ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
భీముఁడు వంటలవాఁడై విరటుఁ గొల్వ వచ్చుట (సం. 4-7-1)
సీ. చట్టువం బొకచేతఁ బట్టి ఖడ్గము చంకఁ | దగిలించి సురియతో బిగియ ద్రిండు
గట్టిన నునుఁజేల కప్పెంతయును జెన్ను | సేయంగ దాపలి చేతి యందు
బెడిదంపుఁగోలలు బెడఁగొంద బహువర్ణ | చిత్రితాజినము పై చీర గాఁగఁ;
జూపఱెల్లను దన రూపంబు చూడ్కికి | వ్రేఁగైన నత్యంత విస్మయంబుఁ
 
తే. బొందుచుండ సమీరణ పుత్త్రుఁ డగ్ర | జుండు వోయిన దెసఁ దప్ప నొండువలన
సమదవారణపతి గమనమున మత్స్య | ధరణి వల్లభు సభ చేర నరుగుటయును.
211
వ. అంతంతం గనుంగొని. 212
క. ఉలుకును వెక్కసపాటును | దలకొను నెమ్మనముతోడ ధాత్రీరమణుం
డలఘు భుజ విపుల వక్ష | స్థ ల్స రేఖాకాంతిఁ బరవశత్వముఁ బొందెన్‌.
213
వ. ఇ ట్లతని రూపాతిశయంబున కోటువడి చూచుచు నిజాంతర్గతంబున. 214
క. విహరింప మానవాకృతి | సహితంబుగ మహికి నర్థిఁ జనుదెంచిన ప
ద్మహితుఁడొ హిమకరుఁడొ శచీ | గృహమేథియొ కాక యితఁడు కేవల నరుఁడే!
215
క. ఏమి కులంబున వాఁడొకొ? | నామం బెద్ది యగు నొక్కొ? నా భృత్యులలో
నీ మనుజోత్తముఁ దొల్లియు | నే మెఱుఁగుదు మనఁగ నిచట నెవ్వరు గలరో?
216
క. అనుచుండ ననతి దూరం | బున కల్లన వచ్చి పవనపుత్త్రుఁడు మనుజేం
ద్రునకు జయశబ్దయుతముగ | వినయంబున మ్రొక్కి విన్నవించె నిభృతుఁడై.
217
శా. ‘దేవా! నాలవజాతివాఁడ నిను నర్థిం గొల్వఁగా వచ్చితిన్‌;
సేవాదక్షత నొండుమై నెఱుఁగ; నీ చిత్తంబునన్‌ మెచ్చున
ట్లే వండం గడునేర్తు; బానసమునం దిచ్చోటనే కాదు న
న్నే వీటన్‌ మిగులంగ నెవ్వఁడును లేఁ డెబ్భంగులం జూచినన్‌.
218
క. పేరు వలలుండు; కూడుం | జీరయు నిడి సాకతంబు సేసినఁ జాలుం
గోరిన వంటకములు నా | నేరిమిఁ దగ నెఱపి కొలుతు నిశ్చలభక్తిన్‌.’
219
చ. అనవుడు మత్స్యభూరమణుఁ డాతని కిట్లను ‘నెట్లు శూద్రుఁగా
నినుఁ దలఁపంగవచ్చు? ధరణీ భరణ క్షమమూర్తి వీవు; నీ
కనుగుణమైన యానమును నాసనమున్‌ రుచిరాతపత్రముం
జనవరి కొల్వు నిచ్చెద గజవ్రజముం బరికింపు పెంపుతోన్‌.’
220
క. అనుటయు మోఱకుచందం | బున మో మడ్డ్దము గదల్చి భూవిభుఁడు సభా
జనులు విన ననిలసుతుఁ డి | ట్లనియెం బ్రస్ఫుట నిరర్గళాలాపములన్‌.
221
ఉ. ‘నా కవి యెల్ల నేల? నరనాథులకుం బ్రియ మొందునట్లుగాఁ
బాకము చేయనేర్తు జనపాలక! ధర్మసుతుండు పెద్దయుం
జేకొని యుండు బానసము సేయు విధంబున కిచ్చ మెచ్చి; పు
ణ్యాకరమూర్తివైన నిను నాతనిఁ; గొల్చినయట్ల కొల్చెదన్‌.
222
చ. వలసిన నేలు; మేను బలవంతుఁడఁ; గారెనుబోతు దంతి బె
బ్బులి మృగనాథునిం దొడరి పోరుదు శూరత యుల్లసిల్లఁగా
దలమును లావు విద్య మెయిదర్పముఁ బేర్చి పెనంగు జెట్టి మ
ల్లుల విఱుతున్‌ వడిన్‌ గడియలోనన చూడ్కికి వేడ్కసేయుదున్‌.
223
క. కొలువు గొన నొల్ల కుండుట | గలిగినఁ బొమ్మనుట యంత కంటెను మే; లే
వలసిన కడ కేఁగెద; నీ | తలఁ పెయ్యది? యానతిమ్ము ధరణీనాథా!’
224
వ. అనిన విని భూనాథుండు సానునయంబుగా నిట్లనియె. 225
ఉ. ‘ఇమ్మహనీయ రూపమును నేడ్తెఱఁ గన్గొని వేడ్క నీకు యో
గ్యమ్మగు భంగిఁ జెప్పితిమి గాని నరోత్తమ! యొండు గాదు; నీ
వెమ్మెయి నైన నిల్చుటయ యిష్టము; వంటల మేరవాఁడవై
యిమ్ముల నుండు సూదజనమెల్లను నీదగు పంపు చేయఁగన్‌.’
226
క. అని హర్షోత్కర్షంబున | మన మలరఁగఁ బల్కి మత్స్యమనుజాధీశుం
డనిలసుతు నేలె; నాతఁడుఁ | దన మనమున నూఱడిల్లెఁ దదవసరమునన్‌.
227
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )