| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ప్రథమాశ్వాసము |
| ఉ. |
అంబుజముల్ సముద్యదరుణాంశునిఁ గన్న విధంబునన్ వికా సంబున నుల్లసిల్లి జనచారువిలోచనముల్ నిజోజ్జ్వలాం గంబున కర్థిమై నభిముఖంబులుగాఁ జనుదెంచి దైవ యో గంబున భూవిభుండు తురగంబులఁ దేరఁగఁ బంచి చూడఁగన్. |
256 |
| వ. | ఆస్థానంబు సేరవచ్చి ఘోటకంబుల నుపలక్షించుచున్న నన్నరేంద్రుండు గనుంగొని పరిజనంబుల కతనిం జూపి. | 257 |
| క. |
‘ఇతఁ డెవ్వఁ డొక్కొ! రూపు ని | రతి శయమై మనమునకుఁ బ్రియం బొసఁగెడుఁ జూ చితిరే చిత్తంబు ను దా | త్తత గానఁగ నయ్యెడున్ వదనమున భంగిన్. |
258 |
| క. |
తురగంబులఁ జూచు విధం | బరయఁగ నితఁ డశ్వవిద్యయందు నిపుణతా స్ఫురణము గల వాఁ డగు బం | ధురమూర్తి పరాక్రమాన్వితుఁడు గానోపున్. |
259 |
| క. |
మీ రెఱిఁగినఁ జెపుఁ డీతని | పే; రెఱుఁగని యట్టులైనఁ బెంపారంగాఁ జేరం జని యల్లన యొకఁ | డారసి యెఱుఁగంగ వలయు నను సమయమునన్. |
260 |
| క. |
చేరఁ జనుదెంచి పాండవ | వీరుఁడు మత్స్యాధిపునకు వినతుండై ‘దే వా! రాజవాహనములగు | వారువముల నరయ నేర్తు వల నేర్పడఁగన్. |
261 |
| వ. | దామగ్రంథి యనువాఁడ, నాకు నశ్వవిషయం బయిన విచక్షణత్వం బెల్లనుం గల; దవధరింపు’ మని యిట్లనియె. | 262 |
| సీ. |
‘అవయవ లక్షణం, బాయుః ప్రమాణంబు, | గర్భంబు, లింగితాకారములును, మాత్రాంతరము, వయోమానంబు, దేశకా | లోచితాహార ప్రయోగభంగి, జాత్యనురూప శిక్షావిధి, క్రమగతి | వ్యాయామ సాత్మ్య ప్రవర్తనంబు, ప్రమద విషాదాది బహువిధ చిత్తధ | ర్మము, పోషణ ప్రకారము, చికిత్స |
|
| ఆ. |
పరిచితములు ధరణిపాల! నీ ముందట | రూపురేఖ మెఱయఁ జూపనేర్తు; బవర మైన నాకుఁ బని యేమి యనఁ, జేతి | బలిమి కలిమి నెఱపఁ దలఁపు గలదు.’ |
263 |
| వ. | అనిన విరాటుం డతని కిట్లనియె. | 264 |
| క. |
‘నీకుఁ దగు పదవి యిచ్చెదఁ | నా కలిమికి నెల్ల రక్షణం బొనరింపం గాక హయశిక్షకుఁడ వను | నా కొలఁదియె? యిట్లు పలుకు టనుచిత మరయన్.’ |
265 |
| ఆ. |
అనుడు నకులుఁ డిట్టులను ‘దేవ! తమ తమ | నేర్చు పనుల వెంట నెగడి బ్రదుక వలయుఁ గాక, నగరఁ దలము దప్పిన మెలం | కువల కొలువు లియ్యకొనుటఁ దగునె? |
266 |
| ఉ. |
ధర్మసుతుండు పెంచె ననుఁ దాన తురంగమ శాస్త్రశిక్షకుం గర్మఠుఁ జేసి యాత్మతురగంబుల కెల్లను నన్న యుక్తుఁగా నర్మిలి నిల్పి యీఁగియుఁ బ్రియంబును నాయెడ నాఁడు నాఁటికిం బేర్మి వహించుచుండ నడపెం దన తమ్ములలోని వానిఁగన్. |
267 |
| క. |
ఆ విభుఁడు రాజ్యసుఖ లీ | లా విముఖత వెడలి బంధులం దొఱఁగి యథే ష్టావాసత బ్రుంగుడు వడి | పోవుట నెచ్చోటఁ గడుపుఁ బ్రోతునొ యనుచున్. |
268 |
| క. |
తిరిగి తిరిగి లోకోత్తర | చరితుఁడు సుజనుండు మత్స్యజనవిభుఁడు యుధి ష్ఠిరునట్ల యనఁగ విని నినుఁ | గర మనురాగమునఁ గొలువఁగా నియ్యెడకున్. |
269 |
| క. |
చనుదెంచి కాంచి నా నే | ర్చిన తెఱఁగున విన్నపంబు సేసితి; నన్నుం బని గొనఁ దలఁచిన నేలెడి; | దనుమానము గలిగెనేని నరిగెద నధిపా!’ |
270 |
| వ. | అనవుడు. | 271 |
| ఉ. |
ఆ నరనాథుఁ డిట్లనియె; ‘నశ్వములం బరికించి యున్కి యిం పేని తురంగశాలలకు నెల్లను ముఖ్యుఁడవై తదీయ నా నా నియత ప్రకార కరణంబులఁ ద్రిమ్మరుచున్న వారి ము న్నే నెటు లట్ల నీ వరసి యిచ్చమెయిం బనిగొమ్ము నెమ్మితోన్.’ |
272 |
| క. |
అని చెప్పి యధిక సమ్మా | నన పూర్వము గాఁగ మత్స్యనరపతి మాద్రీ తనయుఁ దగ నిల్పె నాతఁడు | తనమదిఁ బ్రియమందె; నతని తమ్ముం డంతన్. |
273 |