| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఉ. |
పంబిన కోపమున్ సమయభంగ భయంబును నగ్గలించి యు ల్లంబు పెనంగొనంగఁ బతులం దగ సభ్యులఁ జూచుమాడ్కి రూ క్షంబగు చూడ్కి నా ద్రుపదుకన్నియ సూచి సభాజనప్రతా నంబును మత్స్యనాథుఁడు వినంగ నెలుంగు చలింప నిట్లనున్. |
139 |
| సీ. |
‘నిఖిల ధర్మాధర్మ నిపుణంబు లైన శు | ద్ధాంతరంగంబుల నతిశయిల్లి, శిష్ట సంరక్షణ దుష్ట నిగ్రహముల | నీతి వాటింపంగ నేర్పు గల్గి, సకల శస్త్రాస్త్ర సంచయములఁ బరమాద్భు | తంబు సేయు పరిశ్రమంబు దాల్చి, దుర్దమ ప్రతిభట మర్దన క్రీడమైఁ | జతురులు నా నెందు నుతికి నెక్కి , |
|
| తే. |
యున్న గంధర్వు లేవురు నన్ను నిట్టు | లొకఁడు వఱుపంగ నూరక యునికి సూడ నచ్చెరువు గాదె! యెవ్వరి యాండ్రు రింకఁ | బరిభవంబునఁ బొందకఁ బ్రదుకువారు? |
140 |
| క. |
ఈ నరపతి యాస్థానము | లో నొక్కరుఁడైన ధర్మలోప భయమునన్ బూని తగవైన వెడ పలు | కైనను బలుకంగఁ జాలఁ డయ్యెను నకటా! |
141 |
| ఉ. |
ఇందఱుఁ జూడఁగా నిచట నిమ్మెయి నన్నుఁ బతివ్రతా గుణా స్పందిత వర్తనం బరమ సాధ్వి ననిందితశీలఁ గీచకుం డెందును నెట్టి యంగనల నెవ్వరుఁజేయనియట్లు సేయఁగాఁ గొందఱకైన నిప్డు కృపకుం దఱిగాదటె? యేమి సెప్పుదున్? |
142 |
| ఉ. |
ఐనను మత్స్యదేశమున యాజ్ఞ కితం డొడయుండు గాన నా కీ నరనాథు దూఱఁదగు; నెయ్యది యేని నధర్మ మెవ్వ రెం దైన నొనర్చినం బ్రభువు లారసి దండన మాచరింతు; రి చ్చో ననుఁ దన్ను కీచకునిఁ జూచియు నూరక యున్కి పాడియే?’ |
143 |
| చ. |
అనుడు విరాటుఁ డుల్లమున నక్కటికం బొలయంగ నంగనం గనుఁగొని, కీచకుం గినియఁగాఁ దగు సత్త్వము లేమిఁ జేసి సాం త్వనములు పల్కి రోషభరితస్థితిఁ గంపితమూర్తి యైన యా తని మది కుందు వాపిన నతండును బోయె నివాసభూమికిన్. |
144 |
| వ. | అట్టి యవసరంబున. | 145 |
| సీ. |
‘శుభలక్షణాంగి యీ సుందరి సైరంధ్రి | యగు టెట్లొకో!’ యని వగచువారు, ‘నిమ్మేని కక్కట యిట్టిది సేసెనే ! | మాయ దైవం’ బని మఱుఁగువారు, ‘నింత కీ డొనరించెనే! రాజు సూడ నీ | దుష్టాత్మకుం’ డని దూఱువారు, ‘దేవి యుపేక్షయ చూవె! యీయమకు ని | ప్పాటు వచ్చుట’ యని ప్రందువారు |
|
| తే. |
నగుచు సభవార లందఱు నంత నంత | నల్ల నల్లన గుజగుజ లాడుచుండి; రుల్లమున నిండి ఖేదంబు వెల్లివిరిసె | నాఁగ మోముల విన్నఁదనంబు గదుర. |
146 |
| ఉ. |
అప్పుడు ధర్మసూతి హృదయంబు గలంగ, లలాట భాగముం గప్పఁగ ఘర్మవారి, యధికంబగు రోషము నొందియుండియుం దప్పఁగఁ ద్రోచికొంచుఁ దనధైర్యము పెంపున నిర్వికారుఁడై యెప్పుడుఁ దాను పల్కు నెలుఁ గేర్పడ ద్రౌపదితోడ నిట్లనున్. |
147 |
| సీ. |
‘జననాయకుండు నీ సభవారు నీదగు | తెఱఁగెల్ల నెఱిఁగిరి తెఱవ! యింక మానక యీ పలుమాట లాడఁగ నేల? | చనుము నీవు సుదేష్ణ సదనమునకు; నీ పరాభవమునఁ గోపింప నేరరే | గంధర్వులకుఁ దఱిగాదుగాక; సమయ మెయ్యది యేనిఁ దమకును నీకుఁ గ | ల్గిన యట్టులైనను గినియ రిచట |
|
| తే. |
గాన నాథుల దూఱంగఁ గాదు వినుము | సతికిఁ; దానెంత వడియును సభలలోనఁ దడవుగా నిల్చి యిట్టు లుదగ్రవృత్తి | శంక సెడి ధిక్కరింపంగఁ జనునె చెపుమ!’ |
148 |
| వ. | అనియిట్లు సెప్పిన ధర్మ తనయుని పలుకులు విని వెండియు సైరంధ్రి యచ్చోటు గదలక నిలిచి యెద్దియేనియుం బలుకం దలంచినం జూచి యతండు మఱియు నిట్లనియె. | 149 |
| క. |
‘పలుపోకలఁ బోవుచు వి | చ్చలవిడి నాట్యంబు సలువు చాడ్పున నిచటన్ గులసతుల గఱువ చందము | దొలఁగఁగ నిట్లునికి దగునె తోయజవదనా!’ |
150 |
| వ. | అనిన విని పాంచాలి సాభిప్రాయంబుగా నతని కిట్లనియె. | 151 |
| ఆ. |
‘నాదు వల్లభుండు నటుఁ; డింత నిక్కంబు; | పెద్దవారి యట్ల పిన్నవారు గానఁ బతుల విధమకాకయే శైలూషిఁ | గా ననంగరాదు కంకభట్ట! |
152 |
| వ. | అట్లగుటంజేసి నాకు నాట్యంబును పరిచితంబ; మత్పతి శైలూషుండ కాఁడు, కితవుండునుం గావున జూదరి యాలికి గఱువచందం బెక్కడిది?’ యనుచు నచ్చోటు వాసి తన చిత్తంబున. | 153 |