రూ
పయ్యది’ నావుడున్‌ నరవరాగ్రణి క య్యతిముఖ్యుఁ డిట్లనున్‌.
190
ఆ. ‘ఉన్న రూప పలుకు నన్నరు లెక్కడఁ | గలరు? తోఁచినట్లు పలుకు వలుక
నైన చంద మయ్యె; నంతియ కా, కంత | పట్టి చూడఁగలరె యెట్టివారు?’
191
వ. అని మందహాసంబు సేయుచు మఱియును. 192
క. నానావిధ భూతమయము | మే; నతిచంచలము మనము; మెయికొని నిక్కం
బే నరునకుఁ జెల్లింపం | గానగు? సత్యంబు నడపుక్రమ మట్లుండెన్‌’.
193
వ. అనుచు మత్స్యమహీవల్లభు నవలోకించి. 194
క. ‘ద్విజుఁడఁ, గురు విషయ జాతుఁడ | సుజనప్రియుఁ డైన ధర్మసుతు సఖుఁడఁ బరి
వ్రజనాశ్రమ కలితుండ, మ | నుజవల్లభ యోగ్య బహు వినోదకరుండన్‌.
195
క. ద్యూతక్రీడకుఁ గొండొక | నేతుం; గపటమున నొవ్వని జనంబులు నా
చేతి ధనమెల్లఁ గొని పరి | భూతి యొనర్చిన, విరక్తి పుట్టి వెడలితిన్‌.
196
చ. నృపనయవిద్యకుం దగిన నే ర్పలవడ్డది గొంత కొంత; ధ
ర్మపరుల సంగతిం దగిలి మచ్చిక నుండుదు; బేరు కంకుఁ; డే
వపుఁ గొలు వైన నాకు నిలువన్‌ మది గొల్పదు; కాన నిన్ను భూ
మిపతులలోన సాధుజనమిత్రుఁడు నా విని కొల్వ వచ్చితిన్‌.
197
తే. వత్సరంబునఁ గడచను వ్రతము నాకు | దాని నీపాలఁ జల్పి యుత్సాహవృత్తి
మెఱయ, నీకుఁ గృతజ్ఞత నెఱపి, తొల్లి | యెగ్గు సేసిన వారి జయింపఁ బోదు’.
198
వ. అనిన విని సంప్రీత చేతస్కుండై విరాటుం డతని కిట్లనియె. 199
తే. ‘అట్ల చేయుఁడు రుచిరోన్నతాసనములు | వాహనములు భోజనములు వస్త్రములును
వలయు భోగంబులును నెల్లవర్తనములు | నాకు నెట్లట్ల మీకును నడపువాఁడ.
200
క. నా యనుచరులం దెవ్వఁడు | మీ యెడ భయభక్తి లేక మిగిలి మెలఁగెనే
నా యధముని దండితుఁగాఁ | జేయుదు నతఁ డెంతయుం బ్రసిద్ధుం డయినన్‌.
201
వ. అట్లుంగాక. 202
చ. వెలయఁగ మత్స్యరాజ్యపదవీ పరిపాలన సేయఁగా మదిం
దలఁచుట యెంతయుం బ్రియము తమ్ములుఁ బుత్త్రులు బంధులుం బ్రధా
నులును బలంబు నేను సుమనోవిభుతుల్యుఁడవైన నిన్ను మి
క్కిలి యగు భక్తిఁ గొల్చి కృతకృత్యతఁ బొందుదు; మట్ల చేయవే’!
203
వ. అనిన విని దరహసితవదనుం డగుచుఁ బాండవాగ్రజుం డతని కిట్లనియె. 204
క. ‘ఏను హవిష్యమ కుడుతును | భూనాయక ! నాకు శయ్య భూమియ; యిమ్మైఁ
బూని వ్రతంబులు సలిపెడు | వానికి నిన్నియును నిట్లు వలయునె చెపుమా!’
205
ఆ. అనిన విరటుఁ డిట్టు లనియె ‘నెత్తెఱఁగున | నడవ నిష్ట మట్ల నడచి మీకు
మనసు వచ్చినన్ని దినములు సలుపుఁ డి | చ్చోట నదియ మాకు శోభనంబు.
206
క. ద్యూతజ్ఞుల దెసఁ గొండొక | ప్రీతియుఁ గల; దట్లుగాక పెద్దల రగు మీ
రే తెఱఁగున విహరించినఁ | జేతోమోదంబు; దగ వసింపుఁడు నెమ్మిన్‌’.
207
వ. అని పలికి కౌంతేయాగ్రజు నత్యంత సంతుష్టాంతరంగుం జేసి. 208
చ. పొరిఁ బొరిఁ బ్రీతి రెట్టిగ నపూర్వవిలోకన మాచరించుఁ ద
త్పరమగు సద్వివేకములు భావ నిరూపణ సేయుఁ గౌతుక
స్ఫురణఁ గరంబు దత్కరముఁ బొంద నయంబునఁ జేర్చి వాక్య వి
స్తర చతురత్వ మేర్పడఁగ సల్లపనం బొనరించు నర్థితోన్‌.
209
వ. ఇట్లు మత్స్యమహీవల్లభుం డతనిం గలిపికొని పరివారంబును దానును దదీయ సంభావనా తత్పరులైయుండి; రంత. 210
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )