ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
ప్రభాతకాల వర్ణనము (ఇది మూలమునందు లేదు)
తే. ద్రుపద నందన పరిభవ దుఃఖమునకు | నుల్లమున దురపిల్లుచు నున్న సరసి
వేఁడి నిట్టూర్పులో యన వెడలెఁ గ్రొత్త | తావి మూతులు విచ్చు నెత్తమ్మివిరుల.
236
క. విచ్చెం దిమిరము; కాఁపులు | వచ్చె మధుపకులము లబ్జవనముల; కురులం
జొచ్చె విరులు తరులతికల; | నిచ్చె రథాంగములు వంత యెల్లఁ దొగలకున్‌.
237
సీ. పెనఁకువఁ దనిసిన తనువు లొండొంటితోఁ | గీలించి నిద్రించి మేలుకాంచి,
తరుణులుఁ బతులు వాతాయనంబుల నల్లఁ | బొలయు వేఁబోకటి మలయపవను
నింపారు చోఁకున నిగురొత్తు చిత్తంబు | లెలసి యొండొరులపైఁ బొలయు చూడ్కు
లాదట నుపకరణావళి వెడ వెడ | యాదరించుచు రాగ మడరఁ దొడరి
 
తే. కేళి సలిపిరి భవన దీర్ఘికల తమ్మి | విరుల నెత్తావి నెనయంగ బెరసి చెమట
పొడము మేనుల తనికంపు ప్రోచి తఱచు | టూర్పుగాడ్పుల పరిమళ ముల్లసిల్ల.
238
తే. రాలియున్న పుష్పప్రకరము విదిర్చి | చెన్నుగా నున్న సేసిన సెజ్జ యనఁగ
వేగుటయుఁ జుక్కలన్నియు విరిసి విశద | భాతిఁ జెలువొందెఁ జూడ నంబరతలంబు.
239
వ. తదనంతరంబ యల్ల నల్లన తెఱపి యిచ్చి యవులవులం జను నంధకారంబు దూరంబుల యందును లేకునికి వలనం గడళ్ళప్పళించి నెరసి విరసినం బొలుచు కలుకట్టలుంబోని దిక్తటంబులును, దమపాసిన కందువలు రోసి యెత్తిన మెడలను బచరించిన చూడ్కులు వేడ్కలం గ్రందైన డెందంబులుం దమము పాసినం గలిగి మెలంగుచు నొండొంటి బిట్టుగాంచి యొదవు సమ్మదంబునం బొదలు మేనులు బెరయించి పరమానందం బునం జొక్కుచు జక్కవకవలు గలసి పొలసి నలిరేఁగి చెలఁగుచు రేయింటి యాఁకటి పెల్లునం గొదగొని కమిచి చంచువులం దిగిచి త్రుంచి యానుచు నిక్కడక్కడఁ బఱచినం జిక్కువడి యున్న మృణాల శకలంబుల వలన బాల చంద్ర శతాభిరామంబులగు శంభు జలమూర్తి విశేషంబులంబోని సరోవరంబులును, జీఁకటి వాసినం బ్రభాతం బను వింత మానిసి మెలంగి ముసుంగు వుచ్చినట్లు మేలుకని యెఱకలు పొదల విదిర్చి కూర్చికొని కలగొనం బలుకు పులుఁగుల యెలుంగుల వలన నొండొంటిం దెలుపుకరణి నొప్పు ధరణీరుహంబులును, బరఁగు నరుణోదయ రాగపటలంబు నెనయు కెంజాయ రంజిల్ల వికసిల్లు రక్తారవిందంబుల దందడి నెగసి చరించు చంచరీకంబుల యెఱకల నెఱుల గిఱికొని క్రొత్తయగు కాంతి ప్రవాహంబులం గడలుకొల్పు పుప్పొళ్ళు డుల్చి రాల్చుచుం బొలయు మలయానిలంబునం గ్రాలు మవ్వంపుఁదీవలఁ గడివోయి తొరఁగిన విరుల వలన మీనకేతన పురాతన బాణశాలలం బోని లతా మండపంబులును, మొగిడియు జనంబు సంధ్యాంజలిపుటకరణంబుల ననుకరించు విధంబునం దర్శనీయంబులగు కుముద వనంబులును, నేమేని నెపంబున నొండొరుల మేలుకొలుపు రమణ రమణీ జనంబుల నర్మాలాపంబులం బెరయు దరహాసంబుల కాంతిఁ దెలుపెక్కునట్లు వెలరారు దీపంబులును, మునుకడ వచ్చి యెఱుక సేయమికి వాతాయన పవనుని పయిం బుట్టిన యలుక విధంబున వేగుఁబోకట నంకురించు మదంబునఁ గెంపు గదురుట నిద్రలేమినని శంకింపక యింపునం గదియు విదగ్ధ విటజనంబుల మనంబులం దిగుచు లలనాలోచనంబులును, రేపకడ వనలక్ష్మి పురశ్రీ నలంకరించు వడువున నెడపడక యెల్లెడల నిగుడు విభాత కుసుమ కదంబ పరిమళంబును నై యున్నంత. 240
సీ. నీరజాకరములు నిష్ఠమైఁ జేసిన | భవ్యతపంబుల ఫల మనంగ,
దివసముఖాభినందిత చక్రయుగ్మకం | బుల యనురాగంపుఁబ్రో వనంగ,
హరిహరబ్రహ్మ మహానుభావంబు లొ | క్కటి గాఁగఁ గరఁగిన గట్టి యనఁగ,
నతుల వేదత్రయ లతికాచయము పెను | పొందఁ బుట్టెడు మూలకంద మనఁగ
 
తే. నఖిల జగముల కందెఱ యగుచు జన స | మాజ కరపుట హృదయ సరోజములకు
ముకుళనంబును జృంభణంబును నొనర్చి | భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగె.
241
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )