| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | ఇట్లు బహుప్రకారంబులగు మన్మథ వికారంబుల కగపడి వెగడంది యమందసంతాపభరితాంతఃకరణుం డగుచు సింహబలుండు పరిచారికాప్రార్థనం జేసి మజ్జన భోజనంబు లొకభంగి నడపినవాఁడై, తదనంతరంబ మనోజనేదనాపనోదనార్థంబు మందిరారామభూమికిం జని తత్ప్రదేశంబున. | 302 |
| చ. |
కమలవనంబుపొంత నునుగా డ్పొకయించుక యాదరించుఁ, జి త్తమునకుఁ దానఁ దల్లడము దన్కుటయుం జని గారవంపుఁజూ తముకడ నిల్చు, నిల్చి యది తాపముఁ బెంచిన లేఁత తీవ జొం పముఁ జొరఁబాఱు నం దలఁత పైకొనినన్ వెడలున్ వెనుంబడున్. |
303 |
| ఆ. |
సుడియుగాలిఁ బువ్వుఁ బొడిఁ దన్నుఁ గప్పునో | యనుచు బెగ్గలించు నగ్గలముగఁ గురియు తేనియలకుఁ గొంకు లతాగుల్మ | తరు సమీపములకు నరిగియరిగి. |
304 |
| వ. | ఇత్తెఱంగున నొక్కయెడనయినను గాలూనక లీలోద్యానంబు కలయం గ్రుమ్మరుచు. | 305 |
| సీ. |
ఇంపైన ప్రియ కాననిచ్చి, నిల్చిన మధు | వాదట నాను మత్తాలివిభునిఁ, జెట్టుపల్ పచరించి చుట్టుఁ గ్రుమ్మరి మనో | రమ నియ్యకొలుపు మరాళవిభుని, ఫలరస మొండొంటి కెలమిఁ జంచుల నిచ్చు | మెయిన చొక్కెడు శుకమిథునములను, గమిఁ బాసి తలిరుజొంపమునకు మెయిమెయిఁ | దాఁకంగఁ జను పికదంపతులను |
|
| తే. |
జూచి చూచి యుల్లంబున నేచి కోర్కు | లడర చిడిముడిపడు, మ్రానుపడు, వెడంగు పడు, వెనుంబడుఁ దల్లడపడు, దురంత | చింతబారికి నగపడు సింహబలుఁడు. |
306 |
| వ. | ఇట్టి వలవంత నిక్కడక్కడ వడిఁ దిరిగి తిరిగి. | 307 |
| క. |
వగ ముట్టికొనినఁ జిత్తము | వెగడొందఁగ మేను గలయ వెమ్మఁగ ధృతి పాఁ తగల నొక తీవయింటికిఁ | దగియుండెడు చంద్రకాంతతల్పము సేరెన్. |
308 |
| క. |
అం దొఱగి కీచకుం డా | యిందీవరనయన నాత్మ నిడి వేడ్కమెయిన్ డెందము చన విచ్చలవిడిఁ | గందర్పుఁడు వెఱ్ఱిఁ జేయఁగా నిట్లనియెన్. |
309 |
| సీ. |
‘కెంగేలుఁ గేలితోఁ గీలించి నెయ్యంపు | మాటలఁ దగు మాఱుమాట లార్తుఁ గుచము లురంబునఁ గుదియించి క్రమమున | నిఱిసిన కౌఁగిట నింపొనర్తు, నంగుళంబుల నల్ల నలకలఁ గబళించి | కెమ్మోవి యాని యెక్కింతుఁ గాయ్వు, మనము మనంబునఁ బెనఁచి కేళికిఁ జొచ్చి | సతిఁ దేల్తు సౌఖ్యరసంపునిట్టఁ, |
|
| తే. |
దనివు మొదలైనఁ జిగురొత్తు తమకమునకుఁ | బ్రాఁకు వెట్టుచు మగుడఁ బైఁబడుచు నింతి వింత భంగుల కెలయించి వెకలిఁజేసి | యభిమత క్రీడనములకు నలవరింతు.’ |
310 |
| వ. | అనుచు వెండియు నిగుడు మనోరథంబులను, భావరతంబుల, శిశిరోపచారంబులఁ బ్రొద్దు గడపి (కడపి), కడగానక. | 311 |
| క. |
‘మాయరవి యేల క్రుంకఁడొ | కో?’ యను, ‘నిట్టేల తడసెనో?’ యనుఁ; ‘గ్రుంకం బోయెడుఁ జూ యిప్పుడ’ యను | ‘దాయపఱిచె’ నను మనోజతాపము పేర్మిన్.’ |
312 |
| ఆ. |
‘దినమ కాని యింక భువనంబులం దిట | వట్టి రాత్రి లేని యట్టుగాఁగఁ జేసెనొక్కొ విధి? విశేషించి నాకకా | నేఁడ దినము సాఁగి నిలిచె నొక్కొ!’ |
313 |
| తే. |
అనుచుఁ గ్రుంకింపరానిప్రొ ద్దరసి యరసి. | శిశిర పర్యంకమున మేను చేర్చి చేర్చి, వంతఁ దలపోసి తలపోసి వనరి వనరి | మిగుల వందురి వందురి, పొగిలి పొగిలి. |
314 |
| సీ. |
తనికెడు నారటంబున నంతకంతకు | వెమ్ముచు నునికికి విడుమరయును, గోలు మసంగెడు కోర్కుల వెనువెంటఁ | బాఱుచు నునికికి నూఱటయును, వావిరిఁ బొదివెడు వగల సందడిఁబడి | యురియుచు నునికికి నుడుకువయును, నందంద కదిరెడు కొందలపాటుచేఁ | దలఁకుచు నునికికి నిలుకడయును |
|
| ఆ. |
లేమిఁ దాల్మిగొనఁగలేక యలందురి | తనువు నింద్రియములు మనము ధృతియుఁ దనవశంబుగాక తల్లడపడి సింహ | బలుఁడు విషమబాణుబారిఁ బాఱె. |
315 |
| క. |
ఇమ్మెయిని నధిక పరితా | పమ్మునఁ బడు సూతు హృదయపద్మం బలరం దమ్మికొలంకులు మొగుడ, వ | నమ్ములు సోలంగ దివసనాథుఁడు గ్రుంకెన్. |
316 |
| వ. | తదనంతరంబ. | 317 |