ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
అర్జునుఁడు పేడిరూపమున విరటుఁ గొల్వ వచ్చుట (సం. 4-10-1)
సీ. కాళ్ళ యొప్పిద మాఁడు కట్టనుజ్జ్వలము చే | యంగ, సంకుల బాహు లంద మెడలఁ,
గంచుక మంగంబు కాంతికి మాటుగా | మెడ హేమ పట్టిక మెఱయ కుండ,
వదనంబు కొమరు భావనఁ జేసి వేఱుగా | నుదుటి పెం పలకలఁ బొదువఁ బడఁగఁ,
బవడంపు జొత్తులఁ జెవుల రూ పడఁగంగఁ | బాపట తలకట్టు భంగి దప్ప,
 
ఆ. మంచు మఱుఁగు వడిన మార్తాండుఁడును బోలె | నీఱు గవిసియున్న నిప్పుఁ బోలె
వేషధారి యైన విష్ణుండుఁ బోలె న | వ్విరటు కొలువు చేర నరుఁడు వచ్చె.
228
క. చనుదెంచి పేడితనమును | వనితారూపంబు నమర వాసవసుతుఁ డా
మనుజాధీశునకు సభా | జనులకుఁ దనుఁ జూపి మందసంచారమునన్‌.
229
వ. మెలంగినం గనుంగొని మత్స్యజనవిభుండు దన యొద్దివారలతో నిట్లనియె. 230
మ. ‘వనితావేషము గల్గియున్నయది; చెల్వం బాఁడుచందంబు గా
దు నిరూపింప మహానుభావతయు, నిర్దోషత్వమున్‌ రాజసం
బును శోభిల్లెడు; నెవ్వఁడే నొక జగత్పూజ్యుండు క్రీడార్థ మి
ట్లొనరం దాల్చిన రూపు గావలయు; మీ రూహింపుఁడా యట్లగున్‌.’
231
తే. అనినఁ బరిజనంబులు విస్మయంబు గదుర | నిశ్చయము చేసి పలుకంగ నేర్పు లేక
చూచుచుండఁగ నా సవ్యసాచి సేరఁ | జని విరాటనృపాలుతో సవినయముగ.
232
క. ‘నిన్నుఁ గొలువంగ వచ్చితిఁ | గన్నియలకు నాట గఱపఁగా నోపుదు వి
ద్వన్నుత! మన్నామంబు బృ | హన్నల; యేఁ బేడి’ ననుడు నతఁ డిట్లనియెన్‌.
233
ఉ. ‘ఆయతబాహులున్‌ వెడఁదయైన సమున్నత వక్షమున్‌ సరో
జాయత లోచనంబులుఁ బ్రసన్నముఖంబు నుదాత్తరేఖయుం
గాయజుఁ గ్రేణి సేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్రమ
శ్రీయును బెంపునుం గలుగఁ జేసి విధాతృఁడు పేడిఁ జేసెనే?
234
శా. మత్కోదండచయంబులోన నొక సమ్మానార్హచాపంబు భా
స్వత్కాండంబులు హేమచంద్రక కనద్వర్మంబు నీ కెంతయున్‌
సత్కారంబున నిచ్చి వాహన పరిష్కారాంక సంభావ్య సం
పత్కల్యాణుని జేసి వైభవము దర్పంబున్‌ విజృంభింపఁగన్‌.
235
క. ఏము నిను మత్స్యరాజ | శ్రీ మహిమకు నెల్ల యుక్తుఁ జేయఁ దలంపం
గా మా మనోరథమునకు | నీ మాట విరుద్ధమయ్యె నిది యెట్లొక్కో!’
236
వ. అనిన విని యమ్మహీపతికి బృహన్నల యిట్లనియె. 237
ఉ. ‘ఆఁడుఁదనంబు నిక్కమున కారసి చూచిన లేదు; పుంస్త్వముం
బోఁడిమి దప్పియున్నది; నపుంసకజన్మ మవశ్యభోగ్యమై
వాఁడిమి గల్గు శాపమున వచ్చెఁ బురాకృతకర్మ భావ్య మె
వ్వాఁడును నేర్చునే! తొలఁగ వైవఁగ నోర్వక పోవవచ్చునే?
238
వ. కావున 239
తే. ఒండు పనులకు సెలవు లేకునికిఁ జేసి | యభ్యసించితి శైశవమాదిగాఁగ
దండలాసక విధమును గుండలియును | బ్రెక్కణంబు తెఱంగును బేరణంబు.
240
క. విశ్రుత వాద్యంబులు మం | జుశ్రుతి సంభావ్యగీత సుగతులు సద్భా
వాశ్రయములుఁ దజ్జన్యర | సాశ్రయములు నైన యభినయంబు లెఱుఁగుదున్‌.
241
తే. ఇన్ని తెఱఁగుల శ్రమము చేయింతుఁ జతుర | తా విహీనము లైన పాత్రముల నైన
నట్టువొజ్జనై మెలఁగుదు నగళులందు | నిపుణ నైపథ్య విధులకు నేర్తు నధిప!’
242
చ. అనుడు విషణ్ణమైన హృదయంబున గారవ మొంద నైపుణం
బున నుచితంబుమై నరసి పొచ్చెము లేమిఁ దదీయ సేవ గై
కొనుటకు నిశ్చయించి తన కూఁతు విరాటుఁడు పిల్వఁబుచ్చె న
ర్తనమునకై బృహన్నలకుఁ దత్పరతం దగ నప్పగింపఁగన్‌.
243
వ. ఇట్లు రావించిన. 244
సీ. అల్లఁదనంబున యనువు మైకొనఁ జూచు | నడపు కాంతికి వింతతొడవు గాఁగ;
వెడవెడ నూఁగారి వింతయై యేర్పడఁ | దేరని వళులలో నారు నిగుడ;
నిట్టలు ద్రోచుచు నెలవుల కల మేర | లెల్లను బిగి యెక్కి యేర్పడంగఁ,
దెలుపును గప్పును వెలయంగ మెఱుఁ గెక్కు | తారకంబులఁ గల్కితనము దొడరఁ
 
ఆ. జరణములును నడుముఁ జన్నులుఁ గన్నులు | జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు
చునికిఁ దెలుపుచుండ నుత్తర చనుదెంచె | నలరువిలుతు పువ్వుటమ్ము వోలె.
245
ఆ. వచ్చి కొలువు సొచ్చి, నెచ్చెలి పిండు నం | తంత నిలువఁబనిచి, యల్ల నల్లఁ
గదిసి, ప్రౌఢవనిత కైవడి ముద్దియ | ముద్దువుట్టఁ దనకు మ్రొక్కుటయును.
246
చ. తిగిచి కవుంగిలించి, జగతీవిభుఁ డక్కమలాయతాక్షి నె
మ్మొగము మొగంబునం గదియ మోపుఁ; గరాంగుళులం గపోల మిం
పుగఁ బుడుకుం; బొరింబొరి నపూర్వ విలోకన మాచరించుఁ; గ
ప్పగు మృదుమౌళి నుజ్జ్వల నఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్‌.
247
వ. ఇవ్విధంబునం దన గాదిలికూఁతు నుపలాలించి, బృహన్నల దెసం గనుంగొని, సాదర దరహసిత రుచిరాననుండై ‘యిమ్మగువ నీకు నాట గఱపందగు పాత్రం బగునే?’ యని యడిగి, తత్‌ప్రతివచనంబుల యందలి నాగరికత్వంబునకుఁ జిత్తంబు రంజిల్ల మధుర సల్లాపంబు సేసి, కర్పూర సహితం బగు తాంబూలంబు వెట్టి, చిత్రంబు లగు చీనాంబరంబులిచ్చి, మణిమయంబు లగు నాభరణంబు లొసంగి సంభావించి యవ్విభుండు. 248
ఆ. ‘నీవు చతురమతివి; నీకు నిక్కన్నియ | నప్పగింప నేల? యైన నాదు
హృదయమతులు దీనియెడఁ గడునార్ద్రమై | యుండుఁ గానఁ జెప్పకుండ రాదు.
249
క. నెచ్చెలులతోడ నెంతయు | మచ్చిగఁ దన యిచ్చ నాడ మరిగినయదియై
విచ్చలవిడి నింతకు ము | న్ని చ్చేడియ మెలఁగు; శిక్ష యెఱుఁగదు సుమ్మీ!
250
ఆ. బాల కేళిమీఁది భరము క్రమంబున | విడువఁ గళలయందు వేడ్క సొనిపి
నయముతోడ నర్తనంబుల శిక్షింపు | నెలఁత కేడుగడయు నీవ కాదె!’
251
చ. అని యుచితంబుగాఁ బలికి, యంగన హస్తముఁ బట్టి, తత్కరం
బునఁ గదియించి, ‘నీ గురువుఁ బొల్తి! తగం గొనియాడు; మెట్లు సె
ప్పె నటుల భక్తిమై నడపు; పెం పెసలారఁగఁ గూడు గూర చం
దన కుసుమాదులున్‌ నడపి తప్పక యారసి గౌరవింపుమీ!
252
ఆ. ఎల్ల చుట్టములును దల్లియుఁ దోడును | జెలియుఁ బరిజనంబుఁ జెలువ! నీకు
గురువ; యింక నొక్క కొఱఁతయు లే దిందుఁ | జేరి బ్రదుకు బుద్ధి గౌరవమున.
253
క. మన యింట నిచ్చ టచ్చో | టన కెచ్చట నైన నీ బృహన్నల మెలఁగం
జనియెడు మానిసి; తన మన | మున కిమ్మగునట్టి చరితమున వర్తించున్‌.’
254
వ. అని యిత్తెఱంగున నయ్యిరువుర నొండొరులకు నప్పగించి పుచ్చిన యనంతరంబ నకులుండు. 255
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )