ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
క. శ్రీమదపాంగాలోకన | ధామసకృత్సంగ రూఢ తాదృశ విభవో
ద్దామాశ్రితలోకా! లో | కామయ నిర్హరణ నిపుణ! హరిహరనాథా!’
1
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె; నట్టియెడ ధర్మసూనుండు సభాజనంబుల యుల్లంబులు రంజిల్ల రాజునకు వినోదంబులు వివిధోదాత్త ప్రకారంబులఁ జలుపుచు, నొక్కొక్కమాటు మధుర ప్రసంగంబుగా నాడిన నెత్తంబున గెలిచిన విత్తంబులు తమ్ముల కొసంగుచుండు; వాయునందనుండు వంటకు మిగిలిన మాంసంబు లమ్మునెపంబున నిచ్చలు సహోదరులకు నిచ్చుచుండు; వివ్వచ్చుండు సంగీత ప్రసంగంబున మెచ్చువడసిన కనకాంబరాదులు సోదరులకుం జేర్చుచుండు; నకులుండు దురంగంబుల గ్రాసంబులం గనిన ధనంబులు తోడంబుట్టువులకుఁ బెట్టుచుండు; సహదేవుండు గోవులం జూచి భూవల్లభుండు సంతసిల్లిన సమయంబున సముపార్జితంబు లగు పదార్థంబులన్నియు నన్నలవశంబు సేయుచు వారలకు గోరసంబులం దుష్టి సలుపుచుండు; ద్రౌపది త న్నరసికొని తిరుగుచున్న వీరలం గన్నులారం జూచుచు నుచితంపు నడవడి మెలంగుచుండు. 2
తే. ఇట్లు దమతమ వర్తిల్లు నెడల సకల | జనములకు హృదయానురంజన మొనర్చి
తాల్మి, పుయిలోట, యడఁకువ, తగవు మెలపు | నెఱితెఱంగు, వాటింపంగ నేర్పు గలిగి.
3
క. ఉన్నతఱి వివిధదేశో | త్పన్నులు నద్భుతవిధాయి బలవిక్రమ సం
పన్నులు నగుమల్లులు విభ | వోన్నతుఁడగు విరటుపాల నుద్భటవృత్తిన్‌
4
క. తమలోన మాటలాడెడు | సమయంబున నొక్క రుఁడు విశాలోరస్కుం
డమితబలుఁడు, పంచానన | సమమూర్తిస్ఫూర్తి యధిక సంరంభమునన్‌.
5
వ. అన్నరపతి కట్టెదుర నిల్చి మ్రొక్కి భుజాస్ఫాలనంబు సేసి యిట్లనియె. 6
తే. ‘నేల నాలుగు సెఱఁగుల నృపుల కొలువు | లందు నేను వర్తించితి నవనినాథ!
యగ్గలించి, నా యెదుర బాహప్పళించి | కడఁగఁజాలెడు మల్లులఁ గాన నెందు.’
7
చ. అనునెడ వాని యుగ్రసమదాకృతియుం, బటువాక్యవృత్తియుం,
గని, విని, మల్లులెల్ల భయకంపితమూర్తులు దాల్చి మాఱువ
ల్కను, గనువిచ్చి చూడను, మొగం బెగయింపను జాలకున్న న
జ్జనపతి వేడ్క మ్రోడుపడు చందము గాంచి యుధిష్ఠిరుం డనున్‌.
8
క. ‘వీనికి మార్కొనఁజాలెడు | దానికిఁ దగువాని ధర్మతనయుని పురిలో
నానానియుద్ధలంపటు | నే నొక్కనిఁ గంటి నిపుణుఁ డిందుల కతఁడున్‌.
9
క. మన బానసీఁడు వలలుం | డను శూద్రుఁడు నాకుఁ దెల్ల; మధిక బలుల నో
ర్చినవాఁ డనేక మల్లుల | నిను మెచ్చింపంగఁ జాలు; నిజ మిది యధిపా!
10
క. అనవుడు భూపతి పిలువం | బనిచె; నతని నతఁడు నపుడ భయభక్తులతోఁ
జనుదెంచి, మల్లవర్గముఁ | గని మై వెఱుగంగ నిలిచెఁ గౌతూహలియై.
11
వ. ఇట్లు నిలిచిన పవనతనయు నవలోకించి, యవనీవల్లభుం డమ్మల్లముఖ్యుం జూపి, ‘యితనితోడి యుద్ధంబునకు సన్నద్ధుండవు గ’ మ్మనిన నతండును ధర్మతనయు కనుసన్న గనుంగొని యమ్మత్స్యవిభునకు వినయంబుతో నిట్లనియె. 12
తే. ‘అధిప! ధర్మజుపాల నున్నప్పు డతని | వేడుకకుఁ దగఁ బెనఁగుదు వింతలైన
జెట్టిమల్లులతో, నిప్పు డట్టువోలె | నీదు వేడ్కకుఁ బెనఁగెద నేర్చినట్లు.’
13
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )