ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
ద్రౌపది కీచకునింటికిఁ గల్లు దేరంబోవుట (సం. 4-14-17)
చ. మన మురియాడుచుండ ననుమానముతోన సుదేష్ణఁ జూచి ‘నీ
వనయముఁ గోరినట్టి పని యర్థిమెయిం జని చేయుదానఁ గా’
కను తన మాట కప్పొలఁతి హర్షముఁ బొందుచు నందియిచ్చు కాం
చన చషకంబు పుచ్చికొని చారువిలోచన యార్తమూర్తియై.
102
వ. చనుచుండి, నీచహృదయుండగు కీచకుండు తనయెదుర నప్పుడాడిన కర్ణశూలంబులగు మాటల మీఁదం బిడుగుపడినవానిఁ గొఱవింజూఁడిన తెఱంగున సుదేష్ణ ద న్ననుచిత వ్యాపారంబునకు నియోగించుటకు నిర్వేదనంబునం బొంది. 103
చ. అలమటఁ బొంది మాయ విధియా! యని దైవము దూఱు, నిత్తఱిం
గలరొకొ నాకు దిక్కను, మొగంబున నశ్రులు వెల్లిగొల్పుఁ, దొ
ట్రిలఁబడు, జల్లనం జెదరు డెందముఁ గూడఁగఁ దెచ్చి నన్నుఁ గే
వలమున ముట్ట నెవ్వరికి వచ్చుననుం, గలఁగున్‌, వెనుంబడున్‌.
104
వ. అట్టియెడ. 105
సీ. దైన్యంబు తలపోఁత తలకొన్నఁ జెలువ కా | ననమున వెల్లఁదనంబు గదిరె;
భయరసవేగంబు పైకొని ముట్టినఁ | గాంతకుఁ దనులతఁ గంప మడరె;
బెగ డంతకంతకు మిగిలిన నింతికిఁ | బదముల నటఁ దొట్రుపాటు బెరసెఁ;
దల్లడం బొందినఁ దన్వికి నవయవం | బుల నెల్ల ఘర్మాంబు కళిక లెసఁగెఁ;
 
ఆ. దలఁకు పుట్టెఁ, గొంకు కొలఁదికి మీఱె, వె | న్బాటు దోఁచె, ముట్టుపాటు దొడరె
వెఱఁగుపాటు దనికె, నెఱ నాడె నొవ్వు నె | వ్వగలు వగల నీనె, దిగులు వొదివె.
106
వ. ఇవ్విధంబున ద్రుపదపుత్రి దురవస్థం బొందుచు ‘మహాపదలకుం బరిహరణంబు హరి (చరణ) స్మరణంబ’ యని తన హృదయపుండరీకంబునం బుండరీకాక్షు నిక్షేపించుకొని, సుదేష్ణ మందిరంబు వెలువడి దినకరుం గనుంగొని వినయవినమితోత్తమాంగయై నిజాంతర్గతంబున. 107
తే. ‘పాండుపుత్రులకేను తప్పని మనంబు | గలుగుదాననయేని నో కమలమిత్ర!
కీచకుని దెస న న్నొక కీడు తెరువు | వొరయకుండఁగ రక్షింపు కరుణతోడ.’
108
వ. అనుచుం గేలు మొగిచిన. 109
క. తరణియు దుఃఖితయగు న | త్తరుణిం గాచుటకు నత్యుదగ్రభుజావి
స్ఫురణాఢ్యు నొక్క రక్కసుఁ | గరుణా ర్ద్రమనస్కుఁ డగుచు గ్రక్కునఁ బనిచెన్‌.
110
వ. వాఁడునుం బనిపూని యంబరతలంబున నదృశ్యాకారుండై వచ్చి నిలిచె. 111
తే. ఇట్లు ప్రార్థించి పాంచాలి యెట్టకేని | సింహబలు మందిరం బల్లఁ జేర నరిగి
యొల్లఁబోవుచు బెబ్బులి యున్న పొదరు | సొచ్చు లేడి చందంబునఁ జొచ్చుటయును.
112
ఉ. అంబురుహాక్షి వచ్చు తెరు వారయఁ గీచకముఖ్యుఁ డపు తె
ల్లంబుగఁ జూచి యుల్లము కలంకయు వారక మేన వెమ్ముతా
పంబును డిగ్గఁ ద్రావి, గరుపాఱుచు నుత్కట సంభ్రమంబు హ
ర్షంబుఁ బెనంగొనంగ నతిచంచలభావ పరీతమూర్తియై.
113
క. చిడిముడి పడుచు నెదురు చనఁ | గడఁగుచు హారములు సక్కఁగాఁ ద్రోచుచు మ
ల్లడి గొనుచు దుర్విలాసం | బొడలికి నొడఁ గూర్చుచుండ నుగ్మలి యంతన్‌.
114
వ. తత్ప్రదేశంబునకుం జని. 115
తే. ‘దేవి తృష పుట్టి వారుణిదేరఁ బనుప | నరుగుదెంచితిఁ బోయింపుఁ’ డనిన నింతి
నెమ్మొగంబున దృష్టులు నిలిపి, తమక | మడర నిట్లను నా కీచకాధముండు.
116
క. ‘దేవి తృష దీర్పఁ బూనితి; | వా వెలఁది సహోదరుండ నగు నా తృష లీ
లావతి! నీదు సరస సం | భావనమెయిఁ దీర్పకునికి పాడియె చెపుమా!
117
సీ. కాంతి దళ్కొత్తు నీ కడగంటి చూడ్కితోఁ | బొందఁగానని మేను పొగులుటయును,
దీపారు నీ పల్కుఁ దెల్లంబుగా వినఁ | గానని వీనులు గందుటయును,
నింపగు నీ చెయ్వు లెలమిమైఁ గొనియాడఁ | గానని కోర్కులు గలఁగుటయును,
సొగయించు నీ కేళిఁ దగిలి యానందంబుఁ | బొందఁగానని మది గుందుటయును
 
తే. బాయ, నాదగు జన్మంబు ఫలము నొంద | భావజన్ముని పూనిక పార మెయ్ద
నన్ను బంటుగా నేలుము నలినవదన! | యింక నీ సిగ్గుదెర యోల మేల నీకు?’
118
వ. అనవుడు. 119
తే. చెలువ యప్పలుకులు పెడ చెవులఁ బెట్టి | ధీర గావున విగతవికార యగుచు
‘మదిర వోయింపుఁ డద్దేవి యెదురుచూచు | నలుగుఁ దడవైన మగుడఁ బోవలయు’ననిన.
120
చ. ‘మదిర సుదేష్ణపాలి కొకమాత్రన పుచ్చెద నొడ్ల చేత; నిం
పొదవెడు నట్టి దీని చవి యుల్లము సొక్కఁగ నాను మీవు; నీ
వదన సరోజ సౌరభమవారణ నన్నును గ్రోల నిమ్ము; బె
ట్టిదుఁ డగు కాము తూపులఁ దొడింబడకుండఁగఁ గావు మిత్తఱిన్‌.
121
క. కరితురగ రథసమితిఁ బొం | పిరివోయెడు నాదు లక్ష్మి పెంపున కెల్లన్‌
సరసిరుహవదన! నీవ కు | దురుగా నొనరించెదం గుతూహల మెసఁగన్‌.
122
క. రుచిర మణి భూషణంబులు | నుచిత విహారప్రకార యోగ్యాగార
ప్రచయము సుందరగణికా | నిచయము నొప్పించువాఁడ నీకుం దరుణీ!
123
క. నా కులకాంతల నెల్లను | నీకుం బనిసేయఁ బనిచి నెయ్యంబున నే
నీ కనుసన్నన మెలఁగెద | నే కార్యంబైన నడుపు మీవ తగంగన్‌.’
124
వ. అనుచు సింహబలుండు తన యంతరంగంబున నంతకంత కగ్గలించు తమకంబునఁ దన్నుఁదా నెఱుంగక పయింబడి పట్టుకొనిన. 125
క. తనుఁ గాచి వెనుక వచ్చిన | దనుజు మహాబలము తనదు తనువొందిన, నా
తని చే విదిల్చి రభసం | బునఁ దన్మందిరము ద్రుపదపుత్రిక వెడలెన్‌.
126
వ. ఇట్లు ద్రోచిపోయినం గీచకుండు వెనువెంటం దగిలిన నమ్మగువయు మరలి చూచి భయభ్రాంతయై ‘యెవ్వలనికిం బోదునో’ యని తలంచి, దైవయోగంబున విరాటుం డప్పుడు గొలువునికింజేసి తత్సభా భాగంబు దెసకు వెసం బాఱినం, గామాయత్తచిత్తుండును, గర్వోన్మత్తుండును గావున జనసమూహంబు సరకుసేయక రహస్యప్రకాశవిభేదవిచారంబు దక్కి. 127
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )