ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
కీచకుఁడు ద్రౌపది నియ్యకొలుప యత్నించుట (సం. 4-21-7)
వ. ఇట్లు సూర్యోదయ మగుటయు సమయ సముచిత కరణీయంబులు వేగిరంబ నడపి వేగిరపాటుతో సింగారంబు సేసికొని సింహబలుండు. 242
క. తన మదిఁ గదిరిన తమకం | బునఁ జిడిముడిపడుచు ద్రుపదపుత్రికపై నూ
నిన వేడ్క దిగువ నొకటియుఁ | గనుఁగొన విన లేక మదనకంపితుఁ డగుచున్‌.
243
వ. అతిత్వరితంబ సుదేష్ణ మందిరంబున కరుగుచు నంతరంగంబున. 244
ఉ. ‘చయ్యన నేఁగి యంబుజ విశాల విలోచనఁ గాంచి ప్రీతిమై
నయ్యెడ నేకతంబ హృదయం బలరం దఁగఁబల్కి యొక్కమై
నియ్యకొనంగఁ జేసి యెలయించెద, నిక్కకుఁ దార్చి, నేర్పునన్‌
శయ్యకుఁ దెచ్చెదం గుసుమసాయకు పూనికి నేఁడ తీర్చెదన్‌’.
245
క. అని యువ్విళ్లూరుచు వెసఁ | జని కేకయ రాజపుత్రి సదనంబున న
య్యనిమిషచారువిలోచన | యనురూప విధాన నిరతయై యుండంగన్‌.
246
చ. కనుఁగొని యప్డు గ్రొత్తయగు కౌతుకవృత్తి మునింగి పల్లటి
ల్లిన ధృతితోఁ గ్రమం బరయలేని మనంబు చలింప నచ్చటన్‌
జను లెడ యౌటఁ గాంచు నెఱి సాలక గ్రక్కున నింతిఁ జేరఁగాఁ
జనియె విధాతృలుబ్ధకవశంబునఁ బోవు మృగంబు చాడ్పునన్‌.
247
క. చనుటయు ద్రౌపది యతనిం | గనియుం గానని విధంబు గైకొని చిత్తం
బున బెదరక తనముందటి | పనివెరవున నుండె భీముపలుకుల యూఁతన్‌.
248
వ. అట్టియెడ. 249
సీ. ఎవ్వరితోనైన నెలుఁగెత్తి యొక్కింత | పనిలేని వెంగలి పలుకు వలుకు;
మట్టియ లొండొంటి బిట్టుదాఁకఁగ నేల | నందంద మునిగాళ్ళ నప్పళించుఁ;
గడువికారంబుగా నొడలెల్ల విఱుచుచు | మలఁగి రిత్తకు రిత్త సెలఁగి నవ్వుఁ;
దాళంబుగాఁ గరతలమునఁ బెలుచఁ గం | బంబు వ్రేయుచు వెడపాట పాడు;
 
తే. మలయు, నంతంతఁ జేరువఁ బొలయు, నింతి | తన్ను చూడమి కెంతయుఁ దల్లడిల్లు;
నిక్కడక్కడఁబడుఁ, దగు లినుమడింపఁ | జూచు నత్తన్విఁ బొరిఁబొరిఁ గీచకుండు.
250
వ. ఇట్లు బహుప్రకారంబులగు దుర్విలాసంబులు సేయుచు నద్దురాత్ముండు ద్రుపదనందన డాయంబోయి. 251
ఉ. ‘భాగ్యము గాదె నీ చరణపద్మము లెప్పుడుఁ జేరి కొల్వఁగా
యోగ్యత గల్గెనేని, నను నొక్కని నొల్లవొ? కామసౌఖ్యవై
రాగ్యము నీ మనంబునఁ దిరంబొ? నిజం బెఱుఁగంగఁ జెప్పు; సౌ
భాగ్యము గుందునే మగలపై నొక యించుక చూడ్కి నిల్పినన్‌.
252
ఉ. ఆలము సేసి నా తగుల మాఱడిపుచ్చఁగ నేల బేల! న
న్నేలి యనంత భోగముల నిచ్చమెయిన్‌ విహరింపు నిత్యల
క్ష్మీలతికాలవాలమగు జీవనమంతయు నీ మొగంబకాఁ
బాలన సేయు మిప్పురము భామిను లెల్లను నిన్నుఁ గొల్వఁగన్‌.
253
ఉ. రాజుల నెల్ల నుగ్రసమరంబుల వ్రేల్మిడి నేర్చి పేర్చి యీ
భూజనకోటి నాదగు విభుత్వ సమగ్రత నాదరింప వి
భ్రాజిత రాజ్యతంత్రములు పాలన సేయుదు నేన; వీటికిన్‌
రా జనఁగా నెపం బిడి విరాటునకుం దగఁ గూడు వెట్టుదున్‌.
254
వ. కావున. 255
క. నీ వొకత వేల? యిలఁ బది | వేవుర నే వలచి పట్ట వెదకిన నడ్డం
బై వచ్చి వలదు నా నిం | దేవాఁడు మగండు? దీని నెఱుఁగవు కంటే!
256
చ. విరటుఁడు సూచుచుండ నిను వేవుర ముందట నట్లు ద్రోవ నొ
క్కరుఁడును గాదుగూడ దనఁగల్గెనె? పోటరులైన భర్త లే
వురు గలరంటి; వారి యలవుం జలముం గడగంటి; నింక నె
వ్వరు గల? రెట్లు దప్పె? దనివారణఁ బట్టెద నెందుఁ జొచ్చినన్‌.’
257
వ. అనిన నవ్వెలంది ‘వీఁడు దమకించి యున్నవాడు; నా యంత్రించు మాటలకు మున్న కదియంబడినఁ గర్జంబు దప్పు’ నని విచారించి. 258
తే. బహువిధంబుల నమ్మెయిఁ బలుకు నతని | పలుకు లేర్పడ విని, మెత్తఁబడినయట్లు
సుభగ మెయివడి చూపుగాఁ జూచి తనదు | హృదయ మెఱిఁగించు తెఱఁగున నిట్టులనియె.
259
చ. ‘వలదని యెంత సెప్పినను వావిరివై కడు వేగపాటుమైఁ
బలుమఱు నెల్లెడం దొడరఁబాఱెదు; నీ హృదయంబు నట్లకాఁ
దలఁపు మనోజు తూపులకుఁ దక్కటి చిత్తములుం; గడంగి వి
చ్చలవిడిసేఁత గర్జమె? విచారము గోర్కికిఁ గాని వావియే?
260
క. మగ లడఁకువ నుండక తమ | తగులమ పాటింతు; రెట్టి తగులం బైనన్‌
మగువల యెడలన యడఁగుం | దగవు విడిచి యడిచిపడరు ధైర్యము పేర్మిన్‌.
261
ఆ. ఇట్టు లగుట యెఱిఁగి యెల్లభంగుల రహ | స్యంబు గోలుపోనియట్లు గాఁగ
నడరు నీదు కోర్కి కనురూప మెట్దిది | యట్టి భోగభంగి ననుభవింపు.’
262
చ. అనవుడుఁ గీచకుండు హృదయంబునఁ బొంగి లతాంగితోడ ని
ట్లను ‘ధృతిఁ గోలుపుచ్చెఁ గుసుమాయుధుఁ; డేటి విచార; మిట్టు లేఁ
ప నగునె? యైన నీదయిన పం పెదఁ గైకొని చేయువాఁడ; నే
యనువున నెప్పు డెయ్యెడ నిజాభిమతం బొడఁగూర్తు చెప్పుమా!’
263
క. అని పలికినఁ బాంచాలియుఁ | దన యురులం గీచకుండు దగులుట భావం
బున నిశ్చయించి యిట్లను | ననురాగాయత్తచిత్త యైనది వోలెన్‌.
264
ఉ. ‘ఉత్తర లోనుగాఁ గల పయోజముఖుల్‌ పగలెల్లఁ బ్రీతితో
నృత్తముఁ జేసి పోవ కమనీయరహస్యవిధిన్‌ నిశీథినీ
వృత్తముఁ గోరువారలకు వేడ్కకుఁ బట్టగుచుండు నా గృహం;
బుత్తమ మిత్తెఱంగునకు నొంటిమెయిం దగ నీవు వచ్చినన్‌.’
265
క. అనిన నతఁడు వికసిల్లుచు | ‘నను నెమ్మెయి నేలుకొనిన నళినానన! నీ
యనుమతి సేయనె? యొక్కఁడఁ | జనుదెంచెద నేఁటి రాత్రి సమ్మదలీలన్‌.
266
తే. ఇదియ నిశ్చయ; మిమ్మాట వదలకుండు’ | మనిన ‘నీ వొక్కరుండవ యరుగుదేర
వలయు; లేకున్న నయ్యెడ నిలుచుదానఁ | గానుజూ నిక్కువం’ బని పూని పలికి.
267
క. ‘మన మియ్యెడఁ బెద్దయుఁ బ్రొ | ద్దనుమానములేక మాటలాడుట దగ; దీ
వును బొ, మ్మేనును నాదగు | పనికేఁగెద’ ననియెఁ గమలపత్రేక్షణయున్‌.’
268
చ. సమయము నిర్ణయింప విని చంద్రనిభానన పల్కులప్డు చి
త్తమునకు నింపుఁబెంపఁగ ముదంబునఁ గీచకముఖ్యుఁ డాత్మగే
హమునకుఁ బోయె; నమ్ముదిత యచ్చట వెండియుఁ బ్రస్తుతక్రియా
సముచిత వర్తనంబుఁ దగఁ జల్పి మహానసశాలలోనికిన్‌.
269
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )