ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
ఉపకీచకులు ద్రౌపదిం దమ యన్న శవంబుతోఁ గట్టి దహింపం గొనిపోవుట (సం. 4-21-62)
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియెఁ - బవనతనయుం డట్లు సని మహానసమందిరంబు పరిసరంబున శరీరప్రక్షాళనంబు సేసికొని, యనులేపనంబున నసృగ్గంధం బుడిపికొని, కృతకృత్యుండై, శయ్యాతలంబునం గూర్చుండె; నిట యాజ్ఞసేనియుం భీమసేనుం డింతకు వంట యింటికిం బోయి నిశ్చింతంబున నుండునని నిశ్చయించి, నర్తనశాల వెలువడి కావలివారలం బిలిచి. 2
క. ‘నా పతులగు గంధర్వుల | చేపడి మృతిఁబొందె వీఁడె సింహబలుం; డీ
పాపాత్మునిఁ జూడుఁడు దు | ర్వ్యాపారఫలంబుఁగాంచె’ నని పలుకుటయున్‌.
3
ఆ. వారు సంభ్రమించి వడిఁ గోల దివియలు | గొనుచు నులివు మిగులఁ గూడఁబాఱి
నృత్తశాలఁ జొచ్చి రత్తఱి నా కల | కల మెఱింగి కీచకవ్రజంబు.
4
చ. కడు వెస వచ్చి రూపఱినకాయము నున్నతెఱంగుఁ జూచి బి
ట్టడలు మనంబులం గదిరి హా యనువారును, జోద్యమంది మ్రా
న్పడియెడువారు, నగ్రజునిపైఁ బడి మూర్ఛలఁ బొందువారు న
య్యెడ కరుగంగ నోర్వక మహిం బెఱచోఁ బలవించువారు నై.
5
వ. ఉన్నంత బంధుజనంబులు గూడంబాఱి కీచక శవంబు గనుంగొని. 6
ఉ. ‘మానవకోటి నిట్టి విసుమానపుఁ బీనుఁగు లైనవారి నెం
దైనను గంటిమే? యకట! యాఱడి వమ్మయిపోయె; దుర్జయం
బైన బలంబు గానితెరువై తన కిత్తఱిఁ దోడు గాద; యు
క్కీని మనంబు కీడు పరికించునె? క్రొవ్వినఁ జేటు తప్పునే?’.
7
వ. అనుచు దాయం జని. 8
తే. ‘కరము లెయ్యవి? శిర మేది? గాళు లెచటఁ | జొచ్చె? గంధర్వవరులచేఁ జచ్చువార
లెల్ల నిట్టుల యగుదురో? యితనితోడి | యలుకఁ జేసిరొ? యిది కడు నక్కజంబు’.
9
వ. అని వెండియు బహుప్రకారంబులం బలుకుచు శోకవిస్మయ పరీత చేతస్కులయి యున్నంత నొక యుపకీచకుండు నిజ సహోదరులం జూచి. 10
క. ‘మన మెంత పనవి పిలిచిన | విననేర్చునె సింహబలుఁడు? వేగమ యితనిం
గొని పోవఁగ వలయుంగా’ | కని యందఱఁ దేర్చె ననునయా లాపములన్‌.
11
ఉ. సూతులు దాని కియ్యకొనుచుం దమ యన్నకు నగ్ని యేర్చు వా
రై తగ వాచరించునెడ నల్లన ద్రౌపది ‘వీరి చందముల్‌
చూతముగాక’ యంచు నొకచోఁ దమ చేరువ నున్నఁ గాంచి, సం
జాత మహోగ్రకోపులయి చారువిలోచనఁ బట్టి క్రూరతన్‌.
12
క. పెడకేలు గట్టి ‘పాపపుఁ | బొడవగు నిది గాదె యితనిఁ బొడ వడఁగించెన్‌!
గెడకూడఁ దీని నీతని | యొడలిపయిం బెట్టి కాల్చు టుచితం బరయన్‌.’
13
వ. అని విరాటున కెఱింగించి చేయువారై, యంతకుమున్న యీ వృత్తాంతం బంతయు విని సంక్షుభిత హృదయుండై యున్న యతనిపాలికిం బోయి. 14
తే. ‘ఎల్లభంగుల సైరంధ్రి నేము సింహ | బలునితోఁ జంపువారమై తలఁచి నీకు
నెఱుఁగఁ జెప్పంగ వచ్చితి; మీవు నింత | వట్టు మన్నన మాకు నీ వలయు’ ననిన.
15
వ. అతండును దన మనంబున ‘నియ్యుపకీచకుల చందంబు సూడ నేను వారించితి నేనియు నుడుగం గలవారుగా రని (యు గంధర్వులు బలవంతులు గావునఁ దద్రక్షితయైన సైరంధ్రి కపాయంబు వొంద’దని) యు నూహించి, వారలం గలయం గనుంగొని ‘యట్లకాక మీకుం బోలిన తెఱంగు సేయుం’ డనిన నదియ యనుమతిగాఁ గైకొని సరభసంబునం జనుదెంచి. 16
ఉ. ‘అంగజరాగమత్తుఁడగు నన్నకు నిమ్మెయినైనఁ బ్రీతిసే
యంగలవార, మీ జఱభి యాతనితోడన తీఱుఁగాక’ యం
చుం గొనిపోయి దైన్యమున సూతునిపీనుఁగు మీఁదఁ బాండుపు
త్రాంగనఁ బెట్టి, కట్టిరి దయాపరివర్జితచిత్తవృత్తులై.
17
చ. అశుచియుఁ గష్టుఁడున్‌ లఘువునైన నిజాగ్రజుమేనితోడ ని
త్య శుచియుఁ బుణ్యశీలయు నుదాత్తయు నాఁ జను నింతిఁ గొంచుఁ గ
ర్కశమతిఁ గీచకుల్‌ బహుముఖంబుల బాంధవ విప్రలాపముల్‌
దిశ లద్రువం జెలంగఁ గరదీపనికాయము ప్రజ్వరిల్లఁగన్‌
18
క. పితృవణము దెసకుఁ జన న | య్యతివ భయభ్రాంతచిత్తయై బాష్పజలో
ద్గతి మొగముఁగప్ప నిట్లని | యతిరావముగా నొనర్చె నాక్రందనమున్‌.
19
ఆ. ‘అనదనైతి నిచట; నాలి కుయ్యాలింపుఁ | డ కట! మీరు గలుగ నాక్రమించి
నన్నుఁ గట్టి సూతనందను లిమ్మెయి | వెఱపులేక భంగపఱుచువారు.
20
ఉ. ఆనతవైరి యో జయ! మహాద్భుతవిక్రమ యో జయంత! దు
ర్మానవిఘూర్ణమానరిపుమర్దన యో విజయాభిధాన! తే
జోనిహతాహిత ప్రకటశూర గుణప్రతిభాస యో జయ
త్సేన! విరోధి బాహుబల జృంభణభంజన యో జయద్బలా!
21
సీ. తొడఁగిన పని చలం బెడపక యతి దుష్క | రంబైనఁ గడతేర్చు ప్రభువులార!
పెనఁగిన వైవస్వతునినైనఁ గడిమిమై | వ్రేల్మిడిఁ బరిమార్చు వీరులార!
శరణార్థియగు దుష్ట శాత్రవునైనను | గరుణ రక్షించు సత్పురుషులార!
యర్థికిఁ బ్రాణంబు లైనను దాఁపక | తమకించి యిచ్చు నుదారులార!
 
తే. నాథులార! గంధర్వ రత్నంబులార | నన్ను నుపకీచకులు తమ యన్న శవము
నందు బంధించికొని వెస నరుగుచున్న | వారు; రక్షింప వేగ రావలయు మీరు.
22
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )