ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
భీముఁడు మల్లునితో యుద్ధము చేయుట (సం. 4-12-17)
వ. అని మెత్తన యియ్యకొని, గర్జించి, గజాలస్యంబునం బ్రాంగణంబు సొచ్చి, భూపాలుని ముందట భుజాస్ఫాలనంబు సేసి, మ్రొక్కి మరలునెడ, నంతకుమున్న యమ్మల్లవరుండు నరపతి యనుమతి వడసి, కృతపరికర బంధుండై యరుగుదెంచి యచ్చట నునికింజేసి యతండును ననిలసుతుండునుం బరస్పర మూర్తుల నవలోకించి యుద్ధరంగంబు మన్ను ఫాలప్రదేశంబున ధరియించి శరీరంబులపైఁ జల్లుకొని రెండు సేతుల మునివ్రేళ్ళను గొండొక పుచ్చికొని యొండొరుల దెసకు వైచి, యున్నతంబులగు నపసవ్య కరంబుల నాకుంచిత సవ్య బాహు తలంబుల నప్పళించు చప్పుళ్ళు గలసి యొక్కరుండ మల్లసఱచిన చందంబున వీతేర వింతతానకంబుల నిలిచి కదిసిన యప్పుడు వృకోదరుండు. 14
సీ. ఉపతాయిలోఁ దన కొదవిన తోరహ | త్తము సూపి వ్రేయక సమదవృత్తిఁ
బాసి క్రమ్మఱఁ జేరు; బలువిడి వాఁడు పై | నదరిన జరగక యవనిఁ గ్రుంగి
నిలుచు; నొత్తొరువున వలచినయప్పుడు | గొనిపోవు; నవలీలఁ గూలవైచు;
జళికి పట్టిస మను సన్నపు విన్నాణ | ములు దొరకొన్నను ముట్టఁగొనఁడు;
 
తే. కాలిదెసఁ జొరవచ్చుట గానిపించి | యుడుగు; సీసానఁ బట్టియు నుప్పళించుఁ;
బోవనిచ్చు; మగుడ నేచి పోరఁజేరు | నెడల సరిసేయ నగు తడవీక హత్తు.
15
వ. మఱియు ననేకగతుల యోజలు మెఱయుచుఁ గొండొకసేపు విరాటునకు వినోదంబు సలిపి. 16
ఆ. కచ్చ యమరఁ బట్టి కాళ్ళును జేతులు | వ్రేల మత్తగజములీల మెఱయ
ముష్టి బలువు నెఱయ ముక్కున వాతను | నెత్తురొలుక మల్లు నెత్తివైచె.
17
వ. ఇవ్విధంబున విసరి నేలతో వ్రేసి వీఁపున మండివెట్టిన. 18
క. పెలుకుఱి తాళం బీ మదిఁ | దలఁచి యనువుగాక ధరణితలము గరతలం
బుల నప్పళించె వాఁ డ | క్కొలు వార్వఁగ విఱిచి మెఱసెఁ గుంతీసుతుఁడున్‌.
19
వ. ఇవ్విధంబున మహాబలుపట్టి యాజెట్టి నెట్టన గెల్చిన మత్స్యపతి మెచ్చి తన కిచ్చిన ధనంబు లచ్చటి (యర్థి) జనంబుల కిచ్చి నిజ నివాసంబునకుం జనియె; మఱియు నిత్తెఱంగున నతనికి వేడ్కసలుపుచుండుఁ; జిక్కని మల్లులులేని తఱి నంతిపురంబు నింతులు సూడ నయ్యవనీ కాంతుండు పోరింప శార్దూల శుండాలాదులతోడ నీడంబోక పెనంగి భంగంబునకుం దెచ్చి మెచ్చించుచుండు. 20
క. పెఱవారలు తమమెలఁగెడు | తెఱఁగులు దొరఁకొన్న వింత తెరువుల నేర్పుల్‌
మెఱయుచుఁ బతిచిత్తము గొన | నొఱపు గలిగి మాన్యవృత్తి నుండుదురు దగన్‌.
21
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )