| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
వామాక్షి రుచిర లావణ్యంబు భావించుఁ | దన్వంగి రూపు చిత్తమున నిలుపుఁ, గంబుకంధరచెన్ను కైవడి తలపోయు | నంగన సౌకుమార్యముఁ దలంచు, భామిని సహజ విభ్రమ మెదఁ గీలించుఁ | బడఁతి చెయ్వులు మదిఁ బట్టుకొలుపు, మానిని గరువంపు మాటపొం దూహించు | దళితాబ్జముఖి తిన్నఁదనము మెచ్చు, |
|
| తే. |
నడరి కోర్కులు చిఱ్ఱుముఱ్ఱాడ వెడఁగు | పడిన యుల్లంబు పట్టునఁ బఱుపఁ దనకు వశముగాకున్న నెంతయు వంతఁబొందుఁ |, జింత యెసకంబు వడిగొని చిక్కువఱుప. |
292 |
| చ. |
తలరు, నలందురున్, నవయుఁ, దాపభరంబున వెచ్చనూర్చు, మే నలయఁగ నొల్లఁబోవు, వెగడందుఁ, గలంగుఁ, బరిభ్రమించుఁ, గొం దలపడుఁ, దల్లడం బడరి ధైర్యము దూలిన బెగ్గడిల్లు, వి చ్చలవిడిఁ బేర్చు, నెవ్వగల సందడి డెందము గంది చేడ్పడున్. |
293 |
| వ. | ఇవ్విధంబున మదనవేదనా దూయమాన మానసుం డగుచు నిట్లని వితర్కించు. | 294 |
| సీ. |
‘పడఁతి నన్నూఱడఁ బలికిన భంగిన | నిచ్చమై నిక్కకు వచ్చునొక్కొ! వచ్చి తొల్లిటియట్ల వడిఁ ద్రోచిపోవక | పొలఁతి యింపెసలారఁ బొందునొక్కొ! తలపోఁతఁ గలిగి యమ్మెలఁత వచ్చుటకు నొం | డొక వింత పుట్టకయుండునొక్కొ! గంధర్వు లేవురు గలరని చెప్పె న | న్నెలఁతుక మాటలు నిక్కమొక్కొ! |
|
| తే. |
తెఱవ చిడిముడిపాటు సుదేష్ణ యెఱిఁగి | వేడ్కఁ బనిపంచు టుడిగి రా విడుచునొక్కొ! మదనుఁ డింతికి నొజ్జయై మతకములును | నదను నెఱిఁగించి నాకడ కనుచునొక్కొ! |
295 |
| ఉ. |
నిక్కమ పోలె నప్పుడొక నేరిమిమై ననుఁ ద్రోచిపుచ్చఁగా నక్కమలాక్షి పొందు దగ నాడి, తుదిన్ నిజమేది, నేఁటి రే యిక్కకు రాక తక్కిన, సహించునె నన్ మరుఁ? డట్టులైన నా కెక్కడిప్రాణ, మేటితను, వెయ్యది నిల్కడ, యేమిసేయుదున్? |
296 |
| క. |
అట్టేల రాక తక్కుం? | గట్టిఁడియే యా లతాంగి? కామాతురు నన్ బెట్టి యచట దానికి మన | సెట్టు నిలుచుఁ? దగవు విడువ నెట్టులు నేర్చున్? |
297 |
| ఉ. |
దానికి నేటి నిక్కము? వృథా పరితాపముదక్కి, బాసమైఁ బూనికి డిగ్గఁద్రావి, వెసఁబోయెద నిప్పుడ; పోయి ముట్టి య బ్జాననఁ బట్టి తెచ్చి హృదయం బలరంగ ననంగతంత్రవి ద్యా నిపుణత్వ మేర్పఱిచెదం; బ్రమదాంబుధి నోలలార్చెదన్. |
298 |
| ఆ. |
అనుచు సంచలించు, నడియాసఁ గ్రమ్మఱఁ | బాసఁ దలఁచి ధృతికిఁ బట్టువెట్ట్టు మరుని కోహటించి యురియాడుఁ, దుదిముట్టఁ | గాన నిశ్చయించుఁ గలఁగుఁ దేఱు. |
299 |
| వ. | మఱియు నక్కోమలివలని ప్రేముడిం దగిలి. | 300 |
| సీ. |
పొడసూపినట్లైన వడిఁబట్ట సమకట్టి | పరికించి కానక బమ్మరించు; మెలఁగినయట్లైన బలికింపఁ దలఁచి,ని | రూపించి లేమి నశ్రులు వహించుఁ; గదిసినయట్లైనఁ గౌఁగిలింపఁ గడంగి | యారసి బొంకైన నలఁత నొందు; నొడఁబడ్డయట్లైన నడరి పైకొనఁజూచి | చెన్నఁటి యగుట నిశ్చేష్టఁ బొరయు; |
|
| తే. |
లలిత వివిధ విహారంబులకు లతాంగి | యెలసి సొలసిన యట్లైన నెలమిఁ గలిసి యభిమతక్రీడ సలుపంగ నప్పళించి | వెదకి రిత్తబయల్ గని విహ్వలించు. |
301 |