ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
భీముఁడు ఉపకీచకులం జంపి ద్రౌపదిని విడిపించుట (సం. 4-22-16)
చ. అని పలవించు నయ్యెలుఁగు లాపవమానతనూజుఁ డేర్పడన్‌
విని, మది ‘నాదు వల్లభకు వీండ్రును గ్రమ్మఱ నింతసేసిరే!’
యనుచు సరోష సంభ్రమత నాయితమై వెసఁబాఱి వప్ర లం
ఘన మొనరించె గుప్తముగ గ్రక్కున ముట్టెడుదానికిం దగన్‌.
23
తే. ఇట్లు లంఘించి పోయి పరేతభూమి | యొద్ద నలుదిక్కులును జూచి యొక్క యున్న
తావనీజంబు వెఱికి రౌద్రాతిరేక | మడర భుజశిఖరంబునయం దమర్చి.
24
మ. వికట భ్రూకుటి ఘోర ఫాలకలిత స్వేదోద్భటుండుం, జల
ద్వికృతోష్ఠద్వయుఁడుం, బ్రవర్ధన దశావిర్భావ సంభావితాం
గకుఁడుం, జిత్త విదాహదోహల సమగ్రక్రోధ వేగుండు నై
బకవిధ్వంసకుఁ డయ్యెడన్‌ నిలిచె శుంభన్మూర్తి విస్ఫూర్తితోన్‌.
25
వ. తదనంతరంబ. 26
ఆ. సూతుశవముతోడ నేతెంచు నెరవులు | దవ్వు దవ్వులన యుదగ్రరూప
కలితుఁడైన భీముఁ గనుఁగొని నడవక | నిలిచి దంత నంతఁ గలఁగఁబాఱి.
27
మ. ‘ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొని; రిం కెట్లొక్కొ! యంచున్‌ భయం
బొదవం బల్లములందు డాఁగియు, సమీపోర్వీజముల్‌ ప్రాఁకియుం,
జెదరం బాఱియు, నీరు సొచ్చియును, నిశ్చేష్టం బదద్వంద్వముల్‌
గుదివడ్డం బెగడొందియున్‌ భరిత సంక్షోభాత్ములై రత్తఱిన్‌’.
28
ఉ. సూతులు భీతులై ద్రుపదసూతి సమేతముగాఁగ నగ్రజ
ప్రేతమువైచి, వీటి దెసఁ బెల్లుగఁ బాఱఁ దొడంగినన్‌ వడిన్‌
వాతసుతుండు ముట్టికొని వారి బడల్పడ వ్రేసి యందఱం
జేతులతీఁట వో నుఱుము సేసె విశృంఖల విక్రమంబునన్‌.
29
వ. ఇవ్విధంబున నూటయేవు రుపకీచకులను సమయించి శమిత క్రోధుండై వచ్చి, పాంచాలికి బంధ మోక్షంబు గావించి, ‘యింక నిశ్చింతంబున సుదేష్ణ మందిరంబునకుం జను‘మని యవ్వెలందిని వీడుకొలిపి, తానును వేఱొక మార్గంబున మహానస గృహంబున కరుగుదెంచెఁ; దత్సమయంబున విరాటుండు కీచకానుజులు గంధర్వులచేత నిరవశేషంబుగా మృతిం బొందిరని విని, చకితచేతస్కుం డగుచు సహోదర మరణ శోకా యత్తచిత్త యయిన జీవితేశ్వరి నుచితాలాపంబుల ననునయించి యిట్లనియె. 30
ఆ. ‘చంద్రవదన! యింక సైరంధ్రి నిచ్చోటు | వాపవలయు నేమిభంగినైనఁ;
గాన నాదు పలుకుఁగాఁ జెప్పు వెడలుట | కనుగుణముగ నమ్మృగాక్షితోడ.
31
ఆ. పురుషు లా లతాంగి పొరువునఁ బోయినఁ | జేటువచ్చుఁ గానఁ జెప్ప నేను
వెఱతు; నాఁడువారు వెరవుతో మృదువచో | రచనఁ జెప్పు టరయ నుచిత వృత్తి.
32
ఉ. ఆ కమలాక్షి రూప మహిమాతిశయంబు మనోహరంబు; భో
గైక పరాయణుల్‌ పురుషు; లంగజుఁ డప్రతికార చేష్టెత
స్వీకృత లోకుఁ; డట్లగుటఁ జేటు పురంబునవారి కెప్పుడుం
గా కెటు లుండు? నిట్టి యవగాఢపుఁ బొత్తు మనంగ వచ్చునే?’
33
క. అని నిశ్చయించి పలికిన | విని కేకయరాజపుత్రి విభు తలఁపు మనం
బునకుఁ బ్రియం బగుటయుఁ గై | కొని యాపని యట్లచేఁతకుం బూనెఁ దగన్‌.
34
క. అంతం గుంతీనందన | కాంతా చింతా మహాంధకారముతో న
త్యంతంబు మచ్చరించెనొ | సంతమసం బనఁ బ్రభాత సమయం బయ్యెన్‌.
35
వ. పదంపడి పద్మినీ ప్రమోద సంపత్కరుం డగు నరుణకిరణుం డుదయించె; నట మున్న పాంచాలి సచేలస్నానంబుసేసి, రాగాది వికార నిరాసనంబునం బ్రసన్నయయిన బుద్ధియుంబోలె సింహబల ప్రభృతి కీచక విధ్వంసనంబునం దెలివొంది మంద మందయానంబునం బురంబు సొచ్చి రాజవీథి నరుగు దెంచునప్పుడు. 36
సీ. ‘మన కీచకుల కెల్ల మారియై పుట్టిన | సుదతి పోయెడు’ నని చూచువారు;
‘నద్దిరా! నీకుఁ గ్రొ వ్వఱుగదేఁ జూతుగా’ | కని తలసూపక యడఁగువారు;
నలవోకఁ గనుఁగొని యంతరంగము బిట్టు | బెదర మాఱుమొగంబు పెట్టువారు;
నెదురుగా వచ్చిన నెంతయేనియు దవ్వు | గలుగ వేఱొక త్రోవఁ దొలఁగువారు
 
తే. ముట్టఁబడి మేనఁ గంపంబు పుట్ట నొదిగి | యుండువారుఁ, గరంబున నుదర మప్ప
ళించి ‘యమ్మరొ! రక్కసి’ యంచు నుల్ల | ములుకువారునై పురజనంబులు తలంకి.
37
చ. పులిఁ గనుఁగొన్న లేడులునుబోలె విభీతిఁ గలంగఁబాఱ న
న్నెలఁతుక యంతరంగమున నిండిన హాస్యరసంబు మోముపై
వెలి విరియంగనీక చని వేచి మహానసశాల వాకిటన్‌
నిలిచిన భీమసేనుఁ గని నెయ్య మెదం జిగురొత్తుచుండఁగన్‌.
38
క. తన యంతన యటువలుకుచుఁ | జను విధమున నతని దిక్కు చక్కని చూడ్కిం
గనుఁగొనక ద్రుపదనృప నం | దన యిట్లను నిజ కృతార్థతం దెలుపుటకున్‌.
39
తే. ‘కీచకులదెసఁ బుట్టిన కిల్బిషంబు | పాచి నన్ను రక్షించిన పరమ ధర్మ
రతికి గంధర్వ పతికి నిరంతరంబు | భక్తి యుక్తిమైఁ బ్రణమిల్లి బ్రదుకుదాన.’
40
వ. అనిన విని యనిలనందనుండు నిగూఢవచన చాతుర్యధుర్యుండై యిట్లనియె. 41
చ. ‘అతివ! యపాయముం బొరయు నప్పుడు గావక తక్కెనేని నా
పతి పతియే? తలంప మగ పాడియె? లోకము పాడియే? భవ
త్పతు లిటు లాచరించుట గదా భవదీయ మనోనువర్తన
స్థితి కుచితంబు; వారల నుతింపఁగ నేల నిసర్గవృత్తులన్‌?’
42
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )