ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
కీచకుఁడు పాంచాలిం జూచి మోహించుట (సం. 4-13-1)
వ. ఇట్లు పాండవులు పాంచాలీ సహితంబుగా విరాటు నగరంబున వర్తించుచుఁ గతిపయదినంబులు గొఱంతగా నేఁడుకాలంబు గడపిన సమయంబున మత్స్యపతి మఱందియు, దండనాథుండును, గీచకాగ్రజుండును, రూపాభిమానియు, నానాభరణ ధరణశీలుండును. దుర్విదగ్ధుండును. బలగర్వితుండును నగు సింహబలుండు దనయప్ప సుదేష్ణకు మ్రొక్కంజనువాఁ డద్దేవి కనతిదూరంబున నున్న ద్రుపదరాజనందనం గనుంగొని. 22
ఉ. అక్కజమైన చెల్వమున నాత్మకు వ్రేఁగయి పొల్చు పొల్తిపై
నెక్కొను చూడ్కిఁ గ్రమ్మఱుప నేరక యూరక నిల్చెఁ గాముచేఁ
జిక్కిన నెమ్మనంబుఁ గడుఁ జేడ్పడు మానముఁ జేష్టితంబులం
దక్కిన యంగముం దలఁకు ధైర్యమునై యతఁ డప్పు డయ్యెడన్‌.
23
తే. ద్రౌపదీ రూప మను నురిఁ దగిలి తనదు | హృదయ మను మృగ మత్తఱి నుదిలగొనుచుఁ
గాముఁడను బల్లిదపు వేఁటకాని బారిఁ | బడుట కెంతయు నా సింహబలుఁడు తలరి.
24
వ. నిజాంతర్గతంబున. 25
ఉ. ‘ఎందును నిట్టిరూపు నరు లెవ్వరుఁ గాంచిరె? నాక కాదు సం
క్రందనసూతికిం దగిలి కన్గొనఁ జాలదె! దీన నిందిరా
నందను నాజ్ఞ యేచి భువనంబులఁ బ్రబ్బదె? యిత్తలోదరిం
జెందఁగఁ గాన్పుగాదె ఫలసిద్ధి పురాతన పుణ్యవృద్ధికిన్‌!
26
సీ. ఇయ్యింతి ప్రాపున నయ్యనంగుఁడు పార్వ | తీశునైనను దక్కనేలకున్నె!
యిన్నాతి చెలువంబు గన్న శచీ ప్రియుం | డైనను గనుకలి నవియకున్నె!
యిత్తన్వి కెనలేమి కెదిరి పన్నిదము భా | షావిభుతోనైనఁ జఱవరాదె!
యిత్తలోదరి జీవితేశున కిందిరా | పతినైన మెచ్చక పలుకఁజనదె!.
 
తే. కుసుమబాణుని బాణముల్‌ గూడ నైదు | కరఁగి నేరిమి వాటించి కరువు గట్టి
పోసి చేసి చైతన్యసంపుటము దగ ఘ | టించెనో కాక యిట్టి చేడియలు గలరె!
27
క. ఈ నెలఁతఁ గన్న మన్మథుఁ | డైనఁ జిగురు గొడుగుఁ పువ్వుటమ్ములపొదులున్‌
లోనుగ సెజ్జలు సేయం | దా నియమింపండె? విరహతాపము పేర్మిన్‌.’
28
వ. అని వెండియు. 29
సీ. దీని జన్మంబునఁ దేజంబునొందిన | యింతియుఁ బతియును నెవ్వరొక్కొ!
దీని నామాకృతిగా నోఁచి పడసిన | యింపగు వర్ణంబు లెవ్వియొక్కొ!
దీని వల్లభుఁ డనఁగా నిల సొబగు సొం | పెసఁగ వర్తిల్లు వాఁ డెవ్వఁడొక్కొ!
దీని వసించుటఁ దా నొప్పి పెంపున | నేపారు మందిరం బెద్దియొక్కొ!
 
ఆ. దీనిఁ బొందఁగాంచు తెఱఁగు నా కెయ్యది | యొక్కొ! యిట్టిపనికి నూఱడిల్లి
తోడుకొనఁగ నిచట నీడగు చుట్టంబుఁ | దడవి యెట్టులొక్కొ పడయువాఁడ!’
30
చ. అని యని యుగ్గడించు, ధృతి యల్లల నాడినఁ దల్లడించుఁ బై
కొను తలపోఁత నించు, మదిఁ గోర్కులు పేర్చిన నప్పళించు, నె
ట్టన తెగ నగ్గలించు, నచటన్‌ జనులం బరికించు, బుద్ధి దూ
లిన వెస నెంతయుం గళవళించు మనోజవికారమగ్నుఁడై.
31
క. మాసిన చందముఁ దనుఁ గని | రోసిన డెందంబుఁ గల తరుణి నెఱుఁగఁడ బి
ట్టేసిన మదనునిచే ధృతి | వాసిన బెగడొందు సింహబలుఁ డట్టియెడన్‌.
32
సీ. వెఱవక ననుఁ జూచె వీఁడని యెదఁ గలు | షించిన నొండొండ చెమట వొడమ,
ననుచితకృత్యంబు లాచరించు విధాతృ | బలిమికి నివ్వెఱపాటు దోఁప,
నిచ్చట దిక్కులే రెవ్వరు నా కను | భయమున మేనఁ గంపంబు పుట్టఁ,
జేయంగ నేమి యుపాయంబు లేమి నా | ననమున వెల్లఁదనంబు గదుర
 
తే. నున్న పాంచాలిఁ గనుఁగొని యన్నరాధ | ముఁడు వివేక విహీనుఁడై ముదితుఁ డగుచు
మదనవికృతియకాఁ దన మదిఁ దలంచి | రాగసాగరపూర నిర్మగ్నుఁ డయ్యె.
33
వ. అయ్యవసరంబున. 34
చ. పొలఁతుక కాంతి యింత పొలివోవఁగనీ కెసలారఁ దార ని
శ్చలతఁ గడంగి క్రోలికొనఁజాలుటఁ గీచకముఖ్యు లోచనం
బులు ‘నయనం ప్రధాన’ మను పూర్వవచస్‌స్థితి తప్పకుండఁగా
నెలమి వహించెఁ దక్కుఁ గల యింద్రియ వర్గము ధిక్కరించుచున్‌.
35
క. అప్పయుఁ బరిజనములుఁ దనుఁ | దప్పక కనుఁగొనుచునుండఁ దగవేది కరం
బొప్పని తమకము చిత్తముఁ | గప్పికొనుట నుత్తలంబు గదురఁగ నచ్చోన్‌.
36
సీ. తన్వంగి మవ్వంపుఁ దనులత నెసఁగెడు | నునుఁగాంతి వెల్లువ మునుఁగఁబాఱఁ,
గిసలయహస్త కెంగేల నేపారు క్రొ | మ్మిం చను లేయెండ మిగులఁ బర్వఁ,
గమలాస్య ముద్దు మొగంబు లేమెఱుఁగుల | మొత్తంబు పరి చుట్టు ముట్టికొనఁగ,
ధవళాక్షి తొంగలి తఱచు ఱెప్పల చెన్ను | కప్పను చీఁకటి గవియుదేర,
 
తే. బెగ్గలం బంత కంతకు నగ్గలింప | నొదవు చెమటతోఁ జిత్తంబు చెదరి యెందు
మెలఁగఁ దలఁపేది యా సింహబలుఁ డనంగు | పట్టి యాడెడు జంత్రంబు పగిది నుండె.
37
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )