ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
ద్రౌపది భీమునితోఁ గీచకుఁడు నర్తనశాలకు రాఁబోవుటం జెప్పుట (సం. 4-21-25)
క. చని వెడ వికసిల్లెడు నా | ననపద్మముతోడ ననిలనందనునకు ని
ట్లనియెఁ జతురోక్తిరీతి న | తని గూఢక్రోధవహ్ని దరికొల్పంగన్‌.
270
క. ‘నా కొఱఁతఁ దీర్చివచ్చితి; | నీ కొఱఁతయ యింక; సూతునిం దెగ జూడన్‌
లోకము వంచింపను దగు | చీఁకటి రే యొదవె; నేమి చేసెదొ చెపుమా?’
271
వ. అనిన విని దరహసిత వదనుం డగుచు వృకోదరుం డిట్లనియె. 272
క. ‘నన్నడుగ నేల? నీవును | నన్నీచుఁడు నేమి మాటలాడితి? రది నా
కున్నట్టు లెఱుఁగఁ జెప్పుము | ని న్నే మెచ్చించువాఁడ నీరజవదనా!‘
273
వ. అనినఁ బాంచాలి సుదేష్ణ మందిరంబునం దా నుచితాచరణంబున నునికియు, సింహబలుండు సింగారించుకొని వచ్చుటయు, రేయింటి మాటలవలనం దాను బెదరమియు, వాఁడు సామ దాన భేద దండంబులు సూపి పలుకుటయు, దానికి మెయికోలు భావించికొని క్రమంబునం దగిన సంభాణంబు సేసి, నాట్యమండపంబు సంకేతస్థలంబుగాఁజెప్పి, యొక్కరుండవచ్చువాఁడవని నియమించుటయు, నద్దురా త్ముండు ప్రముదితాత్ముండగుచు రాత్రిసమయంబున నయ్యెడకు నొంటిమెయిం జనుదెంచువాఁడై చనుటయుఁ దెలియంజెప్పిన, నతండు పరమాహ్లాదంబునంబొంది. 274
శా. ‘క్రోధం బప్రతికారమై హృదయముం గుందింప నత్యంత చిం
తాధూతాత్ముఁడనైన నాకుఁ బరమోత్సాహంబు సంధిల్ల దు
స్సాధం బైన విరుద్ధ కార్య మిటు లాసన్నంబుగా సంఘటిం
తే ధర్మాత్మజుఁ డిచ్చమెచ్చఁ బగ సాధింపంగఁ గాన్పల్పమే?’
275
వ. అని పలికి కొండొక విచారించి. 276
క. ‘వెఱవక సంకేతించిన | తెఱఁగున నయ్యెడకు నరుగుదెంచునొకో! కొం
దఱఁ దెచ్చునొకో! వెడఁగై | యఱిముఱి వెలిపుచ్చునొకొ రహస్యం బెల్లన్‌!
277
ఉ. అట్టిద యేల చేయు? ననయంబు నయం బొడఁగూడఁ బల్కి నీ
విట్టి తెఱంగు సేయుమని యేర్పడఁ జెప్పిన దాని కత్తఱిం
బుట్టిన సంతసంబు ననువుం బరికించితికాదె! యింక ని
ట్ట ట్టనఁ డెట్టులైన హృదయంబున నెక్కడి శంక వానికిన్‌.
278
ఉ. వచ్చు, మదాంధవృత్తి ననివారణ నొక్కఁడ నాట్యశాలకుం
జొచ్చు, నవశ్యమున్‌ వెదకి చూచి ననుం గని యప్డు సంగరం
బిచ్చు, మదీయ బాహుబల హీనబలుండయి నీకుఁబ్రీతిగాఁ
జచ్చు. నసంశయం బిది; విచారము లన్నియు నింక నేటికిన్‌?’
279
వ. అని నిశ్చయించి వృకోదరుండు వెండియు నిట్లనియె. 280
మ. ‘బలియుం డా సొబగుండు భావభవదర్పభ్రాంతుఁడై వచ్చి ని
శ్చల సర్వాంగత నున్న న న్నరసి నీ చందంబు గాకున్న నా
కులతం బొందెడు, నపు మండపము సంక్షోభింపఁగా నేతుఁ గ
ట్టలుకన్‌ బెబ్బులిఁ గోలవ్రేచినటు లుగ్రాకార మేపారఁగన్‌.
281
క. ఎఱిఁగి పిఱుసనిన వెసఁ బై | కుఱుకుదు సాళువము గాకి నొడిసిన భంగిన్‌
వెఱచఱవం బొదువుదుఁ బఱి | పఱిసేయుదు నీదు పూన్కి పారం బెయిదన్‌.
282
ఆ. నాదు బాహుబలమునకు మాఱుకొనఁజాలు | భుజబలంబుగలిగి పోక చిక్కఁ
బెనఁగి నన్నుఁ గొంత కినియింప నోపెడు | చందమైన వినుము సరసిజాక్షి!
283
మ. అవనీచక్రము సంచలింపఁగ, దివం బల్లాడ, నాశాచయం
బవధూతంబుగ, గోత్రశైలనికరం బాకంపముం బొంద, న
ర్ణవముల్‌ ఘూర్ణనమొందఁ, గ్రోధము గృతార్థత్వంబు నొందించి, చి
త్రవధప్రౌఢి వహించి సూతునకు రౌద్రం బేర్పడం జూపుదున్‌.’
284
వ. అనినం బాంచాలి సంచలితస్వాంతయై, నిజాంతర్గతంబున ‘నితని తీవ్రక్రోధంబు గుప్తసాధనంబునకు బాధకంబగు’ నని బోధింపం దలంచి యిట్లనియె. 285
ఉ. ‘ఒవ్వనివారు నవ్వ, మహిమోదధి ధర్మసుతుండు దీనికిన్‌
నెవ్వగఁబొంద, భూజనులు నింద యొనర్వఁగ నే నొనర్చు నీ
చివ్వకు నీవు నల్కమెయిఁ జేసెన యాపని గూఢవృత్తికిన్‌
దవ్వగునేని నా యభిమతం బొడఁ గూడియు నిష్ఫలంబగున్‌
286
క. కావున వంచన బాహిర | పోవక యుండంగ మన రిపుం బరిమార్పం
గావచ్చునేని నట్టిద | నా వల; పటుగాక తక్కినను వలదు సుమీ!’
287
వ. అనిన విని ద్రుపదనందనకుం బాండునందనుం డిట్లనియె. 288
చ. ‘మదమునఁ గీచకాగ్రజుఁడు మార్కొని నిల్చిన వీఁక మైమెయిం
గదిసితి మేని నప్పుడు ప్రకాశరహస్యవిభేదబుద్ధి నా
కొదవునె? యైన నేఁ దలఁచి యోపినభంగి నిగూఢవృత్తిమైఁ
బదిలము గల్గి తిన్నని యుపాయమునం దెగఁజూతు నాతనిన్‌.’
289
క. అనవుడు ‘జయలక్ష్మిం జే | కొను’ మని దీవించి, ‘యింతకుం గేకయ నం
దన నన్నుఁ దడవుఁ’ దడయం | జన దియ్యెడ’నని లతాంగి చనియెం బ్రీతిన్‌.
290
వ. మారుతసుతుండును గృతనిశ్చయుండై యుండె; నటఁ గీచకుండు కందర్పదర్పగోచరుండై పరిజనంబుల వంచించి యేకాంతస్థలంబున. 291
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )