ఇతిహాసములు భారతము విరాటపర్వము - ద్వితీయాశ్వాసము
భీమసేనుఁడు కీచకుని సంహరించుట (సం. 4-21-50)
వ. గంధర్వుం డను తలంపున. 341
చ. పవనతనూజు బాహువులు పాణియుగంబునఁ బట్టి వీఁకమై
నవనిపయిం బడం దిగిచి యంగము జానుల నూఁదినం గడున్‌
జవమున దండ తాడిత భుజంగము భంగి సముత్థితాంగుఁడై
యవయవముల్‌ ప్రకోపరభసాతిశయంబునఁ బొంగ నుద్ధతిన్‌.
342
మ. మగుడం గీచకుఁ బట్ట వాఁడును బలోన్మాదంబునన్‌ బాహు గ
ర్వ గరిష్ఠుండగు నా హిడింబరిపుఁ దీవ్రక్రోధుఁడై పట్టి బె
ట్టుగఁ ద్రోపాడఁగ నిద్దఱున్‌ భుజబలాటోపంబుమై నొండొరున్‌
మిగులం జాలక కొంతసేపు వడి మేమేఁ బోరి రుగ్రాకృతిన్‌.
343
వ. అట్టి యెడ. 344
క. తన యగపా టొరు లెఱుఁగుదు | రని సూతుఁడు సమయభంగ మగుటకు భీముం
డును గొంకుచుఁ జప్పుడు సే | యని గూఢ విమర్దనప్రహారములఁ దగన్‌.
345
వ. మల్లయుద్ధ నైపుణ్యంబు మెఱయం గడంగి. 346
సీ. తిగిచిన నడుగులు దెరలక యొండొరుఁ | గ్రమ్మఱఁ దిగుచుచుఁ గడిమి మెఱయఁ,
బొడిచిన వెస బీఱుపోవక యొండొరు | నందంద పొడుచుచు నవనిఁ బెట్టి,
యొత్తిన బెగ్గలం బొందక యొండొరు | బలువిడి నొత్తుచు నలవు మిగిలి,
యడఁగంగఁ బొదివిన నడిచిపా టించుక | యును లేక వీఁక నొండొరుల నడరి,
 
తే. యడఁగఁ బొదువుచు, నలుక యంతంత కగ్గ | లించి యాయముల్‌ నొంచి దోర్లీల నెఱపి
యుల్లసిల్లిన స్రుక్క కొండొరుల రౌద్ర | వృత్తి నొంచు చొండొరులకు వెక్కసముగ.
347
క. కదియుచుఁ బాయుచుఁ బట్టుచు | నదలుచుచుం బడుచు లేచు చడఁగుచు వడిగొం
చొదవెడుకినుకం గడు బె | ట్టిదముగఁ బెనఁగిరి చలంబు డింపక కడిమిన్‌.
348
ఆ. ఇవ్విధమున నేచి యిరువురుఁ బెద్దయుఁ | బ్రొద్దు పోర వాయుపుత్రు బలము
దోడుతోడఁబెరుఁగఁదొడఁగె నాకీచకా | ధమునిలావు పిదపఁ దఱుఁగఁజొచ్చె.
349
ఉ. దాని నెఱింగి యెంతయు నుదగ్రత నా బకవైరి గ్రక్కునన్‌
వాని నడంగఁబట్టి పడవైచి మహోగ్రత నాక్రమించెఁ బం
చానన మేణముం బొదువున, ట్లతఁ డూర్జితశక్తి నుద్భటుం
డై నెగసెన్‌ సమీరసుతు నల్కకుఁ బ్రాఁ కిడినట్లు వీఁకతోన్‌.
350
క. నెగయునెడ నగ్గమైనను | బిగియారుచుఁ బిఱుఁదుసనినఁ బిడికిటఁ గొఱసం
దిగడు బెడిదముగఁ బొడిచెం | బగతుఁడు గను మిడిసి నేలఁబడి తన్నికొనన్‌.
351
ఆ. పల్లవ ప్రసూన ఫలభరితంబగు | మ్రాను గూలఁద్రోచు మత్తగజము
పోలె వివిధ రత్నభూషణభూషితుం | డైన సూతుఁ గూల్చె ననిలసుతుఁడు.
352
చ. వికృతపుఁ జావు సంప మది వేడుక పుట్టినఁ గిట్టిపట్టిమ
స్తకమును బీన దీర్ఘ భుజశాఖలుఁ బాదయుగంబు మేనిలో
నికిఁ జొర నుగ్గుగాఁ దుఱిమి నించిన గ్రంతలతిత్తియైన కీ
చకు ధరణీస్థలిం జదిపి చక్కని ముద్దగఁ జేసెఁ దుష్టుఁ డై.
353
క. తన కడిమికలిమి నచ్చియు | మనమునఁ దలఁ కడర సూతు మరణంబు గనుం
గొనుటకుఁ దల్లడపడు ప్రియ | వనిత కతని చావు సెప్పి వడిఁ దన్మాత్రన్‌.
354
చ. అనలము గూఢ యత్నమున నయ్యెడకుం గొనివచ్చి దానిఁ జ
య్యన వెలుఁగొందఁజేయుటయు నచ్చెరువున్‌ భయముం బ్రియంబునున్‌
బెనఁగొనఁగాఁ గనుంగొనియె భీతమృగేక్షణ భీము డాయఁగాఁ
జని కడు నక్కజంబయిన చందమునం బడియున్న పీనుఁగున్‌.
355
ఉ. చూచుచుఁ జేరి వ్రేల్మిడుచుచుం దలయూఁచి విలక్షచిత్తయై
యా చపలాక్షి ముక్కుపయి నంగుళముం గదియించి ‘దీనికై
కీచక! యింత సేసితి, సుఖిత్వముఁ బొందుదుగాక! యింక న
ట్లేచిన నిట్లు గా కుడుగునే?’ యనుచున్‌ వెఱఁగందుచుండఁగన్‌.
356
క. ‘పూనిక నెఱపితి సతి యవ | మానముఁ బరితాపభరము మాన్చితి నిపు డి
ట్లే’ నని మదిఁ బొంగెడు పన | మానసుతుం డిట్టులనియె మానినితోడన్‌.
357
శా. ‘చింతాశల్యము వాసెనే? భుజబలోత్సేకంబు నీ కెక్కెనే?
శాంతిం బొందెనె రోషపావకుఁడు? దుశ్చారిత్రునిం జూచితే?
సంతోషించితె? యిట్లు గాక, బ్రదుకన్‌ శక్యంబె? దుర్వృత్తి నీ
చెంతం జేరినయట్టివీరులకు నాచేతం బయోజాననా!’
358
క. అనిన విని సింహబల మ | ర్దను నవలోకించి ద్రుపదరాజతనయ యి
ట్లనుఁ దన మనమున నిండా | రిన సమ్మోదంబు వెలివిరిసి బెరయంగన్‌.
359
సీ. ‘కొలువు లోపల నిన్న కోప మట్లెత్తినఁ | దలఁకక నిలిచిన ధైర్యమహిమ,
నేఁ డిందుఁ జనుదెంచి నిర్వికారతఁ బ్రజ | కన్నులు గప్పిన గౌరవంబు,
మనవారిలోన నొక్కని నైనఁ బిల్వ కు | త్సాహంబు సేసిన సాహసంబు,
లోకదుర్జయుఁ డగు నీ కీచకునిని వ్రే | ల్మిడి రూపుమాపిన కడిమిసొంపు
 
తే. సూడఁ, దలపోయ. మెచ్చ, సంస్తుతి యొనర్ప | నా తలంబె? నీ యుత్తమనాయకత్వ
మెఱిఁగి నినుఁ గొనియాడ నే నెంతదాన? | మహిత విస్మయానంద నిర్మగ్న నైతి’.
360
క. అను పలుకులు కర్ణరసా | యనము లగుడు నయ్యుధిష్ఠిరానుజుఁడు ముదం
బునఁ దేలిఁ ‘ యింకఁ దడయం | జన’దని ద్రౌపదికిఁ జెప్పి చయ్యన నేఁగెన్‌.
361
క. అనిన విని ‘కీచకుఁడు స | చ్చిన పిమ్మటఁ బుట్టినవ్విశేషము లెల్లన్‌
విను వేడుక మనమలరెడు | ననఘా! యేర్పడఁగఁ జెప్పు’ మనుటయుఁ బ్రీతిన్‌.
362
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )