ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
కీచకుఁడు సుదేష్ణవలన ద్రౌపదితెఱం గెఱుంగఁ గోరుట (సం. 4-13-5)
వ. ఇట్లు కందర్పదర్ప గోచరుండైన కీచకుండు నిజసహోదరివలన నక్కోమలి కలరూపు తెలియందలంచి దాని దెసం దగిలిన దృష్టి యెట్టకేలకుం దిగిచికొని చని యద్దేవికిం బ్రణమిల్లిన. 38
క. కాంచన పీఠము వెట్టఁగఁ | బంచి ప్రియము చూడ్కి ముసుఁగువడఁ దను సంభా
వించునెడ నాతఁ డప్పకుఁ | బాంచాలిం జూపి వేగపడి యిట్లనియెన్‌.
39
ఉ. ‘ఇయ్యరవిందగంధి కుల మేమి? చరిత్రము చంద మెట్లు? పే
రెయ్యది? నాథుఁ డెవ్వఁ? డిది యెచ్చట నెప్పుడు నుండు? నిపు దా
నియ్యెడ కేఁగుదేవలయు టేపని సేయఁగఁ బూని? దీనిపై
నెయ్యము కల్మి యేకొలఁది నీ మది? కింతయు నాకుఁ జెప్పుమా!’
40
క. అనవుడు నయ్యంగన ‘యితఁ | డనంగశర దళిత హృదయుఁ డయ్యె నకట! యీ
తని చిత్తవృత్తి మరలుప | ననురూపం బగు నుపాయ మది యెయ్యదియో?’
41
వ. అని తలంచుచుఁ గీచకుని మాటలు గీటునంబుచ్చి యొండు పలుకులు జరిపిన, నతండును సత్త్వహీనుండు
గావున సత్వరుండై క్రమ్మఱి, ద్రౌపది యున్న యెడకుం జని, యా సమీపంబున నఱ్ఱాడుచు నమ్మానవతితో నిట్లనియె.
42
క. ‘ఇవ్వసుమతి నే పొలఁతుల | కివ్విధమునఁ జెలువు గలదె యెన్నండును? నీ
వెవ్వరి తనయవు? నీ పతి | యెవ్వఁడు? పే రేమి? సెప్పు మిందునిభాస్యా!’
43
వ. అనిన నప్పలుకులు వినియు వినమి భావించి యప్పాంచాలి నిర్వికారయై యూరకున్న నచ్చపలుండు వెండియు నిట్లనియె. 44
సీ. ‘తెలి గన్నుఁగవ కాంతి పొలుపార నించుక | కను విచ్చి చూచినఁ గాదె యబల!
చెలువంపు నెమ్మోము నెలమి సొం పినుమడి | గా నల్ల నవ్వినఁ గాదె యింతి!.
దంతమౌక్తికరుచి దలకొన మఱుమాట | వలికినఁ గాదె యుత్పలదళాక్షి!
యుల్లంబు సరసత దెల్లంబుగా లీలఁ | గైకొన్నఁగాదె పంకరుహవదన!’
 
ఆ. యనుచుఁ జూచుఁ, జేరుఁ, నమ్ముగ్ధ పలుకులు | వినఁగఁ గోరుఁ, గేలు తనదు కేలఁ
గీలుకొలుపఁ దలఁచుఁ గీచకాధముఁడు ని | జానురక్తిఁ దెలుప నప్పళించు.
45
వ. ఇట్లు దాన తమకంబున వడిగొనుచు, నప్పు డయ్యంగన యింగితం బూహింప వెరవుమాలి మఱియును. 46
సీ. ‘సుదతి! నీమై చక్కఁ జూచుట కోడెదఁ | గనుఁ బాటు వొరయునో యని తలంచి;
మదిఁ బొనర్చిన మాట మగువ! నీ పెంపునఁ | గుదిసి నా నాలుక తుదికి రాదు ;
పడఁతి! నీ కరములు పట్టంగఁ దివిరి శం | కించి వడంకెడుఁ గేలు సూడు;
నెఱి నిట్టి దని యింతి! నీ నెమ్మనం బెన్ని | భంగుల నరసినఁ బట్టు వడదు ;
 
తే. చెలువ! యింక నొక్కించుక సేపు నీ వ | నాదరంబున నెప్పటియట్ల యున్న
మన్మథుఁడు సమయించిన మగుడ నన్నుఁ | బడయవచ్చునె యెన్ని యుపాయములను?’
47
వ. అని తన యభిలాషంబు తేటపడం బలికిన నబ్బోటి కలుషించియు, దుర్వారం బైన పరిభవ వికారంబు దోఁపకుండ తన్నుందాన యుపశమించుకొని ‘వీడు దురభిమానియై యున్నవాఁడు, వేగిరపడుట వెరవుగాదు. వెరవు తోడన తప్పించుకొనవలయు’ నని తలంచి యతని కిట్లనియె. 48
క. ‘నాయున్నబాముఁ దలఁపవ; | యీ యొడ లీ చీర యిట్టి యేవపుఁజందం
బో యన్న! మదన వికృతిం | జేయు ననుట యెంతయును నిషిద్ధము గాదే!
49
తే. చనునె యిమ్మాటలాడ సజ్జనుల కాఁడుఁ | బుట్టువులతోడ నీవును బుట్టినాఁడ;
వట్లుగాకయు హీనవంశాభిజాత | నై పతివ్రతనగు నన్ను నడుగఁ దగునె?’
50
క. అని వీడఁగఁ బల్కిన న | మ్మనుజాధముఁ డంతఁ బోక మదనోన్మాదం
బునఁ దన్ను నెదిరి నెఱుఁగక | వనితకు నిట్లనియె గారవంపుఁ బలుకులన్‌.
51
సీ. ‘నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి | యచ్చునఁ బెట్టిన ట్లంద మొంది,
చక్రవాకంబుల చందంబు గొనివచ్చి | కుప్పలు సేసిన ట్లొప్పు మెఱసి,
చందురు నునుఁగాంతి కం దేర్చి కూర్చి బా | గునకుఁ దెచ్చిన యట్లు కొమరు మిగిలి,
యళికులంబుల కప్పు గలయంతయును దెచ్చి | నారు వోసిన భంగి నవక మెక్కి,
 
తే. యంఘ్రితలములుఁ, గుచములు, నాననంబుఁ, | గచభరంబును నిట్లున్న రుచిరమూర్తి
యనుపమాన భోగములకు నాస్పదంబు | కాదె? యీ త్రిప్పు లేటికిఁ గమలవదన?’
52
తే. నీవు దుర్జాతిగామికి నీవ సాక్షి; | పరసతీ సంగమున వచ్చు పాపమునకు
నోరుతును గాని, సైరింప నోపఁ బచ్చ | విలుతు తూపుల తాఁకున కలరుఁ బోఁడి!’
53
క. అను నప్పలుకుల కయ్యం | గన కోపము గదిరి ‘నీచు గావున జంకిం
చినఁ గాని మెత్తఁబడి పోఁ’ | డని మనమునఁ దలఁచి యిట్టు లనియెం బెలుచన్‌.
54
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )