| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ద్వితీయాశ్వాసము |
| చ. |
‘జలజదళాక్షి! కీచకునిఁ జంపుట కిమ్మెయి ముట్టఁబల్క గా వలయునె? యేను జూడ ననివారణ నిన్నుఁ బరాభవించి వాఁ డిల మన, నింక నాండ్రకును నెవ్వరు భంగము నీఁగఁజాలువా? రలఘు మదీయ బాహుబల మప్పుడు చూపనితప్పు చాలదే? |
231 |
| తే. |
ఎల్లి యెల్ల విధంబుల నెందుఁజొచ్చె | నేని, నా ధర్మ తనయుండు దాన వచ్చి యడ్డపడెనేని నీవ పెంపారు కరుణఁ | గాచితేని నాచేఁ బడుఁ గీచకుండు. |
232 |
| వ. | వానిదెసం జింత యావంత వలవ; దమ్మాటలు విడువు’ మని యూఱడిల్లం బలికి, దుర్దశల నలందురు నవ్వెలంది డెందంబుకుందు వాపం దలంచి యిట్లనియె. | 233 |
| సీ. |
‘చ్యవనుని వాంఛకు సంయాతినందన | యిడుమలఁ గుడువదె యడవిలోన? రాఘవుతోడ నరణ్యవాసము చేసి | సంతాప మందదె జనకతనయ? కుంభసంభవునకై ఘోరదుర్గముల లో | పాముద్ర యలజడి పాలుగాదె? నలునిపిఱుందఁ గానల కేఁగి దమయంతి | మనుజులు పడనియుమ్మలిక పడదె? |
|
| తే. |
వారు సైరణచేసి దుర్వారమైన | నిరతిశయ దుఃఖభారంబు నిస్తరించి సౌఖ్యమొందరె? నీవు నా చందమునన | యాపదల కోర్చి సంపద లనుభవింపు. |
234 |
| వ. | దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని సైంధవ ప్రముఖంబగు దుష్ట లోకంబు నధోలోకంబున కనుచునంతకు మదీయాంతరంగంబు చింతాభర భుగ్నంబును, నవమాన పంకమగ్నంబును, గోపోద్విగ్నంబును నై వేగిరపడుచున్నయది; ధార్తరాష్ట్రులకుం గాలావసానం బైనయట్లు మనకు సమయ కాలావసానం బయ్యె; నజ్ఞాత వాసంబునకుం జొచ్చి పదునొండు నెలలు సని పండ్రెండవనెల వర్తిల్లుచున్నది. దీని కొఱంత దీఱిన నీదు వంతయుం దీఱు; నూఱడిల్లి యుండుము; సింహబలుండు నిన్నుఁ బరిభవించి మై మైతోన యునికింజేసి యెల్లియుం జెనక వచ్చు; నీవునుం గ్రమంబున నొడంబడుట భావించికొని వానికి నర్తనశాల సంకేత ప్రదేశంబుగాఁ జెప్పి యొంటిమెయిం జనుదేర నియమింపుము; వాఁడు వచ్చిన నా సొబగునిం దెగఁజూచి, నీకుం జూపి నీ చిత్తంబు వడసెద; నిత్తెఱంగు దప్ప నొండు విధంబు గర్జంబుగా; దిదియె నిశ్చయం; బిట్ల చేయు వార; మిమ్మాటలవలనం దప్పవు గాని, వేగుచున్నయది; జనులు మేలుకాంచి మనలం గాంచి రేని వంచన బయలు పడినం గార్యంబు దప్పుఁ; గీచక వధంబునకుం బూనిన నా మనోరథంబు దుది ముట్టవలయు; నిజశయన స్థానంబునకుం బొ’ మ్మని శయ్యాతలంబు విడిచి యత్తన్విం దఱిమి కొన్ని యడుగు లనిచి, మరలి మారుతాత్మజుండు కలుషితాత్ముండగుచు సెజ్జకు వచ్చె; నచ్చెలువయుం దన నిద్రించు నెడకుం బోయి పర్యంక భాగంబునం దనువు వైచి, యంకిలి దేఱని దెందంబునఁ గొందలంబుతోడి నిశ్చయంబున నిద్రంబొరయని కనుదోయి మొగిడ్చి యుండె; నంత. | 235 |