ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
ద్రౌపది భీమునితో ధర్మరాజు మహిమ చెప్పుట (సం. 4-17-15)
వ. ఇట్టిద కాని సమస్త జనస్తవనీయుండగు పాండవాగ్రజు నిక్కంబ నిందించినదానం గా ’నని పలికి మఱియును. 187
క. ‘ధర్మతనూభవు సంతత | ధర్మనిరతి మనము బ్రదుకఁ దలఁచుట యరుదే?
నిర్మలుఁ డగు నాతని స | త్కర్మంబునఁ గాదె బ్రదుకు ధాత్రికి నెల్లన్‌.
188
సీ. చనునె వేఱొకని కజాతశత్రుండను | పేర దిగ్విజయంబు పెంపు దాల్ప?
రాజసూయ మహాధ్వరముఁ గోరి చేయంగఁ | దీరునే పెఱధరిత్రీపతులకు?
ధర్మైకనిరతుఁ డాతం డొక్కరుఁడ చూవె | యనఁ జన నొరులకు నలవి యగునె?
నిత్యవ్రతంబుగా సత్యంబు పాటింప | వచ్చునె యొరుల కెవ్వరికి నైన?
 
తే. నయ్యుధిష్ఠిరు గాంభీర్య మతనిధైర్య | మరయ నొండెడఁ గలుగునె? యతఁడు కీర్తి
ధరుఁడు కరుణోత్తరుఁడు మహీసుర సమృద్ధి | కరుఁడు నిజవంశకరుఁ డుపకారపరుఁడు.
189
క. కలిమికి నొప్పగు నీఁగియు, | బలిమికిఁ దొడవైన యట్టి బలఁగమునై లో
కులచిత్తములకు వ్రేఁగగు | కొలఁది మన న్గొంతి పెద్దకొడుకున కమరున్‌.
190
సీ. ఎవ్వని వాకిట నిభమదపంకంబు | రాజభూషణ రజోరాజి నడఁగు;
నెవ్వని చారిత్ర మెల్ల లోకములకు | నొజ్జయై వినయంబు నొఱపుఁ గఱపు;
నెవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి | మానిత సంపద లీనుచుండు;
నెవ్వని గుణలత లేడు వారాసుల | కడపటి కొండపైఁ గలయఁబ్రాఁకు;
 
తే. నతఁడు భూరిప్రతాప మహాప్రదీప | దూర విఘటిత గర్వాంధకారవైరి
వీర కోటీరమణి ఘృణివేష్టితాంఘ్రి | తలుఁడు కేవల మర్త్యుఁడె ధర్మసుతుఁడు!
191
ఉ. అట్టి మహాత్ముఁ డొక్కనికి నాశ్రితుఁడై వెడకూడుఁ జీరయుం
బెట్టఁగ నిల్చి వాని మది ప్రీతికి నీడగువృత్తిఁ బేరునుం
బుట్టును మాలి యిప్పు డిటు బ్రుంగుడుపాటునఁ బొందఁ జూచి నా
కెట్టు మనంబు వట్టు? ధృతి యెమ్మెయిఁ దూలక నిల్చుఁ? జెప్పుమా!
192
ఉ. నీ వలమూపులావు మును నేల వహించిన నాగకూర్మ గో
త్రావనిభృద్ధిశాకరుల కారయ నూఱటపట్టు గాదె? సం
భావన భూజనంబులకుఁ బండువు గాదె? మహోగ్ర కోప రే
ఖావిభవంబు వైరులకుఁ గాలము చేరువ గాదె పావనీ!
193
తే. బక హిడింబ కిమ్మీరుల బాహుబలము | నా జరాసంధు నుగ్రదర్పాతిశయము
లోకభీకరములు విజయాకరములు | నైన నీ కరములకు లోనయ్యెఁ గాదె !
194
ఆ. అట్టి నీవు వంటకట్టియలకు లావు | సూపుచుండ నెపుడుఁ జూచి చూచి
వగతు; నదియుఁగాక తగవేది యమ్మత్స్య | మేదినీశ్వరుఁడు వినోదములకు
195
మ. మహిష వ్యాఘ్ర గజాది సత్త్వచయమున్‌, మల్లవ్రజంబుం గృపా
రహితుండై యెదు రొడ్డుచున్‌ వరుసఁ బోరంజూచు నిన్నెప్పుడున్‌;
మహనీయంబగు నీ శరీరము జగన్మాన్యంబు; నీచక్రియా
విహితం బైన కుజీవనంబు విధి గావించెం గటా దీనికిన్‌’.
196
వ. అని మఱియు నిట్లనియె ‘వివేకహీనుండగు విరాటుండు నిన్నుంబోరించునప్పుడు నిజాంతఃపురకాంతలకు వినోదంబు సేయ వారల రావించిన నేనును సుదేష్ణతో నరుగుదెంచి చూచుచుండుదు; నయ్యవసరంబున. 197
క. భరమున నీ పోరెడు నెడఁ | బరమ విషాదంబు, నీవు బలిమి మెఱసి యు
ద్ధురవృత్తి జయము గొనినం | బరితోషముఁ బొందు నన్ను భావించి మదిన్‌.
198
వ. ఊహించి సుదేష్ణయుఁ దత్పరిజనంబులుం దమలోన. 199
క. ‘వలలుని దెస మాలినిచూ | డ్కుల తెఱఁ గెడపొందుఁ దెలిపెడుం గంటిరె! వీ
రలు వచ్చిన సమయంబును | దలఁపఁగ నొక్కటియ యివ్విధం బెట్లొక్కో!
200
వ. అనుచుం గలదు లేదని పెక్కు విధంబులం దలపోసి గుజగుజలు పోవుచుండుదు రట్టియెడ. 201
తే. మరగి నీమూర్తిపైఁ గన్ను మనముఁ దగిలి | యుండ నేమఱియుండి యొక్కొక్కమాటు
తలఁచికొని వారిదెస మది నిలుపు నప్పు | డెఱుఁగనగు వారు నా తెఱఁ గెఱుఁగుటెల్ల.
202
వ. కావున మదీయ పరిభవాతిరేకంబునకు నీ వుద్రేకించిన జనంబులు మనల భేదింతురు; నీకుం బోలిన భంగి రహస్యభంగంబు గాకుండ నరిభంగంబు సేయు’ మని వెండియు. 203
సీ. తొడరిన హరునైన దోర్బలంబునఁ దన్ను | మిగులంగనీఁడను మేటి మాట,
యమరేంద్రు నర్ధాసనమునకు నైన న | ర్హుం డెంతయును నను రూఢిమాట,
జము నిల్లు సొచ్చిన జంతువు నైనను | గాచు నెమ్మెయి నను రాచమాట,
తనుఁ గోరి యూర్వశి దాన వచ్చిన నైన | లోలుండు గాఁడను మేలిమాట.
 
తే. శౌర్యవైభవ ప్రాభవ శౌచములకు | నొరులకైనఁ గైవారమై యుల్లసిల్లు
నొక్కరుని కివి యెల్లను నిక్కమట్టె ! | యెందుఁ గలుగునె యర్జును నీడువాఁడు ?
204
క. ఆ పార్థుఁడు భరతాన్వయ | దీపకుఁ డమరేంద్ర సుతుఁడు తేజోనిధి వి
ద్యాపారగుండు వినుత | వ్యాపారుం డాపదలకు నగ్గం బయ్యెన్‌.
205
చ. అరయ నతండు మానధనుఁ డక్కట రంగమునందు నిల్చి సుం
దరులకు నాట సూపెడు విధం బతిదీనము; దానిఁ జూచి యేఁ
బురపురఁ బొక్కుదుం; గడుపుఁ బ్రోచికొనన్‌ లఘువృత్తి కిమ్మెయిం
జొరనగువాఁడె దేవపతిసూనుఁడు? దైవము చేఁత సూచితే?
206
చ. ‘మగలకు మేటియైన బలమర్దననందనుఁ బేడిఁ జేయఁగాఁ
దగునె విధాత నీకు?’ నని దైవము దూఱుదు, నోర్వరాని నె
వ్వగ తలకొన్న నెంతయును వందుదు, నిద్దురవస్థ యెన్నఁడో
తెగుటని సంతతంబును మదిం దలపోయుదు నేమి సేయుదున్‌?
207
సీ. తనయొ ప్పెదురఁ గన్నఁ దగిలి యెవ్వరికైన | మలఁగి క్రమ్మఱఁ జూడవలయువాఁడు,
తన వర్తనము విన్న మునిజనంబులకైన | నలవరించికొనంగవలయువాఁడు,
తన బంటుతన మాజిఁ గనిన మార్తురకైన | బలుమాఱు నగ్గింపవలయువాఁడు,
తన వితరణ కేళి వినినఁ గల్పకతరు | వులకైనఁ దలయూఁపవలయువాడు.
 
తే. నకులుఁ డొరులకు నశ్వశిక్షకుఁడుగాఁగ | నగునె యాతని దుస్థ్సితి యనుదినంబుఁ
గాంచి కన్నీ రడంచుచుఁ గడవరాని | దైవఘటనకు నొత్తుఁ జిత్తంబులోన.
208
శా. ఆ రూపం బవికార, మా భుజబలం బత్యంత నిర్గర్వ, మా
శూరత్వంబు దయారసానుగత, మా శుంభత్క్రియాజ్ఞాన మా
ర్యారంభ ప్రతికూల వాదరహితం, బా యీఁ గి సన్మాన వి
స్తారోదాత్తము మాద్రి పిన్నకొడు కేతన్మాత్రుఁడే చూడఁగన్‌?
209
క. సుకుమారుఁ డతఁడు గోపా | లకవృత్తి వహించి యడవులం గ్రుమ్మరుచు
న్కికి నాక కాదు పగవా | రికినైనను నకట! మన మెరియదే వగలన్‌?
210
ఉ. ఏనును మీరుఁ గానలకు నేగునెడ న్ననుఁ జేరి యెంతయున్‌
దీనత దోఁపఁ గుంతి సహదేవుని నిల్లడపెట్టి నాకు ‘న
మ్మా! నిను నమ్మి చాల విషమంబగు నివ్వనవాస మీతఁడుం
బూనఁగ నియ్యకొంటి’ నని బోరన నశ్రులు గ్రమ్ముచుండఁగన్‌.
211
వ. మఱియును. 212
చ. ‘కడుఁ బసిబిడ్డ వీఁ; డొకటి కాదవునా నెఱుఁగండు; ముంద రె
య్యెడ నొకపా టెఱుంగఁ; డెద యెంతయుఁ గోమల; మెప్పుడైన నేఁ
గుడువఁగఁ బిల్తుఁగాని తనకుం గల యాఁకటిప్రొ ద్దెఱుంగఁ డీ
కొడు కిటు పోకకు న్మనము గుందెడు; ని న్గని యూఱడిల్లెడున్‌.
213
తే. ఎప్పు డెయ్యెడ నేమిట నెట్టు లరయ | వలసె నమ్మెయి నారయు మలసి డస్సి
నొచ్చియైనను నేమఱ కిచ్చఁ దలఁచి | తడవి నాచేత దీవన వడయు మమ్మ!’
214
వ. అని యప్పగించె; నేనును వనవాసకాలంబున నానేర్చు విధంబున మీకు నెల్లను గారామైన తమ్ముని నమ్మెయిం బరికించికొని వచ్చితి; నిపు డజ్ఞాతవాసాయాసితుండగు నతని నాకు ననుసరింప వెరవు గామిం జేసి చేయునది లేక చింతిల్లుచున్నదాన; నా తెఱంగు వినుము. 215
సీ. ద్రుపద భూవిభుఁడు పుత్త్రులకంటె నెంతయుఁ | బెంపు సేయుచు గారవింపఁ బెరిఁగి,
కుంతీమహాదేవి కోదండ్ర లోపల | నగ్గలంబుగఁ గొనియాడఁబరఁగి,
ప్రాణంబులకు నెల్లఁ బ్రాణంబుగా మీరు | నెయ్యంబు తియ్యంబు నెఱప నడచి,
మదిఁ దల్లిదండ్రుల మాఱుగాఁ గొని జను | లనిశంబు భక్తి సేయంగ నెగడి
 
తే. రూపగుణ విక్రమంబుల రూఢికెక్కు | నట్టి కొడుకులఁ గని భరతాన్వయంబు
నందు నా యిల్ల యిల్లుగా నతిశయిల్లి | తగవుమై బాంధవులచేతఁ బొగడు వడసి.
216
మ. వినుతింపందగు రాజసూయమునఁ బృథ్వీదేవతా కోటికె
ల్లను సంతృప్తి యొనర్చి, వారి దయఁ గళ్యాణాత్మనై, పుణ్యవ
ర్తన పాండుక్షితిపాలు కోడ లనఁగా రాజన్యమాన్యప్రియాం
గనలందెల్లఁ బొగడ్తఁగంటి నతిలోకంబైన మీ మన్ననన్‌.
217
ఉ. ఏను మనంబు పెంపు సెడి యిప్పుడు నీచతరప్రకారముం
బూని నికృష్టనై యుదర పోషణకై తగవేది యెంతయున్‌
దీనతఁ బొంది యిమ్మెయి సుదేష్ణ పనుల్‌ గనుసన్నఁ జేయుచున్‌
హీనత నున్కి మీకు వగపేమియుఁ జేయద యేమి సేయుదున్‌?
218
క. పని పంపఁగాని యొకతకుఁ | బనిసేయ నెఱుంగ; నన్నుఁ బనిగొనునెడఁ బాం
డుని యగ్రమహిషి గొంకుచుఁ | బనిగఱపెడు చందమునన పనుచుటెఱుఁగవే?
219
ఉ. ఒల్లరు రాజుదేవులును నొడ్డులు రాచిన చందనంబు; మే
నెల్లఁ జెమర్పఁగా నలయ కేను శ్రమంపడి నిల్చి నిల్చి య
ల్లల్లన మార్దవం బొనరునట్లుగ నెట్టకునేని రాచి మీ
తల్లికి భక్తిఁ బెట్టెడు విధంబునఁ బెట్టుదు; బ్రహ్మఁ దిట్టుదున్‌.
220
ఉ. నున్నఁదనంబుగా నలుఁగు నూఱియుఁ జందన మట్లు రాచియుం
బన్నుగఁ గ్రొత్తలైన కలపంబులు గూర్చియు నా సుదేష్ణకుం
గన్నుల సన్నలం బనులు గైకొని వారక చేయుచుండుటన్‌
ము న్నటులున్న పాణితలముల్‌ బలు కాయలు గాచెఁ జూచితే!
221
క. అనుచుం దొరఁగెడు నశ్రుల | మునిఁగినమో మతని వక్షమునఁ జేర్చిన న
వ్వనిత యవస్థయ తాల్చుచు | ననిలసుతుం డడలె డెంద మలమటఁ బొందన్‌.
222
తే. అట్టి యెడఁ దన్నుఁ దాన యూరార్చి కొనుచు | నంబుజానన నెమ్మొగ మల్లఁ దుడిచి.
యనునయించి తత్కరములు దనమొగంబుఁ | గదియఁ జేర్చుచు నిట్టూర్పుగాడ్పునిగుడ.
223
వ. చింతాక్రాంతుండైన కౌంతేయునకు నయ్యింతి యిట్లనియె. 224
తే. ‘ఇందఱకు నిన్నిభంగుల నిడుమ గుడువ | వలసె ధర్మతనూభవువలనఁ జేసి,
దాయ లొడ్డిన మాయ జూదంపుటురులఁ | బడి కులంబున కాతఁ డిప్పాటు దెచ్చె.
225
ఉ. అక్కట! మోసపోయి యడియాసలఁ జావక యున్నదాన; ము
న్కొక్కెడ నే దురంతదురితోత్కట బాధలఁ బెట్టియున్న నా
కెక్కడి దుఃఖశాంతి గడయెయ్దుట యెమ్మెయిఁ గల్గ నేర్చు? మీ
ముక్కున నూర్పు గల్గ నొక మూర్ఖునిచేఁ బడితిన్‌ సభాస్థలిన్‌.
226
క. మీ రేమి సేయుదురు? దై | వారంభము గాక శుభము నశుభంబును సం
సారులకుం దమ తఱి నని | వారణఁ బొందంగ మాన్పవచ్చునె? దానిన్‌.
227
ఉ. కావున మీర లభ్యుదయ గౌరవ మొందుట యాత్మఁ గోరి యే
నే విధినైన నాపదల కెల్లను నోర్చెద; దాని కేమి! యీ
కావరమైన కీచకుఁడు కామనిపీడితుఁడై యలంతులం
బోవక యేచి పట్టుకొనఁ బోయినఁ దూలెదఁగాక యిమ్మెయిన్‌.
228
తే. వానిఁ దెగఁ జూడవైతేని వాయుపుత్ర | నీవు గనుఁగొన నురినైన, నీరనైన,
నగ్నినైన, విషంబున నైన, నేను | మేను దొఱఁగుదు నెట్టు; నీ యాన సుమ్ము !’
229
వ. అనిన వృకోదరుండు చిఱునవ్వు నవ్వుచు నిట్లనియె. 230
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )