ఇతిహాసములు భారతము విరాటపర్వము - ప్రథమాశ్వాసము
ద్రౌపది సైరంధ్రీవేషమున సుదేష్ణఁ గొలువ వచ్చుట (సం. 4-8-1)
క. గారవమున నిజదేశా | చారముమై నల్లియున్న జడ యగు కబరీ
భారంబు విచ్చి తుఱుముగ | సైరంధ్రీ జాతివేష సముచిత భంగిన్‌.
290
క. వలపలి దిక్కున కించుక | మలఁగంగాఁ దుఱు మిడి, కుఱుమాపుడుఁ బుట్టం
బలవడఁ గట్టి జరఠవ | ల్కలమున నెవ్వీఁగుఁజన్నుఁగవ గప్పి తగన్‌.
291
క. పరిచారికాత్వరేఖా | పరిణతి దనమేన నచ్చువడ భావనకుం
దిరమై తలకొను నంతః | కరణముతోఁ బురము ద్రుపదకన్యక చొచ్చెన్‌.
292
వ. ఇట్లు సొత్తెంచి. 293
సీ. పఱమొయిల్‌ గప్పినఁ బాడఱి నునుఁగాంతి | గదలిన యమృతాంశు కలయుఁ బోలెఁ
బెనుమంచు మీఁదఁ బర్విన వికాసము దప్పి | చెలువు గుందిన సరోజిని విధమున,
ధూమంబు వొదివిన దుఱఁగలి మెఱుఁగులు | నలఁగి మాసిన దీప కళిక పగిది,
ధూళి పైఁబొరసినఁ దొంగలించుట మాని | లావణ్య మెడలిన లతిక భంగి,
 
తే. గంధకారికా వేషంబు కతన మూర్తి | యుజ్జ్వలత్వంబు మఱువడియుండఁ బాండు
తనయ మహిషి యంచితగతిఁ జనఁగ రాజ | వీథిఁ బౌరజనంబు లవ్వెలఁదిఁ జూచి.
294
ఉ. ‘రోహిణి యొండె, నొండెను నరుంధతి గాక మనుష్య జాతియే?
యీ హరిణాక్షి చెల్వమున యేడ్తెఱ చూడ్కుల నాఁచికోల కా
దాహితగౌరవం బగు; శుభాంగము తేజముఁ జూడ బుద్ధి సం
దేహముఁ బొందుచున్నది; సతీజను లిట్టిరె యెజ్జగంబులన్‌!’
295
వ. అనుచు నంతంతం జేరి. 296
క. ‘నీ వెవ్వ, రేమి పనికై | యే వలనికిఁ బోవుచునికి యిది?’ నావుడు న
ద్దేవియు సౌముఖ్యము స | ద్భావంబును దోఁప నుచితభంగిం జెప్పెన్‌.
297
ఆ. ‘ఏను గట్టువాలుదాన; నా కెవ్వరు | కడుపు కూడు వెట్టి, కట్టఁ జీర
యిచ్చి సాకతమున నేలుదు రట్టి వా | రలకుఁ బనులు సేసి మెలఁగు బుద్ధి.
298
క. వచ్చితి’ ననవుడు విని జను | లచ్చెరువును సందియంబు నడరెడు మదితో
‘నిచ్చెలువ గడుపు కూటికి | నెచ్చటనే నిలుచునట్టె! యిది పలుకగునే?’
299
వ. అనుచుం గనుంగొనుచు ముసురుకొని చనుచుండం బాంచాల రాజనందన రాజమందిరంబు చక్కటికి నరుగు నవసరంబున. 300
క. ముదమొదవ రమ్యహర్మ్యము | తుది నిలువునఁ బ్రణయసఖులతోడ విహారా
స్పదమగు నెలవున మెలఁగెడు | సుదేష్ణ తజ్జాలకములఁ జూచెం బ్రీతిన్‌.
301
వ. ఇత్తెఱంగున మత్స్యరాజమహిషి ద్రౌపది నాలోకించి కుతూహలంబున. 302
ఉ. ‘ఎక్కడనుండి యెక్కడకు నేఁగెడినో యిది యొక్క కాంత రూ
పెక్కుడు; పెంపు సొంపు మన కేర్పడుచున్నది: దా వినీతయై
స్రుక్కుచు నీచభామినుల చొప్పునఁ బల్కెడుఁ బౌరులుం గడున్‌
వెక్కసమంది చూచెదరు; వేగమ తోడ్కొని రండు నెమ్మితోన్‌.’
303
క. అని పలికి పనుపఁ బ్రౌఢాం | గన లిరువురు వోయి ద్రుపదకన్యకతో ని
ట్లనిరి; ‘విరాటుమహిషి నినుఁ | దనపాలికిఁ బిలువఁ బంపె దయ పెంపెసఁగన్‌.’
304
వ. అనవుడు. 305
క. తన తలసీర యరసి య | వ్వనితారత్నంబు వినయవైభవము సతీ
తను వొందిన చందంబునఁ | జనియెం గేకయసుతానుచారికలబడిన్‌.
306
వ. ఇవ్విధంబునం జని సౌధంబు నుపరిభాగం బెక్కి . 307
సీ. పదతలంబుల కెంపు పరఁగిన తలము కుం | కుమలిప్త మైన చందము వహింప,
నంగంబు నునుఁగాంతి యడరిన గోడలు | వేదులు మణిమయ విధము నొందఁ,
గనుఁగవ మెఱుఁగులు గదిరిన ముందఱఁ | బుష్పోపహారంబు పొలుపుఁ దాల్ప,
వేనలికప్పు పర్విన మీఁదు నీల దు | కూలంబు మేల్కట్టు కొమరు వడయఁ,
 
తే. దాను జొచ్చిన కతన మత్స్యక్షితీశు | నింట నిమ్మెయిఁ గ్రొత్తయొ ప్పెసక మెసఁగ
న మ్మహాదేవి యున్నెడ కల్లనల్లఁ | బాండురాజతనూభవపత్ని యరిగె.
308
వ. కేకయరాజనందనయును. 309
చ. కనుఁగొని గారవంబును మొగంబునఁ గేలఁ బురఃప్రసారముం
దనువున నమ్రభావమును దంతమరీచుల సామి నిర్గమం
బును దనలోఁ గడల్కొనఁగ భూరితరాదరరేఖ, “నిందు ర.”
మ్మనవుడు నంత నంత ద్రుపదాత్మజ సేరి వినీతి నిల్చినన్‌.
310
క. ఆపాదమస్తకము త | ద్రూపము వీక్షించుచుం గుతూహల మడరన్‌
భూపాల మహిషి యిట్లను | నా పొలఁతుకతోడ నుచితమయ్యెడి భంగిన్‌.
311
ఆ. ‘ఏది కులము? నామ మెయ్యది? యెవ్వరి | దాన? వేమి పనికిఁ బూని యిప్పు
డెచటు బుద్ధిఁదలఁచి యేఁగెద? వింతయు | నెఱుఁగఁ జెప్పుమాకు మెఱుఁగుఁబోఁడి!’
312
వ. అనిన విని యాజ్ఞసేని యిట్లను; ‘నేను సైరంధ్రీజాతి సంభూత; నభిధానంబు మాలిని; పురుషపంచక సనాథనై యుండుదు; నొక్కకారణంబున నుద్ధతులగు విరోధులచేతం బతుల సన్నిధిం దలవట్టి యీడ్వంబడి, వనంబున కరిగి, వ్రతంబుమై వల్లభసహితంబుగా వన్యాహారంబులం గాలంబు గడపుచు బ్రహ్మచర్యంబు నడపితి; నిటమీఁద నియమాచరణంబునకు నొక్క సంవత్సరంబు గొఱంత కలదు. నీవు ధర్మవర్తిని వని వినుటం జేసి నానేర్చు పనులవెంట నీకడ నిలువం దలంచి యిందు వచ్చితి’ ననవుడు సుదేష్ణ యిట్లనియె. 313
క. ‘సుర గరుడ ఖచర విద్యా | ధర కిన్నర యక్ష సిద్ధ తరుణులలో నీ
వరయఁగ నొక్కత వగు ది | ప్పురికిం జనుదేరఁ గతము బొంకక చెపుమా!’
314
క. అనుటయు దరహసితము మో | మునకుఁ దొడవుగాఁగఁ బలుకు ముద్దియ ‘యేఁ గృ
ష్ణునిదేవి సత్యభామకుఁ | బనిసేయుదుఁ దొల్లి, పిదపఁ బాంచాలికడన్‌.
315
తే. తగవుమైఁ బరిచారికా ధర్మములకు | నెల్లఁ జాలి వర్తించితిఁ; దల్లి! వినుము
నాకుఁ బ్రాణంబు ప్రాణమై నన్నుఁ దన్న | కాఁగ భావించి యాదేవి గారవించు.
316
వ. నీవును. 317
క. నీచము లయ్యెడు పనులకు | నా చాలమి యెఱిఁగి మన్ననకుఁ బాత్రముగా
నీ చిత్తంబునఁ గైకొని | యాచారము తప్పకుండ నరయుము నన్నున్‌’.
318
వ. అని యిట్లు దేవజాతి యను సందియంబు వాయం బలికి మఱియును. 319
క. ‘కలపములు గూర్ప బహువిధ | తిలకంబులు వెట్ట వింత తెరువునఁ బలు పు
వ్వులు గట్టి కట్టి ముద్దుగఁ | దల ముడువఁగ సరులు గ్రువ్వఁ దద్దయు నేర్తున్‌.’
320
మ. అనినం గేకయరాజనందన ప్రభూతాశ్చర్యయై యిట్లనున్‌
‘విను! నీ రూపము చూచి మా నృపతి యువ్విళ్లూరు; నే నెమ్మెయిం
బనిగొందుం? దగ నింతులుం దగిలి నీపైఁ జూడ్కి నెక్కొల్పి నె
మ్మనముల్‌ విస్మయమందఁ జూచెదరు భామా! పల్కు లింకేటికిన్‌?
321
క. దుర్భర యగు నినుఁ గర్కటి | గర్భము ధరియించునట్లు గైకొని నాకై
నిర్భర విధ్వంసదశా | విర్భావము దెచ్చుకొనుట వెరవై యున్నే?’
322
ఆ. అనిన ‘నీ తలంచినట్ల కా; దేర్పడ | వినుము! నాదు పతులు వెరవు లావు
నలఘు విక్రమంబుఁ గలుగు గంధర్వు; లే | మఱరు నన్ను నొక్క మాత్ర యైన.
323
క. నీచమతి నన్ను నెవ్వఁడు | సూచిన నా రాత్రిలోనఁ జూతురు దెగఁ దా
రా చపలు హరిహరాదులు | గాచిన బలవిక్రమము లఖర్వములైనన్‌.
324
క. బంధుశతంబులు శౌర్యమ | దాంధములై శక్తి సంపదాభీలములై
సింధురసదృశత నున్నను | సంధుల సంధు లెడలించి చంపుదు రతనిన్‌.
325
వ. కావునఁ బురుషులు నాకడం దేఱి చూడను వెఱతు; రదియునుంగాక. 326
క. నా చిత్తము తాదృశులకు | గోచరమే? యస్మదీయ కులజన సంశి
క్షాచార మహిమ యట్టిది | యే? చెప్పకు తద్విధాతిహీన వచనముల్‌.
327
చ. మనమున నూఱడిల్లు; మనుమానము మానుము; నన్ను నేలు; మే
పనులు నుదాత్త నాగరిక భంగుల నీమది కెక్కు నట్లు నే
ర్పును భయభక్తులున్‌ మెఱయ రూపుగఁ జేసెదఁ; దద్‌జ్ఞులైన స
జ్జనులు నుతింప వర్తనము సాధులు వృద్ధులు మెచ్చఁ జల్పెదన్‌.
328
క. ననుఁ గుచ్చితంపుఁ బనులకుఁ | బనుపక, యెంగిలికి లోనుపఱుపక తగు మ
న్ననతోడ నరయు వారల | కనురాగము నెఱపి నడతు రస్మత్పతులున్‌.’
329
ఆ. అనిన సంతసిల్లి యద్దేవి సైరంధ్రి | నూఱడిల్లఁ బలికి యునిచికొనియె;
నంతిపురము చరిత కలవడ మెలఁగుచు | నుండె న వ్వధూటియును ముదమున.
330
క. ఇవ్విధమున నయ్యేవురు | నవ్వెలఁదియు సకల జనుల కజ్ఞాతముగా
న వ్విరటు ప్రోలఁ బ్రమదము | నివ్వటిల వసించి రుచిత నిభృతత్వమునన్‌.
331
వ. అనిన విని ‘వారల వర్తనం బటమీఁదఁ జెల్లిన తెఱం గెఱింగింపు’ మని యడిగిన. 332
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )