ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
కీచకుఁడు ద్రౌపదిం బట్టుకొనుటకు వెంటఁదగులుట (సం. 4-15-7)
సీ. సమదవారణము జంగమలత వెనుకొని | సరభసంబునఁ బట్టఁ జనువిధమునఁ
గ్రూరదానవుఁడు భూచారి నిర్జరకాంతఁ | బొదువ రయమ్మునఁ బోవుభంగి
ఘోర గృధ్రము సుకుమార నాగాంగనఁ | బటుగతి నొడియంగఁ బాఱు కరణిఁ
బ్రబల బిడాలంబు బాలశారిక మీఁద | నడరి సత్వరముగ నరుగుమాడ్కి
 
తే. సింహబలుఁ డత్యుదగ్రతఁ జిగురుబోఁడి | పజ్జఁ గడువడిఁ దగిలి కోపంబు గదుర
నొడిచి తలపట్టి తిగిచి మహోగ్రవృత్తి | గొంకు కొసరించుకయు లేక కూలఁదాఁచె.
128
వ. అట్టియెడఁ బాంచాలీ రక్షకుండైన రాక్షసుం డతని డొల్లవ్రేసిన. 129
క. కీచకుఁడు వ్రేటుపడి తన | నీచపుదశ యొరు లెఱుంగ నేరకయుండన్‌
లేచి వెనుకఁ జని విస్మయ | గోచరుఁడై యసురకతనఁ గుంఠితుఁడగుచున్‌.
130
వ. ఒడుపు దప్పిన మహానాగంబునుం బోలె నిట్టూర్పు నిగుడ నిట్టలంబగు కోపంబు పెల్లున మల్లడిగొనుచుండె; నయ్యవసరంబున. 131
క. తానును నన్నయు నయ్యా | స్థానమ్మున నుండి పవనతనయుఁ డసహ్యం
బైన మనోవల్లభ యవ | మానము, నా సింహబలుని మదజృంభణమున్‌.
132
చ. కనుఁగొని కోప వేగమునఁ గన్నుల నిప్పులు రాల, నంగము
ల్గనలఁగ, సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రమ్మ, నితాంతదంతపీ
డనరట దాస్యరంగ వికట భ్రుకుటీ చటుల ప్రవృత్త న
ర్తన ఘటనా ప్రకార భయదస్ఫురణా పరిణద్ధ మూర్తియై.
133
సీ. నేలయు నింగియుఁ దాళముల్‌గాఁ జేసి | యేపున రేఁగి వాయించి యాడఁ,
గులపర్వతంబులు గూల్చి యొండొంటితోఁ | దాఁకంగ వీఁకమైఁ దన్ని యాడ,
నేడు సాగరములు నిక్కడక్కడఁ బెట్టి | పలుచని రొంపి మై నలఁదికొనఁగ,
దిక్కులు నాలుగు నొక్క చోటికిఁ దెచ్చి | పిసికి పిండలి సేసి పిడుచగొనఁగ,
 
తే. మిగిలి బ్రహ్మాండభాండంబు పగుల వ్రేయ | నప్పళించుచుఁ బ్రళయకాలానలమున
గండరించిన రూపంబు కరణి భీముఁ | డతి భయంకరాకారత నతిశయిల్లె.
134
వ. ఇట్లు పేర్చిన కోపాటోపంబున నవిచారిత సమయవర్తనుండయి వృకోదరుండు కీచకుని గీటడంగింపంజూచి తత్సంబంధబద్ధుండును నాజ్ఞాపరిపాలకుండును గావున మత్స్యపతిఁ దన యలుకలోని వానిన కాఁదలంచుచు నచ్చేరువ నున్న యున్నతవృక్షంబు నిరీక్షించి, యాననంబు పల్లటిల్ల ధర్మతనయుం గనుంగొనిన నతండు తన నయనాకారంబున వారించి యిట్లనియె. 135
మ. ‘వలలుం డెక్కడఁ జూచె నొండెడ నసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవే?
ఫలితంబై వరశాఖ లొప్పఁగ ననల్పప్రీతి సంధించుచున్‌
విలసచ్ఛాయ నుపాశ్రిత ప్రతతికిన్‌ విశ్రాంతి గావింపఁగాఁ
గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపఁగా నేటికిన్‌?’
136
తే. అని నిగూఢభాషణముల నయ్యజాత | శత్రుఁ డనిలజు కోపరసంబు పేర్మి
చెఱిచె, నయ్యన్నదమ్ముల చేష్టితములు | దెల్లముగ నప్డు సూచుచు నల్లలేచి.
137
సీ. ఎలదీఁగఁ గప్పిన లలితపరాగంబు | క్రియ మేన మేదినీ రేణువొప్పఁ,
జంపకంబున నవసౌరభం బెసఁగెడు | కరణి నాసిక వేఁడి గాడ్పు నిగుడఁ,
దోయజ దళములతుది మంచు దొరఁగెడు | గతిఁ గన్నుఁగవ నశ్రుకణము లురుల,
నిందుబింబము మీఁది కందు చందంబునఁ | గురులు నెమ్మొగమున నెరసియుండ,
 
తే. సర్వజన వంద్య యైన పాంచాలి సింహ | బలునిచే నివ్విధంబున భంగపాటు
దనకు వచ్చిన నెంతయు దైన్యమొంది | యవ్విరాటుని సభఁ జేర నరిగి నిలిచి.
138
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )