ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
ద్రౌపది భీమసేనుతోఁ దన భంగపాటు సెప్పి పరితపించుట (సం. 4-16-5)
వ. ఇట్లూహించి రాత్రిసమయం బగుటయు, సమస్త జనంబులుఁ గ్రమంబున నిద్రింపం దొడంగినం దానును శయ్యాతలంబు విడిచి, మేని ధూళి గడిగి, ధౌత పరిధాన పరీతయై మహానస గృహంబున సుప్తుండైన వృకోదరు కడకుం జని. 165
ఉ. ‘నన్నుఁ బరాభవించి సదనంబునకుం జని కీచకుండు ము
న్నున్న తెఱంగు దప్పక సుఖోచిత శయ్యను నిద్ర సేయ నీ
కన్ను మొగుడ్చు నూఱటకుఁ గారణ మెయ్యది? భీమసేన! మీ
యన్న పరాక్రమంబు వలదన్న నొకో దయమాలి తక్కటా!’
166
వ. అనుచు మంద మంద సంభాషణంబుల సంబోధించు పాంచాలిపాణిస్పర్శంబున మేలుకని ‘యిది యెవ్వ’ రనవుడు? నే’ నను నమ్మానిని యెలుంగెఱింగి భీమసేనుండు ‘యాజ్ఞసేని కీచకు దురాచరణంబు నాకుఁ బ్రకటించి వాని నిర్జింప నియోగించునదియై యరుగుదెంచెంగావలయు; నత్తెఱం గిత్తెఱవ దాన చెప్పవిందు’ నని తలంచి. 167
తే. ‘ఇంత ప్రొద్దేల యిచ్చోటి కేఁగుదేరఁ | గారణం బేమి? యెవ్వరుఁ గానకుండు
నట్లుగాఁ జనుదెంచితె యంబుజాక్షి !’ | యనిన నయ్యింతి యిట్లను నతనితోడ.
168
చ. ‘ఎఱిఁగి యెఱింగి నన్నడుగ నేమిటి? కప్పు డెఱింగి యింతకు
న్మఱచుట గల్గెనే, నది వినం బనిలే; దటుగాక యున్న రూ
పెఱిఁగియు నేన చెప్ప విన నిష్టము గల్గుట చాల లెస్స; య
త్తెఱఁ గెఱిఁగించెదన్‌ వినుము తెల్లముగా మొదలింటినుండియున్‌.
169
చ. అధిపు మఱంది సింహబలుఁ డప్పకు మ్రొక్కఁగ వచ్చి నన్ను న
త్యధికమనోజ రాగ మతియై కనుఁగొంచుఁ గడంగి యెన్నియేన్‌
విధములఁ బల్కి నాకుఁ దన విన్నను వెల్లను జూపి చెప్పి మా
నధన విహీనతం జెనకినం గడునేవము పుట్టి యయ్యెడన్‌.
170
క. విడియం బలుకఁగ వెండియు | నుడుగక కీచకుఁడు మన్మథోన్మాదము ద
న్నడరిన న న్నడుగుటకుం | దొడరినఁ గోపించి వానితో నిట్లంటిన్‌.
171
శా. దుర్వారోద్యమ బాహు విక్రమరసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతు
ల్గీర్వాణాకృతు లేవు రిపు నిను దోర్లీలన్‌ వెసన్‌ గిట్టి గం
ధర్వుల్‌ మానముఁ బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!
172
వ. అనిన విని వాఁడు గొన్ని ప్రల్లదంబులు పలికిన నేనునుం దత్కాలోచిత వచనంబులం ద్రోచిపుచ్చినం బోయెఁ; బదంపడి పాపాత్మయైన సుదేష్ణ తనకు మదిరారసంబు దేరం గీచక నివాసంబునకు నన్నుం బనిచినం బోవుట కొడంబడక, యెన్ని సెప్పిన నన్నింటికి నన్ని సెప్పి నిర్బంధించినం బెద్ద పెనంగ నొల్లక నా మనంబున నన్నెవ్వరికి నేమి సేయవచ్చు నని మీలావు నచ్చి సూతునింటికి సురకుం బోయిన. 173
క. కొన్ని వెడమాట లాడుచు | నన్ను నతఁడు చెట్టవట్టినం ద్రోచి వెసం
జన్న వెనుకొనుటయును మీ | యున్నెడ కే నపుడు సంభ్రమోపేతగతిన్‌.
174
తే. పాఱుతెంచిన నక్కులపాంసనుండు | గోప మడరంగ వెనుకన కూడముట్టె;
నట యెఱుంగుదు వీవు; మీ యన్న పెద్ద | తనముఁ జూచితి; వేమందు ననిలతనయ!
175
ఉ. మీ సుభటత్వమున్‌ బలము మిన్నకపోవఁగ దుస్ససేనుఁ డ
ట్లా సభలోన నన్‌ బఱిచె; నంతియకాక జయద్రథుండు సం
త్రాసభరంబు లే కనుచితం బొనరించినఁ జెల్లిపోయె; నేఁ
డీ సభికుల్‌ గనుంగొనఁగ నిట్లయితిన్‌; వగ నాకు వింతయే!
176
ఆ. అకట! యాఁడుకూయు నాలకూయును లాఁతి | వారికైన నరయవలయు ననిన
నన్నుఁ గీచకుండు దన్నంగ నెట్టులు | సూడ నేర్చె ధర్మసూనుఁ డపుడు.’
177
వ. అనిన విని యతం డిట్లనియె. 178
ఉ. ‘కీచకుఁడట్లు మీఁదు పరికింపక నిన్నుఁ బరాభవింపఁగాఁ
జూచి మహోగ్రకోప వివశుండగు నన్నును జూచి ధైర్య హే
మాచలుఁడైన ధర్మసుతుఁ డమ్మెయి వారణ సేయకున్న నే
నీచత వాని మత్స్యవిభునిం బరివారము నుగ్గు సేసినన్‌.
179
వ. ఆ సంరంభంబున సమయభంగంబుగా జనంబులు మనల నెఱింగిరయేని. 180
క. ముందటి భంగిన కానల | యందుఁ జరింపంగ వలదె? యది నీవును నే
నుం దెచ్చిన యాపదగా | నిందింపరె యెల్లవారు నీరజనయనా!
181
వ. కావున సత్యవ్రత నిష్ఠుండగు యుధిష్ఠిరుండు పొగడ్తకుం దగువాఁడుగాని దూఱువడ నర్హుండుగాఁ’ డని వెండియు నిట్లనియె. 182
క. ‘పరిభవకరుఁడగు కీచకుఁ | బరిమార్చుట యిపుడు గడవఁబడియెనె? యిమ్మై
దురపిల్ల నేల? వ్రేల్మిడిఁ | బొరిగొని నీ మనము కలఁక పుత్తు లతాంగీ!
183
వ. మనల నెవ్వరు నెఱుఁగకుండునట్టి తెఱంగు తలపోయవలయుఁగాక, పగతుని భంజించుట యెంతపని?’ యనిన విని యా మానిని యిట్లనియె. 184
క. ‘గొంతికి నంత వెఱవ, మీ | కంత వెఱవ, దైవమునకు నంత వెఱవ, న
త్యంత కలుషాత్మ విరటుని | కాంతకు నే వెఱతుఁ బనులు గావించునెడన్‌.
185
చ. కినుకకుఁ జాల కెంతయును గీడ్పడి నా పడుపాటులెల్ల వ
మ్మునఁ గలయంగ నిట్టు లొక మూర్ఖునిచేఁ దుదిఁబోయి కోలుపో
యెనె యభిమానమ న్వగపు నేడ్తెఱ డెందము కొందలంబుఁ బొం
దిన ధృతి మాలి యేఁ బలికితిం దగవెల్ల నెఱింగియుండియున్‌.
186
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )