ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
ద్రౌపది కీచకునితోఁ బరుష వాక్యంబులు వలుకుట (సం. 4-13-28)
శా. ‘దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతుల్‌
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్‌ వెసం గిట్టి గం
ధర్వుల్‌ మానముఁ బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!’
55
తే. అనుడు నతఁ డిట్టు లనియె ‘నా యతుల బాహు | బలముఁ జెనయంగ భవదీయ పతుల కారు
మూఁడులోకంబులందు నెవ్వాఁడు లేమి | నిక్కువం బింత నమ్ముము నీరజాక్షి!’
56
వ. అనిన విని సైరంధ్రి సైరణ దక్కి ధిక్కరించి యిట్లనియె. 57
క. ‘చనుఁ జనదని చూడక యం | దని మ్రాఁకులపండ్లు గోయఁ దలఁచుట హితమే?
మును చెడిన రావణాదుల | విని యెఱుఁగవె యెన్నఁడును వివేకవిహీనా!’
58
తే. ఇవ్విధంబునఁ బలికిన యింతి పలుకు | గాన నేరక తమ యప్పకడకు మగుడ
నరిగి నెవ్వగ మనమునఁ బిరిగొనంగఁ | జిన్నఁబోయిన మొగముతో సింహబలుఁడు.
59
క. చని మదనాగ్ని జ్వాలలు | దనుకఁగ నిట్టూర్పు గాడ్పు దందడి నిగుడం
దను నూరార్పఁగ సఖి దొర | కొనమికి వెనుఁబడుచుఁ కీచకుం డా సతితోన్‌.
60
వ. ‘ఏ నప్పుడు నీకుం జూపి యన్వయ నామధేయంబు లడిగిన యప్పొలఁతి వలనం జిక్కి చిత్తం బుత్తల పడుచున్నయది; యిటమీఁద నీవ యెఱుంగు; దయ్యింతి యింతసేపు నీ చేరువనుండి యిప్పుడెట మెలఁగె?’ నని యడిగిన విని, యతని వేగిరపాటు చూచి శిరఃకంపంబు సేయుచు సుదేష్ణ నిజాంతర్గతంబున. 61
తే. ‘రాగరసమగ్నుఁడయ్యె సైరంధ్రిఁ జూచి | యకట! దీన నింకేమి యపాయమగునొ?
వలదు తగదన్న నుడిగెడు వాఁడె వీఁడు? | మాయదైవమ! యే నేమి సేయుదాన?
62
వ. అయిన నా నేర్చుకొలందిఁ దగిన తెఱంగున వారించి చూచెదంగాక!’ యని యూహించి యిట్లనియె. 63
సీ. ‘లలితంబు లగు మట్టియల చప్పు డింపార | నంచకైవడి నడ నల్ల వచ్చి,
యెడ మేని నెత్తావి సుడియంగఁ బయ్యెద | సగము దూలించి పై మగుడఁ దిగిచి,
సోలెడు నెలదీఁగె లీలఁ గ్రాలుచు వింత | చెలువంబు దలకొనఁ జేరి నిలిచి
తెలిగన్నుఁగవకు నెచ్చెలియైన లేఁతన | వ్వొలయంగ సరసంపుఁ బలుకు పలికి,
 
తే. మెఱయు చెయ్వుల రాగంబు మెయికొనంగ | నెడఁద సొగయించు మాటల నెలమి మిగుల
నిన్ను ననురక్తిఁ గొలుచు నన్నెలఁత లుండ | నీరసాకార సైరంధ్రిఁ గోరఁ దగునె?’
64
వ. అనిన నప్పలుకులదెస ననాదరంబు సేయుచు నచ్చేడియం జూచి కీచకుం డిట్లనియె. 65
క. ‘నా కొలువు వార కా; ర | న్నాకేశుం గొలుచు నంగనలలోనైనన్‌
లేకునికి నాకుఁ దెల్లం | బా కొమ్మకు నీడు పోల్పనయ్యెడు సుదతుల్‌.
66
సీ. గండుమీలకుఁ బుట్టి కాము బాణములతోఁ | గలసి యాడెడు నట్టి కన్నుఁ గవయు,
బిస కాండముల శిక్షఁ బెరిఁగి లేఁ దీఁగల | మెచ్చక యున్నట్టి మృదు కరములుఁ,
జిగురులతో సంధి సేసి యంబుజముల | పై నెత్తి చను నట్టి పదతలములుఁ,
గలకంఠములచేతఁ గఱచిన విద్య వీ | ణల కిచ్చునట్టి తిన్నని యెలుంగు,
 
తే. నత్తెఱంగున రేఖయు, నవ్విధంబు | గరువ చందంబు, నమ్మెయి కలికితనము,
నట్టి చెన్నును సైరంధ్రియంద కాక | కలవె యొరులకు? నెఱుఁగక పలికి తబల!
67
వ. కావున నా యెలనాఁగ నేమి యుపాయంబుననైన నన్నుం జేర్పవైతేని కందర్పదర్పంబున నలందురి వందుదు’ ననిన నవ్వెలంది వెండియు నిట్లనియె. 68
తే. ‘ఆయురైశ్వర్య కీర్తుల నపహరించుఁ | బరసతీ సంగమము; ధర్మపథమునందుఁ
బరఁగువారలు పరిహరింపంగఁ గనియు | వినియుఁ దెలియవె యిది దుర్వివేక మగుట.
69
సీ. పతి యెఱింగినఁ దన ప్రాణంబుపై వచ్చు | నను భయంబున నుల్లమదరు చుండ,
జనులు గాంచిన మానుషము దూలుఁ దన కను | పుయిలోటమున మోము పుల్లగిలఁగ,
బోటికిఁ దోఁచినఁ బొలియుఁ దేఁకువ యను | వెగడునఁ జెయ్వులు వీడుపడఁగ,
బంధుల కగపడ్డఁ బాయు నన్వయ మను | కలఁక మైఁ జెమటలు క్రమ్ము దేరఁ,
 
తే. గ్రీడ దెసఁ గౌతుకం బురియాడ రతుల | చవులు గొనియాడ నేరని జార పొందు
హృదయమున కింపు చేయమి నెఱుక గలుగు | వారు దీని సుఖంబుగాఁ గోర రెందు.
70
వ. అదియునుంగాక. 71
క. బలవిక్రమ సంపన్నులు | గల రేవురు దానిపతులు గంధర్వులు; వా
రలఁ దలఁచిన నా చిత్తము | దలఁకెడు; నది యేల నీకుఁ దమ్ముఁడ! చెపుమా!
72
తే. కాని తెరువునఁ బోయినఁ గలుగునయ్య! | బ్రదుకు? చవి యెంతయైన నపథ్యములకు
వేడ్క సేయుదురయ్య వివేకు? లెవ్వి | ధమున నా బుద్ధి వినవయ్య తమక ముడిగి.’
73
క. అనవుడు నమ్మాటలు దన | మనమునకు సహింపరామి మల్లడిగొనుచున్‌
మనసిజ పరతంత్రత ని | ట్లని పల్కె సుదేష్ణతోడ నతఁ దుద్ధతుఁడై.
74
మ. ‘వనితా! యే నొక పల్కు పల్కెదఁ జతుర్వారాశి మధ్యంబునన్‌
ఘనబాహాబల మొప్ప నన్ను నెదురంగా నొక్కఁడున్‌ లేమి యె
వ్వనికిం దెల్లము గాదె! దాని మగలన్‌ వజ్రాహతిం గూలు శై
ల నికాయం బన మద్భుజాసమదలీలన్‌ గీ టడంగించెదన్‌.
75
ఉ. బుద్ధులు సెప్పు టెల్ల నటు వో విడు; మెమ్మెయి నైన సౌఖ్యసం
సిద్ధి యొనర్పు నాకు; నెడ సేసినఁ దాపము రూపుమాపు; నా
వృద్ధియ కోరుదేని ‘నవివేకివి నీ’ వని నన్ను ని ట్లసం
బద్ధములైన వాక్యములు పల్కక వే పిలిపింపు కోమలిన్‌.’
76
తే. అనుచు దైన్యంబు నొందెడు నాననంబు | తోడ దిగ్గన లేచి యత్తోయజాక్షి
చరణ పీఠంబుకడఁ జక్కఁజాఁగి మ్రొక్కి | యున్న నద్దేవి కనుఁగొని చిన్నఁబోయి.
77
ఉ. ‘ఆవల వచ్చు నాపదల కన్నిటి కోర్చి లతాంగిఁ గూర్చి కా
కీ వెడ మాటలన్‌ మరలఁ; డెన్ని విధంబులఁ జూపి చెప్పినం
గావల మైన వీఁడు తగు కార్యము వట్టునె? వీని కెమ్మెయిం
జావు నిజంబు మన్మథునిశాత శరంబులనైన నక్కటా!’
78
క. అని మనమునఁ దలపోయుచుఁ | దన తమ్ముని నల్లనెత్తి దందడి దొరఁగం
జనుదెంచు నశ్రుపూరము | కనుఁగవలో మ్రింగికొనుచుఁ గామిని పలికెన్‌.
79
ఆ. ‘ఇంత దలరనేల? యెమ్మెయినైనను | కొమ్మ నలవరించి కూర్చు టరుదె?
యుమ్మలంబు దక్కి యూఱటతోడ నీ | వేఁగు; మసలవలవ దింక నిచట.
80
క. ఆసవమున కని నీదు ని | వాసమునకు దివములో నవశ్యంబును నే
నా సుదతిం బుత్తెంతు ని | జాసక్తి ఫలింపఁ గొఱలు మభిమత కేళిన్‌.’
81
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )