ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
భీమకీచకులు నర్తనశాలలోఁ గలసికొనుట (సం. 4-21-38)
వ. అప్పు డా కృశోదరి వృకోదరుకడకుం జని సమయం బయ్యె ననవుడు. 322
తే. అతఁడు పెండ్లికిఁ బిలిచినయట్లు వికచ | హృదయుఁడై తలచీర యాయితము సేసి
ద్రుపదనందనఁ జూచి ‘నాతోన వెనుక | నల్ల నంతంత నరుగుదె’ మ్మని కడంగి.
323
చ. గమనమువీఁక వేఱొక వికారము పుట్టక సంగరోత్సవో
ద్యమరభసాతిరేకము బయల్పడు టించుకలేక రోషసం
భ్రమ మొకయింతయైనఁ బరభావనిరూప్యముగాక ద్రౌపదీ
రమణుఁడు వోయె విక్రమధురంధరతం దగ నాట్యశాలకున్‌.
324
వ. చని వివేకరహితు హృదయంబునుం బోలెఁ దమోదూషితంబును, విదగ్ధ వనితా ప్రేమంబునుం బోలె దుర్నిరూపంబును, ఘోరాటవీ భాగంబునుం బోలె నిర్మనుష్యంబును, గాపురుష లక్ష్మీ విలాసంబునుం బోలె ననుపయోగ్యంబును, ననభ్యస్త శాస్త్రంబునుం బోలె దుర్గమంబును, స్వప్నలబ్ధపదార్థంబునుం బోలె నదృష్టి గోచరంబును, విషమ కావ్యంబునుం బోలె నస్పష్టాలంకారంబును, బాలిశు రాజ్యంబునుం బోలె జారచోర హృద్యంబునునైన యా నర్తనాగారంబు ముఖభాగ స్థలంబుసేరి. 325
క. కెలఁకులుఁ, బిఱింది దెసయుం, | గలయం బరికించి తన యఖండిత బాహా
బలగర్వమ యచ్చట ముం | గలిగా మదమత్తభద్రగజసదృశగతిన్‌.
326
శా. ధ్వాంతాకారితకుడ్యకుట్టిమ ఘనస్తంభావలీరూపముం,
భ్రాంతాది ప్రవిభాగ బోధ రహిత ప్రాగ్ద్వారముం, గాతర
స్వాంత త్రాసకరంబు నై, దురభివేశంబైన యా లోను ని
శ్చింతుండై సతికేలు వట్టికొని చొచ్చెన్‌ భీముఁ డత్యుగ్రతన్‌.
327
వ. ఇట్లుసొచ్చి తఱియంజని మధ్యప్రదేశంబున విరాటనందన లీలాపర్యంకం బరసి కని, దాని కనతిదూరంబునం బాంచాలి నోసరిల నునిచి, తా నా తల్పంబున నుండె; నంతం గీచకుండు. 328
క. కైసేసి మద వికారో | ల్లాసంబున మేను వొంగ లఘుగతి నుత్కం
ఠాసవపానవిధాన | వ్యాసంగతరంగితాంతరంగుం డగుచున్‌.
329
శా. సింగంబున్న గుహా నికేతమునకున్‌ శీఘ్రంబునన్‌ వచ్చు మా
తంగంబుం బురుడించుచుం బవనపుత్ర స్వీకృతంబైన యా
రంగాగారము సేరవచ్చి మదిలో రాగంబు ఘూర్ణిల్ల నిం
తిం గాముం డిఁటఁ దేఁడె యింత కని యుద్వృత్తాంగజోన్మాదుఁడై.
330
ఉ. స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధము గాఁగ శంక యొ
క్కంతయు లేక కీచకుఁ డహంకృతి ముంగలి గాఁగ మండపా
భ్యంతరభూమిఁ జొచ్చి తఱియంజని యారసి సెజ్జఁ గాంచి య
త్యంత ముదావహం బగుడు నందు రయంబునఁ గేలు సాఁచినన్‌.
331
చ. ఘనతర కోప వేగమునఁ గంపమునొందు నిజాంగకంబులం
దనధృతి పెంపు సొం పచలితంబులఁ జేయ సమీరుకూర్మినం
దనుఁడు తదీయ చేష్టలును దద్వచనంబుల చొప్పు నేర్పడం
గను మతి నూరకుండె నవికార నిగూఢ నిజ ప్రకారుఁడై.
332
ఆ. కీచకాధముండు కిమ్మీర వైరిపైఁ | గేలు సాఁచి యా విశాలనయన
గాఁ దలంచి మేను గరుపాఱ నిట్లను | మదన ఘూర్ణమాన హృదయుఁ డగుచు.
333
చ. ‘వనిత! మనోహరంబులగు వస్తువులెల్లను వేడ్క నేఱి నీ
కని నియమించి తెచ్చితిఁ బ్రియంబునఁ గైకొను; మెపు నంగనా
జనములు నన్నుఁజూచి మరు సాయకముల్‌ దమ చిత్తవృత్తు లేఁ
చినఁ గొనివచ్చి యిత్తురు విశిష్టధనంబులు నాకు లంచముల్‌.
334
సీ. నాదు రూపంబు మనంబునఁ జిక్కిన | తరుణి ద క్కొరునేల సరకుసేయు?
నాదు లావణ్యంబునకు నిచ్చ మెచ్చిన | యెలనాఁగ పైఁబడ కేల నిలుచు?
నా విలాసంబులు భావింపఁ బడసిన | యింతి పుష్పా స్త్రుచే నెట్లు బ్రదుకు?
నా వివేకమున కానందింపఁ గనిన యం | గన యెట్లు విరహాగ్నిఁ గ్రాఁగకుండు?
 
తే. మెఱయ నా యాడుమాటలు దెఱవపిండు | నుల్లములకు నింపారెడు నురులు గావె?
యిట్లు నీ వొక్కతవె నన్ను నేలుకొంటి | గాక మాట లింకేటికిఁ గమలవదన !’
335
క. అనవుడు మనమున నిస్సీ! | యని, యుచిత నిగూఢభంగు లగు భాషణముల్‌
తన ప్రియ వినిపించుట కి | ట్లనియెన్‌ మృదురీతి భీముఁ డాతనితోడన్‌.
336
తే. ‘ఇట్టివాఁడవు గావున నీవు నిన్నుఁ | బొగడికొనఁదగు; నకట! నా పోల్కి యాఁడు
దాని వెదకియు నెయ్యెడనైన నీకుఁ | బడయవచ్చునె యెఱుఁగక పలికితిట్లు.
337
క. నా యొడలు సేర్చినప్పుడ | నీ యొడలెట్లగునొ? దాని నీవెఱిఁగెదు; న
న్నే యబలలతోడిదిగాఁ | జేయఁదలంచితివి తప్పు సేసితి కంటే!
338
క. నను ముట్టి నీవు వెండియు | వనితల సంగతికిఁ బోవువాఁ డవె? యైనం
దను వేఁ బడసిన ఫలమే? | కనియెద విదె చిత్తభవవికారము లెల్లన్‌.’
339
మ. అనుచున్‌ గ్రక్కున లేచి రోషకఠినం బౌ హాస మా సూతు నె
మ్మన ముద్వేగముఁ బొందఁజేయ బలసామగ్రీసముజ్జృంభణం
బున వానిం దలవట్టి వంచుటయు నేపుం జేవయుం దోఁప వాఁ
డనుమానింపక బె ట్టదల్చికొని కోపాటోపదీప్తాంగుఁడై.
340
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )