| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
భావన శాంతత్వము నిజ | భావంబున నూష్మలతయుఁ బ్రకటంబులు గా నా విధుఁడు మనుజవేషుం | డై వచ్చెనొ? శిఖి శరీరి యయ్యెనొ? యనఁగన్. |
274 |
| క. |
తలుగుల పొది యొక దెసఁ బె | య్యల దామెన యొక్క వలన ననువై యుండన్ మొల మోపి పెక్కుచుట్లన్ | బలు ద్రాటం జుట్టి గోపభావం బలరన్. |
275 |
| చ. |
నునుసెలగొల చేకొని, మనోహర మౌ తన మేను రాజు చూ పును బ్రజచూడ్కులం దిగువఁ బుష్కరపత్ర నిభంబు లైన లో చనముల మూర్తి దెల్పఁగ ససంభ్రమతం జనుదెంచె నల్లన ల్లన వెడభీతి దోఁప జనులన్ వెగడయ్యెడు దృష్టిఁ జూచుచున్. |
276 |
| వ. | ఇట్లు వచ్చి మత్స్యమహీవల్లభు నంతంతం జేరి వినయావనతుం డగుచు నిట్లనియె. | 277 |
| క. |
‘నీ పసులఁ గావఁ బెట్టుము | భూపాలక! నన్ను; నేను బూని యరసినన్ గోపంక్తులు రుజవడ; వొరు | చేపడ వెన్నఁడును; డప్పిఁ జేడ్పడ వెచటన్. |
278 |
| తే. |
తొఱఁగు వోకుండ మెకములు గఱవకుండఁ | బాఁడి దఱుఁగకయుండ నాపాటి గొల్ల లిచ్చమెచ్చ, నీ దృష్టికి నెక్కఁ గదుపు | నరయ నేర్తు; న న్నేలుము ధరణినాథ!’ |
279 |
| వ. | అనిన విరాటుండు పాండవావరజున కిట్లనియె. | 280 |
| ఉ. |
‘ఎక్కడి మాట? గొల్లతన మించుకయేనియు లేదు నీ దెసం; జక్కని మేను నీ గఱువ చందముఁ గాంతియుఁ జూడవచ్చినన్ నిక్కువ మీవు సూర్య శశి నిర్మల వంశజులైన రాజులం దొక్క మహానుభావు తనయుండవు గావలయున్ నరోత్తమా!’ |
281 |
| ఆ. |
వలయు పదవియందు నిలిచి నా రాజ్యమం | తయును జక్కఁ బెట్టి నయము విక్ర మంబు నడపు నంత మానిసివై యుండి | కుచ్చితంపు బ్రదుకు గోరఁ దగునె? |
282 |
| వ. | ఉత్తమ వాహనంబులు, మహనీయాయుధంబులు నిచ్చెద; మత్స్యదేశంబున భవదభిమతస్థలం బొసంగెద; మదీయ మండల సేనా పరిపాలనంబు సేసి వర్తిల్లుము.’ | 283 |
| క. |
అనవుడుఁ బాండు నృపాలక | తనయుఁడు మ్రొక్కుచు విరాట ధరణీశున కి ట్లను ‘హీనకులుఁడ, బాలుఁడ | మును నాగరికంపుఁ గార్యముల వెర వెఱుఁగన్. |
284 |
| ఆ. |
పసులఁ గాచి కాని బ్రదుకఁ గౌరవుల ప్రాఁ | తలము మున్ను; నేను ధర్మపుత్త్రు పశుగణంబు నెల్లఁ బాలింతు నమ్మహీ | వరుని చిత్తమునకు వచ్చువాఁడ. |
285 |
| వ. | తంత్రీపాలుం డనం బరఁగిన వాఁడ; నా చేతం గ్రేపులు పురాణించుటం జేసి కొండొక కాలంబునన కదుపులం బెనుతు; నే నగునని కైకొనిన యాఁబోతు పంచితంబు మూర్కొనినను, బైగాలి వీచినను గొడ్డునకైనం జూలు నిలుచు; నుంగిడి యదురు ద్రిక్క యను వానికి నా పేరు సెప్పినం జాలు; మఱియును బసికి వలయు తెఱంగు లెల్ల నెఱుంగుదు; వేఱొక్క పనికిం గాను గాని యే నీ వెంట నీ మనసు వడయం జాలుదు; నా వలనం బ్రయోజనంబు గొనవలయు నేని నొండుమాటలు దక్కి పసులం బరికింప నియోగింపుము.’ | 286 |
| చ. |
అనుటయు నెట్టకేలకు ధరాధిపుఁ డట్టుల కాక యంచు నా తని వదనంబు సూచి ‘యుచితం బగునేనిఁ బ్రియంబ యేని, నె ట్లును గురుకార్య వర్తనములున్ రుచియింపక యుండునేని, గో ధనముల కెల్ల రక్షణముఁ దత్పరతం దగఁ జేయు ముఖ్యతన్. |
287 |
| క. |
మున్ను గల గోపవర్గము | నిన్నుం గని కొలిచి భక్తి నీ పనిసేయన్ మన్నన మానిసివై నీ | వున్నం గడు మేల కాక యొప్పమి గలదే?’ |
288 |
| వ. | అని పలికి యతని యభిమతంబు సలిపి నిలిపె; నట్లయ్యేవురును విరటుం గొలిచి నిలిచిరి; తదనంతరంబ. | 289 |