ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
ద్రౌపది యర్జునునితో సల్లాసంబు సేయుట (సం. 4-23-17)
తే. ఇట్లు దమ్ము నిరూపింప నితర జనము | లకు నశక్యంబుగాఁగ సల్లాపరసము
ననుభవించుచు నల్లనల్లన లతాంగి | యరిగె నర్తన మండపోపాంతమునకు.
43
వ. చని విరాట కన్యకల యాటఁ జూచు చందంబున నందుఁ బురందరనందనుం గనుంగొను నప్పాంచాలి నాలోకించి, యతండునుం దారును దదభిముఖంబుగా వచ్చి యక్కన్నియ లిట్లనిరి. 44
ఉ. ‘కీచకకోటిచేత నొక కీడును బొందక వచ్చితమ్మ? ని
న్వేచిన దుర్మదుండు జమునిం గొలువం జనెనమ్మ? యంతఁ బో
కేచిన సూతు లీయొడలి కింత యపాయ మొనర్తురమ్మ? వే
కాచి విరోధులం దునుమఁగా నిటు ముట్టుదురమ్మ నీ పతుల్‌?’
45
వ. అని తారు మున్ను విన్న కీచక వృత్తాంతంబున కనుగుణంబుగా నుపచారంబులు పలుకుచుండ నా బృహన్నల సైరంధ్రి కిట్లనియె. 46
క. ‘ఆ పాపాత్ముల నీచ | వ్యాపార క్రమము, వార లందఱు మృత్యు
ప్రాపితులైన తెఱంగును | నీ పలుకుల నెఱుఁగవలయు నెలఁతుక చెపుమా!’
47
వ. అనిన విని సైరంధ్రి సాభిప్రాయంబుగా బృహన్నల కిట్లనియె. 48
తే. ‘కన్నియల కాట గఱపుచు నున్న నీకు | నకట! సైరంధ్రి యిప్పు డేమయ్యెనేని
ఖేద మెద నించుకయు లేమిఁగాదె సస్మి | తాననంబుతో నన్నిటు లడుగుటెల్ల.’
49
వ. అనిన బృహన్నల యిట్లనియె. 50
క. ‘నీ వలుగులఁ బడుటకు దుః | ఖా వేశము నొందెనే నిరర్థక మగు ని
య్యేవపుఁ బుట్టువు పుట్టిన | నా వగ పెవ్వరికి నెక్కు నలినదళాక్షీ!
51
క. నీతోడి పరిచయము లే | దే? తలపోయఁగ ననింద్య వెందును; నీ వి
ట్లాతుర వగుటకు నా మది | నే తాపము లేదు? నైజ మెఱుఁగవు కంటే!’
52
వ. అని తాను నిజసహోదరుల యట్లపోలె వేషాంతరంబు దాల్చిన యంతియకాక యూర్వశి యిచ్చిన శాపం బనుభవించుటకు శరీరాంతర పరిగ్రహంబు చేయుటం జేసి రిపుమర్దనంబు తనకు వెరవు గాకునికి గుప్తసాభిజ్ఞానంబుగాఁ దెలిపిన బలసూదనసూను పలుకులు విని పాంచాలి యంతస్స్మిత కమనీయ కపోల యగుచు నిట్లనియె. 53
ఆ. ‘అట్లకాక యింత యననేల? నీ మది | తెఱఁగుఁ గొంత యేను నెఱుఁగకున్న
దానఁగాను; నగరఁ దగవుమై నీవు వ | ర్తించుటయ కరంబు ప్రియము నాకు.’
54
వ. అనుచుం గన్యకాజన పరివృతయై యరిగి యంతఃపురంబు సొచ్చి సహోదర మరణ శోకాతురయగు కైకేయి కడకుం జనునప్పుడు. 55
సీ. ముదమున నెలమి సొంపొదవి నెమ్మొగమునఁ | దోఁపంగ వచ్చినఁ ద్రోచి త్రోచి,
లలి నుల్లసిల్లుచు లలితలోచనదీప్తు | లడర నుంకించిన నాఁగి యాఁగి,
సంతసంబున బాలిశము లగు చెయ్వులు | దొడరఁ జూచినఁ జేయ కుడిగి యుడిగి,
మనమున నుబ్బుమై మాట నాలుకకు రాఁ | గడఁగిన నాడక కడపి కడపి.
 
తే. ధీరయై యిట్లు సమ్మదపూరమునకు | గఱువతన మను బలితంపుఁ గట్ట వెట్టి
వెలఁది యెఱుఁగనియదివోలె వికృతిలేక | యల్ల నెప్పటియట్టుల యరుగుటయును.
56
క. భయశోకంబులు తనదు హృ | దయమునఁ బిరిగొన విరాట ధరణీనాథ
ప్రియ సంభావనసేసి వి | నయపూర్వము గాఁగ ద్రుపదనందనకుఁ దగన్‌.
57
వ. ఇట్లు సంభావించి యత్తరుణిం దన పరిసరంబున నునిచికొని తదీయ వదనం బవలోకించి. 58
తే. ‘నీవు చక్కనిదానవు నెలఁత! ధైర్య | రహితచిత్తులు మగవారు; రాజు దీనిఁ
దలఁచి భయమంది నిన్ను నీ వలచు నెడకు | నరుగునట్లుగఁ బ్రార్థించి యనుపు మనియె.’
59
వ. అని తన మనంబునం గదిరిన యనుజ వియోగతాపం బుత్కటం బగుటయు వెండియు నిట్లనియె. 60
క. ‘బిరుదు గల మగలు గలరని | తరమిడి చంపింపఁ జూచెదవు; జనములు నీ
పొరువునఁ బో వెఱతురు, మా | పురమును రాష్ట్రంబు వెడలి పొమ్మెందైనన్‌.’
61
వ. అనిన విని విరాటవల్లభకు సైరంధ్రి యిట్లనియె. 62
ఉ. ‘ముందటియట్ల యింకఁ బదుమూఁడు దినంబుల మాత్రకున్‌ భవ
న్మందిరవాస మియ్యకొనినం గడతేఱు మదీయవాంఛ; యం
తం దగఁ దోఁచి మత్పతు లుదాత్తమతిన్‌ భవదీయ వాంఛితం
బుం దలకొల్పఁ జాలుదు; రపూర్వ మనఃప్రమదంబు సేకుఱున్‌.
63
క. కృత మెఱుఁగుదు, రుపకార | వ్రతమున వర్తింతు, రెపుడు వదలరు, కరుణా
న్వితు, లీ నరపతికి శుభ | ప్రతిపాదకు లగుదు రేమిభంగుల నైనన్‌.
64
వ. కావున. 65
క. సైరంధ్రి యిట్టు లనుటకుఁ | గారణము దలంప నేమిగా నోపునొ? యం
చారసి బహుప్రకార వి | చారములకుఁ జొచ్చు టుడుగు సరసిజవదనా!
66
క. ఇది యేమియైన నేమగు? | మది నా కీ చింతయేల? మన్నన యెల్లం
దుదిఁ జెఱుపక ప్రార్థన సే | యుదుఁగా కని నిశ్చయించు టుచితమె నీకున్‌?’
67
చ. అనిన సుదేష్ణ యిట్లనియె ‘నంతవునంతకు మద్గృహంబునం
దునికికి సమ్మతించితి; నిజోచితవృత్తిఁ జరింపు; నాదు నం
దనుల మదీయ వల్లభు నుదాత్తమతిం బరికించికొమ్ము; నీ
మనమున కెట్టు లూఱట సమస్తము నట్టుల చేసెదం దగన్‌.’
68
క. అని యూఱడిల్లఁ బలికిన | విని తొల్లిటియట్ల యుచితవృత్తి ద్రుపద నం
దన యుండె; నట్టియెడ ని | ట్లని మ్రోసిరి జనులు పురమునందును భూమిన్‌.
69
చ. ‘విరటు మఱంది కీచకుఁడు విక్రమ దుర్దముఁ, డన్యసైన్య భీ
కర మహనీయమూర్తి, బలగర్వ సముద్ధత చిత్తుఁ, డెందు నె
వ్వరు సరిలేరు వీని కన వాలిన దండి మగండు; సూడ న
చ్చెరు వగు చావు చచ్చె; నటుసేసిన వారట యెట్టి వీరులో!
70
తే. సింహబలుఁడు గంధర్వులచేత నొక్క | సతికిఁగా నిట్లు ఘోరంపుఁ జావు చచ్చె;
నకట! రిత్తకు రిత్త మత్స్యావనీశు | లావు గోల్పోయె; సూతకులంబు పొలిసె.’
71
వ. ఇవ్విధంబునం బ్రవర్తిల్లు జనవాదంబు గ్రమక్రమంబున సమస్తదేశంబుల నెరసి చెల్లుచుండె; నట్టియెడ. 72
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )